గ్రేటర్ ఎన్నికలకు సన్నాహాలు
- సాధారణ ఎన్నికల తర్వాత నిర్వహించాలని ప్రతిపాదనలు
- భీమిలి, అనకాపల్లికి మినహాయింపు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత వీటిని నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే భీమిలి-జీవీఎంసీ మధ్యనున్న పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో భీమిలి విలీనంపై నీలినీడలు అలముకున్నాయి. మరోవైపు అనకాపల్లిని కూడా మినహాయించి, 72 వార్డులతోకూడిన జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
భీమిలి విలీనం వెనక్కి?
తొలిసారిగా 2008-09లో అనకాపల్లి, భీమిలి విలీన ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ 2010లో జీవీఎంసీ పాలక మండలి అనుమతి కోరింది. అదే సమయంలో జన గణన జరుగుతోంది. దీంతో అనకాపల్లి ఎంపీ సబ్బం హరితోపాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ సభ్యులు విలీనాన్ని వ్యతిరేకించారు. పాలకవర్గం పదవీకాలం ముగిశాక బి.రామాంజనేయులు జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు మళ్లీ ఈ ప్రతిపాదనలు జోరందుకున్నాయి.
జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి ఆయనకు వత్తాసుగా నిలవడంతో మూడు స్థానిక సంస్థల నుంచి అంగీకార లేఖల్ని ప్రభుత్వానికి నివేదించారు. వీటన్నింటి ఆధారంగా గతేడాది జూలైలో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతోపాటు, ఇరు ప్రాంతాలకు జీవీఎంసీని అనుసంధానిస్తూ.. ఉన్న చెరో ఐదు ప్రంచాయతీలను కూడా విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్థానికులు కోర్టునాశ్రయించడంతో భీమిలిని ఆనుకుని ఉన్న ఐదు గ్రామ పంచాయతీల విలీనాన్ని రద్దు చేస్తూ వాటికి ఎన్నికలు నిర్వహించారు. దీంతో భీమిలికి, జీవీఎంసీకి మధ్య లింకు తెగింది. ఈ నేపథ్యంలో భీమిలి విలీనాన్ని కూడా ఉపసంహరించుకునే దిశగా పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) ఫైల్ సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీనిపై నిర్ణయం వాయిదా పడింది.
అనకాపల్లిదీ అదే దారి!
భీమిలి విలీన ఉపసంహరణపై ఓ నిర్ణయానికి వచ్చేశారన్న వార్తలతో అనకాపల్లి, దాన్ని ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీలపైనా సందిగ్ధం నెలకొంది. దీన్ని కొనసాగిస్తే వార్డుల పునర్విభజన చేపట్టాలి. జన గణన చేయాలి. సామాజిక వర్గాల వారీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయాలి. వీటన్నింటికీ కనీసం ఆరు మాసాల నుంచి ఏడాది సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. గరిష్టంగా నాలుగు వార్డులకు మించి పెరగని దానికోసం అంత సమయం వృథా చేయడం ఎందుకని అధికారులు ఆలోచిస్తున్నారు.
మరోవైపు ఇప్పటికే జీవీఎంసీ పాలక మండలి లేక రెండేళ్లు దాటిపోయింది. ఈ విషయాన్ని ఇప్పటికే జీవీఎంసీ యంత్రాంగం ఎంఏయూడీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో భీమిలి, అనకాపల్లి లేకుండానే జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలు ముగిశాక, కొత్త ప్రభుత్వ హయాంలో వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ ముగించడానికి ఎంఏయూడీ ఏర్పాట్లు చేస్తోంది.