maha deeksha
-
‘సబ్బండ వర్గాల మహాదీక్ష’ను భగ్నం చేసిన పోలీసులు
హైదరాబాద్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా, ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తలపెట్టిన సబ్బండ వర్గాల మహాదీక్షకు పోలీసులు అను మతి నిరాకరించారు. అయినప్పటికీ మహాదీక్షను విజయవంతం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. దీంతో మహాదీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్భంధానికి పూనుకున్నారు. మహాదీక్షకు కేంద్రంగా ఉన్న ఇందిరాపార్కు చౌరస్తాకు నాలుగుదిక్కులా మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఒకరిద్దరు అశోక్‌నగర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపే ప్రయత్నం చేసినా పోలీసులు ఎత్తుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. ఆశోక్‌నగర్ చౌరస్తాకు వచ్చిన ఆందోళనకారులను ముందుగానే అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సాయంత్రం 6గంటల వరకు ఇందిరాపార్కు రహదారిలో ప్రయాణించడానికి అనుమతి నిరాకరించడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం పడిపోతుందా..? ఒకరోజు మహాదీక్షతో ప్రభుత్వం పడిపోతుందా? అని మందకృష్ణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. హబ్సిగూడలో మందకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2009లో కేసీఆర్ 10 రోజుల దీక్ష ముగింపు సమయంలో పోలీసులు, అప్పటి సీఎం రోశయ్య ఎంతో గౌరవించారన్నారు. నేడు శాంతియుతంగా చేస్తున్న దీక్షను పోలీసులు అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. మిలియన్ మార్చ్, సడక్ బంద్, సకలజనుల సమ్మె, చలో ట్యాంక్‌బండ్‌లో పలు విగ్రహలు, వాహనాలను ధ్వంసం చేసినా ఆనాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగినీ సస్పెండ్ చేయలేదని చెప్పారు. కోర్టుకు వెళ్లి మహాదీక్షను చేపడతామని, ఆర్టీసీ సమ్మె ముగిసే వరకు ఎమ్మార్పీఎస్ కార్మికుల వెన్నంటే ఉంటుందని చెప్పారు. మందకృష్ణను పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు -
‘ఆర్డీఎస్’పై రేపు కాంగ్రెస్ దీక్ష
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీరందిందే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు రాజోలిబండ మళ్లింపు రిపేరు పనుల్లో జాప్యానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ సోమవారం మహాదీక్షకు దిగుతోంది. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో దాదాపు 10వేల మందితో మహాదీక్ష చేపట్టాలని నిర్ణయించింది. రాజోలిబండ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 15.9 టీఎంసీల నీటితో 87 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 30 వేల ఎకరాలకు మించి అందడం లేదని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న కేసీఆర్.. రాజోలిబండను పట్టించుకోవడం లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అయిజ మండలం సిందనూరు వద్ద జరిగే ఈ మహాదీక్షలో కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, డి.కె.అరుణ, జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. 10న పీసీసీ బృందం కర్ణాటకకు బయలుదేరుతుంది. -
'నీవు ఏ కర్మాగారం నుంచి తయారయ్యావో చెప్పు'
- వచ్చే నెల 2న గుంటూరులో మహా దీక్ష -దీక్ష విజయవంతంపై నేతలతో చర్చించిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా వచ్చే నెల 2వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో మహా దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఈ దీక్షను విజయవంతం చేసే విషయమై ఆదివారం రఘువీరా హైదరాబాద్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చించారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం రాష్ట్రానికి మోసం చేయడం దారుణమైన చర్య అని ఆయన అభివర్ణించారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించే విధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భారతీయ జనతాపార్టీనే ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటోందని మొదట్లో భావించామని అయితే చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో టీడీపీ, బీజేపీ ఎంపీలతో సమావేశమై ప్రత్యేక హోదా గురించి ఇక మరచిపోండని కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అంటూ వారికి హితబోధ చేయడాన్ని బట్టి చూస్తే బాబు... ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన విషయం బహిర్గతమైందన్నారు. చంద్రబాబు, మోడీ జోడీ అద్భుతం అంటూ ఇటు టీడీపీ అటు బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం మినహా రాష్ట్ర ప్రయోజాలను కాపాడే చర్యలేవీ చేపట్టలేదనే విషయాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్లాలని ప్రార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు మాత్రం విభజన అడ్డగోలుగా చేశారని, తెలంగాణలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని పట్టుకుని వేళాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తే తెలుగుదేశం పార్టీకే మంచి పేరు వస్తుంది తప్ప కాంగ్రెస్‌కు కాదనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతో ఏడాదికి లక్ష కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 5 లక్షల కోట్లు వస్తే దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందనంతగా ఆంధ్రప్రదేశ్ ముందుంటుందన్నారు. మాట్లాడితే ప్రత్యేక హోదా విషయమై చట్టంలో ఎందుకు పొందుపరచలేదని టీడీపీ, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని దేశంలో ఇప్పటి వరకు ప్రత్యేక హోదా కల్పించి అన్ని రాష్ట్రాల్లో కూడా చట్టం చేయడం వల్ల రాలేదని కేవలం కేబినెట్ నిర్ణయాలతోనే ప్రత్యేక హోదా ఇచ్చాన్నారు. నాయకులు, కార్యకర్తలను తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ అని మిగిలిన పార్టీలకు ఆ శక్తి లేదని మహబూబ్‌నగర్ జిల్లా బహిరంగ సభలో చంద్రబాబు వెల్లడించడాన్ని ఆయన తప్పు పట్టారు. నీవు ఏ కర్మాగారం నుంచి తయారయ్యావో చెప్పాలంటూ చంద్రబాబును ప్రశ్నించారు. దీక్ష విజయవంతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు కేవీపీ రామచంద్రారావు, సి.రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు.