సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో 12శాతం ఉన్న మాదిగలకు స్థానం కల్పిచకపోవడం.. మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతియ్యడమేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ...ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన మొదలైనప్పటి నుంచి మాదిగ, ఉప కులాలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిగ ఉప కులాలపై నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గతంలో పని చేసిన సీనియర్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపడం మాదిగలపై వివక్ష చూపడం కదా? అని నిలదీశారు. కాగా 12 శాతం ఉన్న మాదిగ, ఉప కులాలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదని.. కేవలం ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు కేటాయించడంపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
బుధవారం నుంచి ఈ నెల15 వరకు తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయితీల ముందు, 16న తహశీల్దార్ కార్యాలయల ముందు నిరసన దీక్షలు చేపడతామన్నారు. 18న అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు. దీంతోపాటు 21న వరంగల్ జిల్లాలోని హన్మకొండ కేడీసీ మైదానంలో మాదిగలు, ఉప కులాలపై ప్రభుత్వం చూపించే వివక్షపై ఆవేదన వ్యక్తం చేసేందుకు ‘ఆవేదన దీక్ష’ చేస్తామన్నారు. ఈ కార్యకమం కోసం ‘చలో వరంగల్’కి పిలుపునిస్తున్నామని తెలిపారు. ఈ దీక్షలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలుపాలి మందకృష్ణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment