కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ
సాక్షి, షాద్‌నగర్: కెనడాలో హక్కుల సాధనకు కార్మికులు ఆందోళనకు దిగితే అక్కడి ప్రభుత్వం వారిపై కాల్పులు జరిపిందని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆర్టీసీ కార్మికులపై అదే ఫార్ములాను ప్రయోగించేందుకు కుట్రలు పన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన షాద్‌నగర్‌లో వారికి మద్దతు తెలిపారు. అనంతరం మందకృష్ణ మాట్లాడుతూ.. 1919 సంవత్సరంలో కెనడా దేశంలో కార్మికులు హక్కుల సాధనకు అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని తెలిపారు. ఈక్రమంలో నిరసన చేపట్టిన వేలమంది కార్మికులపై సర్కారు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందగా మిగతా వారు భయంతో స్వచ్ఛందంగా విధుల్లో చేరానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలోనూ అవసరమనుకుంటే కెనడా ఫార్ములాను ప్రయోగించేందుకు సీఎం కుట్ర పన్నారని ధ్వజమెత్తారు.
ఆర్టీసీ కార్మికులు ధైర్యంతో ప్రభుత్వంపై ఆందోళనకు దిగడంతో సమ్మె ముందుకు సాగుతోందని, లేదంటే కెనడా తరహాలోనే ఆందోళన మధ్యలోనే ముగిసిపోయేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఇక్కడి ఉద్యోగులను, కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనలేదని, కానీ తెలంగాణ సీఎం కార్మికులను భయభ్రాంత్రులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసిన ఆర్టీసీ కార్మికుల కష్టాలను నేడు సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను ప్రజలనుంచి దూరం చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. కార్మికుల సమ్మెకు ప్రారంభంలో ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదని, ఒక్క ఎమ్మార్పీఎస్ మాత్రమే అండగా ఉందన్నారు.
హక్కుల సాధనలో భాగంగా అమరులైన కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపేందుకు కృషిచేస్తామని మంద కృష్ణ పేర్కొన్నారు. పేదలకు ఆర్టీసీ ఎంతో అవసరమని, అలాంటి సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహ్మ, నాయకులు దర్శన్, బుర్ర రాంచంద్రయ్య, ఇటికాల రాజు, శ్రవణ్‌కుమార్, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ మ్యాకం నర్సింలు, నాయకులు ఎస్పీ రెడ్డి, అర్జున్‌కుమార్, తిరుపతయ్య, రిషికుమారి, సౌభాగ్య, రాధిక తదతరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment