భానుచందర్(ఫైల్)
నాగోలు: ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16న అదృశ్యమైన వ్యక్తి ఖమ్మం జిల్లాలోని సాగర్ ప్రధాన కాల్వలో శవమై తేలిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా, రాఘవాపురం గ్రామానికి చెందిన పదిర భాను చందర్ నగరానికి వలస వచ్చి నాగోలు సాయినగర్ గుడిసెల్లో ఉంటూ సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
కొంతకాలంగా టీఎస్ ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పని చేస్తున్నాడు. ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన భానుచందర్ తిరిగి రాలేదు. దీంతో అతని భార్య గాలింపు చేపట్టినా ఆచూకీ తెలియరాలేదు. అదే రోజు భార్యకు ఫోన్ చేసిన భానుచందర్ యాదాద్రి జిల్లా, రాయగిరిలోని ఇంటికి వస్తున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైన అతని భార్య కావ్య ఈ నెల 17న ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా ఖమ్మం జిల్లా, రఘునాథ పాలెం మండలం, మూలగూడెం వద్ద సాగర్ ప్రధాన కాల్వలో ఈనెల 21న ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు.
మృతుడి ఆనవాళ్లపై పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించడంతో అప్పటికే అతడికోసం వెతుకుతున్న ఎల్‌బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి, తదితరులు ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతడి వేలికి ఉన్న ఉంగరం ఆధారంగా భానుచందర్‌గా గుర్తించారు. ఈ మేరకు ఎల్‌బీనగర్ పోలీసు లు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నాగోలు సాయినగర్‌కు తీసుకువచ్చారు.
పాత కక్షలతోనే భాను చందర్ హత్య...
సాయినగర్ గుడిసెల్లో ఉంటున్న భాను చందర్‌కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులతో విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన మరొకరితో కలిసి భాను చందర్‌ను పథకం ప్రకారం బయటికి తీసుకెళ్లి హత్య చేసి ఖమ్మం జిల్లా, పాలేరు సమీపంలోని సాగర్ ప్రధాన కాల్వలో పారవేయగా మృతదేహం నీటిలో మూలగూడెం వరకు కొట్టు కొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన ఎల్‌బీనగర్ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం..
నిందితులను కఠినంగా శిక్షించాలి
భానుచందర్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్, పలువురు నాయకులు డిమాండ్ చేశారు.
బీజేపీ నాయకుల ధర్నా..
నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి చింతల సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సాయినగర్ కాలనీలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సురేందర్ యాదవ్ అక్కడే ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరాశోభన్ పట్ల దురుసుగా ప్రవ ర్తించాడు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. సాయినగర్ గుడిసెల వద్ద భారీ ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment