హైదరాబాద్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా, ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తలపెట్టిన సబ్బండ వర్గాల మహాదీక్షకు పోలీసులు అను మతి నిరాకరించారు. అయినప్పటికీ మహాదీక్షను విజయవంతం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. దీంతో మహాదీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్భంధానికి పూనుకున్నారు. మహాదీక్షకు కేంద్రంగా ఉన్న ఇందిరాపార్కు చౌరస్తాకు నాలుగుదిక్కులా మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఒకరిద్దరు అశోక్‌నగర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపే ప్రయత్నం చేసినా పోలీసులు ఎత్తుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. ఆశోక్‌నగర్ చౌరస్తాకు వచ్చిన ఆందోళనకారులను ముందుగానే అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. సాయంత్రం 6గంటల వరకు ఇందిరాపార్కు రహదారిలో ప్రయాణించడానికి అనుమతి నిరాకరించడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రభుత్వం పడిపోతుందా..?
ఒకరోజు మహాదీక్షతో ప్రభుత్వం పడిపోతుందా? అని మందకృష్ణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. హబ్సిగూడలో మందకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2009లో కేసీఆర్ 10 రోజుల దీక్ష ముగింపు సమయంలో పోలీసులు, అప్పటి సీఎం రోశయ్య ఎంతో గౌరవించారన్నారు. నేడు శాంతియుతంగా చేస్తున్న దీక్షను పోలీసులు అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. మిలియన్ మార్చ్, సడక్ బంద్, సకలజనుల సమ్మె, చలో ట్యాంక్‌బండ్‌లో పలు విగ్రహలు, వాహనాలను ధ్వంసం చేసినా ఆనాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగినీ సస్పెండ్ చేయలేదని చెప్పారు. కోర్టుకు వెళ్లి మహాదీక్షను చేపడతామని, ఆర్టీసీ సమ్మె ముగిసే వరకు ఎమ్మార్పీఎస్ కార్మికుల వెన్నంటే ఉంటుందని చెప్పారు.
మందకృష్ణను పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment