కర్నూలు జిల్లా నంద్యాలలో రూ.13 కోట్ల వ్యయంతో వ్యవసాయ స్డూడియో నిర్మాణం చేపడుతున్నామని ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు రాజారెడ్డి అన్నారు.
బుక్కరాయసముద్రం : కర్నూలు జిల్లా నంద్యాలలో రూ.13 కోట్ల వ్యయంతో వ్యవసాయ స్డూడియో నిర్మాణం చేపడుతున్నామని ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు రాజారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని రేకులకుంట ఆచార్య ఎన్‌జీ రంగా పరిశోధనా కేంద్రంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. నంద్యాలలో స్టుడియో ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన సమాచారం చానల్‌లో ప్రసారం చేస్తామన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు, చర్చా కార్యక్రమాలు, రైతుల విజయ గాథలు ప్రసారం చేస్తామన్నారు.
వ్యవసాయ సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఫార్మర్ కస్టమర్ కేర్ : 18004250430, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్: 18004252960కు రైతులు ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లాలో వర్షాభావం కారణంగా రైతులు వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడితే లాభాలు ఉండవన్నారు. వ్యవసాయంతో పాటు పాడి, కోళ్ల పరిశ్రమ, ఉద్యాన పంటల సాగు, చిరుధాన్యాల సాగు చేయడం ద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించన్నారు. చిరుధాన్యాల ఉప వృత్తులు తయారు చేసుకుని మార్కెట్‌లో అమ్మితే మంచి ఆదాయం పొందవచ్చన్నారు. ఉప వృత్తుల తయారీకి సంబంధించి మిషనరీల కోసం కేవీకేలకు రూ.3.50 కోట్లు నిధులు కేటాయించామన్నారు.