the villagers
-
భూములు పోతే ప్రాణాలు వదులుకుంటాం
- అధికారులకు శ్రీనగర్ గ్రామస్తుల హెచ్చరిక - పట్టా భూముల్లో చెరువు పనులు చేయొద్దని వేడుకోలు ములుగు : భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ప్రాణాలు వదులుకుటామని మండలంలోని శ్రీనగర్ గ్రామస్తులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొన్ని దశాబ్దాలుగా సాగుచేసుకుంటూ జీవిస్తున్న తమ భూములను నేడు అధికారులు చెరువు శిఖం భూములుగా పేర్కొంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరా రు. భూములపై సర్వే నిర్వహించి తమ ను ఆదుకోవాలని వేడుకున్నారు. గతం లో రైతు ల సాగుభూములు నేడు ప్రభుత్వ భూములుగా ఎలా మారాయని ప్రశ్నిస్తున్నారు. బాధి త రైతుల కథనం ప్రకారం.. మండలంలోని దేవనగర్ గ్రామపంచాయతీ పరిధి శ్రీనగర్‌కు చెందిన సుమారు 15 మంది రైతులకు మల్లంపల్లి శివారు సమీపంలోని పెద్దచెరువు కింద సర్వే నంబరు 195,198, 220/2లలో సుమా రు 32 ఎకరాల సాగుభూమి ఉంది. వారందరికీ 2000 సంవత్సరం నుంచి పహాణీలు జారీ అవుతున్నాయి. పట్టాలు అందించాలని 2009 లో రైతులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించారు. వీరిలో కొందరు పట్టాలు చేసుకోగా మరికొందరు ఇంకా చేసుకోలేదు. వీటిలో సర్వే నంబర్ 195లో 8 ఎకరా లు, 220/2లో 15, 268లో 2ఎకరాల భూమి ప్రభుత్వానిదని అధికారులు పేర్కొన్నారు. ఈ 25 ఎకరాల భూమి చెరువు శిఖం కిందికి వస్తుందని తెలిపారు. తాజాగా మళ్లీ బుధవా రం రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేయడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు చెరువు వద్దకు చేరుకుని అధికారులను నిలదీశారు. వారు పట్టించుకోకపోవడంతో మూకుమ్మడిగా మందు డబ్బాలు చేతపట్టి హెచ్చరించారు. ఈ క్రమంలో మహిళా రైతు బానోతు ఆగమ్మ ఆవేశంతో పురుగుల మందు తాగింది. గమనించిన రైతులు నిలువరించి వెంటనే మల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. కలెక్టర్ స్పందించి వాస్తవ పరిస్థితులపై సర్వే చేయాలని అప్పటివరకు పనులు జరిగేది లేదంటున్నారు. -
రిజర్వాయర్ పనులను అడ్డుకున్న గ్రామస్తులు
పరిహారం ఇస్తేనే పనులు జరగనిస్తాం కలువాయి: కలువాయి, చేజర్ల మండలాల్లోని 7 వేల ఎకరాలకు నీటిని అందించేందుకు చేపట్టిన రిజర్వాయర్ పనులను చవటపల్లి గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. రాష్ట్రప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా సోమశిల-కండలేరు వరదకాలువ(తెలుగుగంగ) కింద నాలుగు రిజర్వాయర్లు నిర్మించేందుకు రూ.24 కోట్లు మంజూరుచేసింది. కలువాయి మండలం తోపుగుంట, చవటపల్లి, కేశమనేనిపల్లి, చేజర్ల మండలం కండాపురం గ్రామాల్లో వీటిని నిర్మించ తలపెట్టారు. నాలుగు రిజర్వాయర్ల కింద 13,600 ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే మూడేళ్ల క్రితం పనులు మంజూరైనా ఒక్క రిజర్యాయర్ నిర్మాణం కూడా ఇంతవరకు పూర్తికాలేదు. తోపుగుంట, కండాపురం, కేశమనేనిపల్లి రిజర్వాయర్లు కొంతమేర పనులు చేసి వివిధ కారణాలతో అర్ధంతరంగా నిలిపివేశారు. చవటపల్లి రిజర్యాయర్ వనులు 15 రోజుల క్రితం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తమ గ్రామానికి చెందిన 600 ఎకరాలు రిజర్వాయర్ నిర్మాణంలో పోతాయని, ఆ పొలాలకు పరిహారం ఇవ్వకుండా పనులు జరుగనీయబోమని గ్రామస్తులు తేల్చిచెప్పారు. 15 రోజుల క్రితం రిజర్వాయర్ నిర్మాణం పనులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు చకచకా సాగుతున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు శనివారం పనుల జరుగుతున్న ప్రాంతం వద్దకు వెళ్లి తమ పొలాలకు పరిహారం సంగతేమిటని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. ఆ విషయం తనకు తెలియదని, అధికారులతో మాట్లాడాలని ఆయన చెప్పడంతో అక్కడ అధికారులు ఎవరూ లేకపోవడాన్ని గమనించి గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. గ్రామస్తులతో పాటు ఎస్సీ, ఎస్టీ కాలనీవాసులు పనులను అడ్డుకుని అధికారులు వచ్చి తమ పొలాలకు పరిహారం విషయం తే ల్చిన తర్వాతే పనులు చేయాలని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం రిజర్వాయర్ నిర్మాణం కోసం సర్వే చేపట్టిన నాటినుంచి అధికారులు తమ పొలాలకు పరిహారం గురించి పట్టించుకోలేదని, గ్రామంలో రైతులతో సభ కూడా ఏర్పాటు చేయలేదని వారు చెబుతున్నారు. ఈవిషయమై తాము జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ముందు పరిహారం ఇవ్వాలి గ్రామానికి చెందిన 600 ఎకరాలు రిజర్వాయర్ నిర్మాణంలో పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ఆర్డీవో, డీకేటీ పట్టా పొలాలు 400 ఎకరాలు, ఒరిజినల్ పట్టా పొలాలు 200 ఎకరాలు మునిగిపోతున్నాయి. వీటికి పరిహారం చెల్లించి పనులు చేపట్టాలి. - రైతు వెంకట ప్రసాద్ మా కుటుంబాలు వీధిన పడతాయి నాకు ప్రభుత్వం రెండెకరాల సాగు భూమి ఇచ్చింది. అందులో శనగ, మినుము, పెసర, పొగాకు లాంటి మెట్టపైర్లు సాగుచేస్తున్నాం. తమ పొలాలను లాగేసుకుని, పరిహారం కూడా ఇవ్వకుండా రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. తమ కుటుంబాలు వీధిన పడకుండా అధికారులు ఆదుకోవాలి. ఇక్కడ అందరూ నాలాంటి పేద రైతులే. -వంగపాటి కృష్ణమ్మ(దళిత మహిళారైతు) -
అయ్యా.. మా ఊరి గుర్రాన్ని వెతికిపెట్టండి
గుర్రం కోసం గ్రామస్తుల గాలింపు పోలీసులకు ఫిర్యాదు గుర్రం దొరక్కపోతే గ్రామానికి అరిష్టమట ప్రస్తుతమెక్కడ చూసినా ఈ గుర్రం గోలే రాజులు పాలించిన గ్రామమది. ఇప్పటికీ గ్రామంలో కోట, అప్పటి సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి పురాతన ఆలయంలో పూజల కోసం గ్రామస్తులు ఓ దేవర గుర్రాన్ని మేపుతున్నారు. అయితే వారం రోజులుగా ఆ గుర్రం కనిపించడం లేదు. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. గ్రామస్తులంతా ఏకమై ఆ గుర్రం కోసం ప్రత్యేక వాహనాల్లో గాలిస్తున్నారు. ఇంతకూ ఆ గ్రామమేదంటే పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం కలగటూరు సమీపంలోని అరసనపల్లె. ఆ గుర్రం కథేంటో మీరే చదవండి.. పలమనేరు: గంగవరం మండలం కలగటూరు సమీపంలోని అరసనల్లెలో పురాతన ఆలయం పక్కనే ఆంజనేయస్వామి గుడులున్నాయి. ఏటా హనుమాన్ జయంతి రోజు ఆలయ ధ్వజస్తంభంపై దీపం పెట్టి గ్రామం చుట్టూ గుర్రాన్ని మెరవణి చేయడం ఆనవాయితీ. ఆ గుర్రం నేలపై అడుగుపెట్టకుండా నడబావులు (గుర్రం నడిచే వీధుల్లో నేలైపై దస్త్రం పరుస్తూ వెళ్తారు) నిర్వహిస్తారు. గ్రామస్తులు ఏటా రోజుకు రూ.5 వేల అద్దెతో ఓ గుర్రాన్ని తీసుకొచ్చి ఈ తంతును ముగించేవారు. మూడేళ్ల క్రితం ఆలయానికి సొంతంగానే ఓ గుర్రం ఉంటే బాగుటుందని గ్రామస్తులు చందాలేసుకొని ఓ దేవర గుర్రాన్ని కొన్నారు. ఈ గుర్రం ఎవరి పంటపొలాల్లో మేసినా ఎవరూ ఏమీ మాట్లాడరు. ఎందుకంటే అది దేవుని గుర్రం కాబట్టి. గ్రామస్తులకు ఆ గుర్రమంటే ఎంతో భక్తి. అలాంటి గుర్రం వారం రోజులగా కనిపించకుండా పోయింది. గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. విచారణలు చేపట్టారు. అయినా లాభం లేకుండా పోయింది. మూడ్రోజుల క్రితం తమ దేవర గుర్రాన్ని వెతికి పెట్టాలంటూ గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ప్రత్యేక వాహనాల్లో చుట్టుపక్కల మండలాల్లోనూ గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు వద్ద సర్కస్ నడుస్తోంది. ఒకవేళ ఆ కంపెనీ వాళ్లేమైనా గుర్రాన్ని పట్టుకెళ్లారేమోనని అక్కడ కూడా విచారించారు. కానీ గుర్రం ఆచూకీ లభించలేదు. గుర్రం లేకపోతే గ్రామానికి అరిష్టమని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ గుర్రం ఎక్కడైనా కనిపిస్తే నల్లపురెడ్డి సెల్ నంబర్ 9912820315, వరదారెడ్డి సెల్ నం. 9618116436కు సమాచారమివ్వాలని, వారికి తగిన పారితోషికం అందజేస్తామని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఇదిగో పులి.. అదుగో సింహం..?
నూజివీడు : మండలంలోని రేగుంట అడవుల్లో సింహం సంచరిస్తోందంటూ గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం రేగుంట అడవుల్లో ఓ గేదె మెడభాగంలో పెద్దగాయమై చనిపోయి ఉండటాన్ని చూసిన గ్రామస్తులు, సమీపంలోనే పులి కాలును పోలిన గుర్తులను గమనించారు. దీంతో పులి చంపి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆగిరిపల్లి మండలం సీతారామపురానికి చెందిన పలువురు రైతులు తమ తోటలకు చుట్టూ కంచె వేసేందుకు అవసరమైన కంపకోసం బుధవారం అటవీప్రాంతంలో కంప నరుకుతుండగా, సాయంత్రం వేళ గట్టు కిందభాగాన ఉన్న చెరువులో ఓ జంతువు నీళ్లు తాగుతూ కనిపించిందని, దాని మెడ చుట్టూ జూలు వేలాడుతోందని, అది సింహమేనని భావించి అక్కడ నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని వారు గురువారం రేగుంట గ్రామానికి వచ్చి చెప్పారు. గ్రామస్తులు నూజివీడు అటవీశాఖాధికారులకు సమాచారమిచ్చారు. అది తోడేలు అయి ఉండవచ్చని, సింహం కాదని గ్రామస్తుల మాటలను అటవీ అధికారులు కొట్టిపారేస్తున్నారు. రేగుంట గ్రామానికి సమీపంలోని వీరమాలగట్టు, నల్లగట్టు, కొయ్యిగట్టు, బోగందారిగట్టు మధ్యలో అటవీ ప్రాంతంతో పాటు, ఎదురుగా ప్లాంటేషన్ దట్టంగా ఉంటుంది. నాలుగు రోజులుగా పులి ఉందంటూ ఓసారి, సింహం కనపడిందని ఓసారి ప్రచారం జరుగుతుండటంతో రేగుంట గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రమైతే నూజివీడు నుంచి రేగుళ్ల వెళ్లేందుకు భయపడుతున్నారు. రోడ్డుకు రెండువైపులా మామిడితోటలు ఉండటం, అది దట్టమైన అడవిని తలపిస్తుండటంతో చీకటి పడిన తరువాత అటుగా రాకపోకలు సాగించేందుకు ఎవరూ సాహసించడం లేదు. అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పడకేసిన మంచినీటి పథకాలు
మూడో వంతు పథకాల నుంచి అందని నీరు ప్రజల అవసరాల మేరకు లేని కుళాయిలు నీటి కోసం మహిళలకు తప్పని పాట్లు అక్కరకురాని బోరు బావులు అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్ : దాదాపు లక్ష జనాభా ఉన్న అనకాపల్లి పట్టణంలో 64 మంచినీటి పథకాలున్నాయి. చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కుళాయిలు ఏర్పాటు చేశారు. బోరు బావులకు లోటు లేదు. కానీ పట్టణ వాసుల గొంతు మాత్రం ఎండుతోంది. మూడో వంతు పథకాలు మూలకు చేరడం, ఉన్న కుళాయి పాయింట్ల నుంచి సరిపడే స్థాయిలో నీరందక పోవడం, బోరుబావులున్నా సరిగా అక్కరకు రాకపోవడంతో ప్రజలకు మంచినీటి కష్టాలు తీరడం లేదు. పట్టణం జీవీఎంసీలో విలీనమైతే తమ కష్టాలు తీరుతాయని భావించిన పట్టణ వాసులకు నిరాశే మిగిలింది. మన్సిపాలిటీగా ఉన్నప్పుడే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేదని ప్రజలు భావిస్తున్నారంటే వారనుభవిస్తున్న వెతలను అర్థం చేసుకోవచ్చు. మొత్తం మంచినీటి పథకాల్లో 20 వరకు పనిచేయడం లేదు. మినీ ట్యాంకుల కోసం ఏర్పాటు చేసిన మోటార్లు పనిచేయక పోవడం, కొన్నిచోట్ల పైపులు శిథిలావస్థకు చేరడం సమస్యకు కారణం. గొల్లవీధి, వేల్పులవీధి, కాయగూరల మార్కెట్, గాంధీబొమ్మ నాయబ్రాహ్మణ వీధి, గవరపాలెం సంతోషిమాత కోవెల వద్ద, ఏఎంసీ కాలనీ మాధవ్ సదన్, దాసరిగెడ్డ తదితర ప్రాంతాల్లో ఉన్న మంచినీటి పథకాలు మూలకు చేరాయి. దీంతో ఈ ప్రాంతానికి సక్రమంగా నీరు సరఫరాకాక స్థానికులు అవస్థలు పడుతున్నారు. కుళాయిల ద్వారా నీరు విడుదల చేస్తున్నా స్థానికుల అవసరాలకు సరిపోవడం లేదు. వేసవి ఎద్దడి సమయంలో ట్యాంకులతోనైనా మంచినీటిని సరఫరా చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. బోరు బావులున్నా చాలా వరకు మూలకు చేరడం, మిగిలినవి అక్కరకు రాకపోవడంతో మహిళలు మంచినీటి కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. యథేచ్ఛగా నీటి వృథా ఓవైపు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదని ప్రజలు వాపోతుంటే, ఉన్న కుళాయిల నుంచి ఎక్కడికక్కడ నీరు వృథా అవుతుండడం మరో సమస్యగా మారింది. చాలా కుళాయిలకు హెడ్స్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొనే సమయంలోనైనా నీటి వృథాను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ట్యాంకు పనిచేయడం లేదు నెల రోజుల నుంచి మంచినీటి ట్యాంకు పని చేయడం లేదు. అధికారులెవ్వరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వీధి కుళాయిలు దెబ్బతినడంతో నీరు వృథాగా పోతోంది. అధికారులు స్పందించి మంచినీటి ట్యాంకును బాగు చేయాలి. - ఎస్.సంతోషి, గొల్లవీధి -
గ్రేటర్ ఎన్నికలకు సన్నాహాలు
సాధారణ ఎన్నికల తర్వాత నిర్వహించాలని ప్రతిపాదనలు భీమిలి, అనకాపల్లికి మినహాయింపు సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత వీటిని నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే భీమిలి-జీవీఎంసీ మధ్యనున్న పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో భీమిలి విలీనంపై నీలినీడలు అలముకున్నాయి. మరోవైపు అనకాపల్లిని కూడా మినహాయించి, 72 వార్డులతోకూడిన జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. భీమిలి విలీనం వెనక్కి? తొలిసారిగా 2008-09లో అనకాపల్లి, భీమిలి విలీన ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ 2010లో జీవీఎంసీ పాలక మండలి అనుమతి కోరింది. అదే సమయంలో జన గణన జరుగుతోంది. దీంతో అనకాపల్లి ఎంపీ సబ్బం హరితోపాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ సభ్యులు విలీనాన్ని వ్యతిరేకించారు. పాలకవర్గం పదవీకాలం ముగిశాక బి.రామాంజనేయులు జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు మళ్లీ ఈ ప్రతిపాదనలు జోరందుకున్నాయి. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి ఆయనకు వత్తాసుగా నిలవడంతో మూడు స్థానిక సంస్థల నుంచి అంగీకార లేఖల్ని ప్రభుత్వానికి నివేదించారు. వీటన్నింటి ఆధారంగా గతేడాది జూలైలో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతోపాటు, ఇరు ప్రాంతాలకు జీవీఎంసీని అనుసంధానిస్తూ.. ఉన్న చెరో ఐదు ప్రంచాయతీలను కూడా విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికులు కోర్టునాశ్రయించడంతో భీమిలిని ఆనుకుని ఉన్న ఐదు గ్రామ పంచాయతీల విలీనాన్ని రద్దు చేస్తూ వాటికి ఎన్నికలు నిర్వహించారు. దీంతో భీమిలికి, జీవీఎంసీకి మధ్య లింకు తెగింది. ఈ నేపథ్యంలో భీమిలి విలీనాన్ని కూడా ఉపసంహరించుకునే దిశగా పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) ఫైల్ సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీనిపై నిర్ణయం వాయిదా పడింది. అనకాపల్లిదీ అదే దారి! భీమిలి విలీన ఉపసంహరణపై ఓ నిర్ణయానికి వచ్చేశారన్న వార్తలతో అనకాపల్లి, దాన్ని ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీలపైనా సందిగ్ధం నెలకొంది. దీన్ని కొనసాగిస్తే వార్డుల పునర్విభజన చేపట్టాలి. జన గణన చేయాలి. సామాజిక వర్గాల వారీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయాలి. వీటన్నింటికీ కనీసం ఆరు మాసాల నుంచి ఏడాది సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. గరిష్టంగా నాలుగు వార్డులకు మించి పెరగని దానికోసం అంత సమయం వృథా చేయడం ఎందుకని అధికారులు ఆలోచిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జీవీఎంసీ పాలక మండలి లేక రెండేళ్లు దాటిపోయింది. ఈ విషయాన్ని ఇప్పటికే జీవీఎంసీ యంత్రాంగం ఎంఏయూడీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో భీమిలి, అనకాపల్లి లేకుండానే జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలు ముగిశాక, కొత్త ప్రభుత్వ హయాంలో వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ ముగించడానికి ఎంఏయూడీ ఏర్పాట్లు చేస్తోంది.