![Manda Krishna Madiga Fires On CM KCR - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/27/Manda-Krishna.jpg.webp?itok=L6gDJyk0)
సాక్షి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలను విఫలం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌కు స్వార్థం తలకెక్కి.. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని నామరూపాలు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. హుజూర్‌నగర్ గెలుపుతో అహంకారం పెంచుకొని ఆర్టీసీ కార్మికులపై నోరుపారేసుకోవడం తగదన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో లేని ఫామ్ హౌస్..తెలంగాణ వచ్చాక ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఒక పక్క అప్పుల రాష్ట్రం అంటూనే.. మరోపక్క కుటుంబ ఆస్తులను పెంచుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అక్రమ ఆస్తులకు బలమైన వనరులు ప్రాజెక్టులే అని.. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు మొదటిదని మందకృష్ణ ఆరోపించారు. కేసీఆర్ అక్రమ సంపాదనకు వేరేదారి లేక ఇప్పుడు ఆర్టీసీని అమ్ముకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం పూర్తి మద్దతు ఆర్టీసీ కార్మికులకు ఉందని, కార్మికులు అధైర్యపడొద్దని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment