కదిరి టౌన్ :
కార్మికుల పొట్టలు కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వేమయ్య యాదవ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నరసింహులు అన్నారు. కదిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట వందలాది మంది కార్మికులతో మంగళవారం ఆందోళనకు దిగారు. ముందుగా ఎర్రజెండాలు చేతబూని స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. అంబేడ్కర్ కూడలి, ఇందిరాగాంధీ కూడలి మీదుగా ర్యాలీ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయాన్ని ముట్టిడించి అక్కడే బైఠాయించారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి నూకలు చెల్లాయని వక్తలు పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కార్మికులను ఆదుకోవాల్సిన సర్కారు అధికారంలోకి రాగానే వారి గురించే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 279 జీఓను రద్దు చేయాలని, 200 మంది దాకా ఉన్న పారిశు«ధ్ధ్యం, మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పీఎఫ్ రూ.కోటి దాకా బకాయి పేరుకుపోయిందన్నారు. బకాయినంతా పీఎఫ్ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నాయకులు ఇసాక్, ముస్తాక్ అలీఖాన్, రాజేంద్ర పాల్గొన్నారు.