సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు భారతీయ జనతా పార్టీకి మద్దతునివ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఎస్సీల వర్గీకరణకు పూర్తి మద్దతు ప్రకటించడమేకాక దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాటిచ్చి తప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గంలో మాదిగలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మాదిగలను మో సం చేసిన బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని మందకృష్ణ కోరారు.
ఎమ్మార్పిఎస్‌కు అనుబంధంగా ఉన్న ఎంఎస్‌పీ ఇతర విభాగాలు సైతం బీజేపీ గెలుపు కోసం పనిచేస్తాయని తెలిపారు. సోమవారం ఆయ న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మాదిగలను ఓటుబ్యాంకు మాదిరి వాడుకుందన్నారు. ఎస్సీల వర్గీకరణ చేయాలని, లేకుంటే మాదిగలు నష్టపోతారని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్‌లు స్పష్టం చేసినప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి చేయలేదన్నారు. ఇంతకాలం ఓట్లు వేసి మోసపోయిన దళితులు, ఇప్పుడు ఆలోచించాలని సూచించారు.
బీఆర్‌ఎస్ సర్కార్ అణచివేసింది..
అదేవిధంగా రాష్ట్రంలో దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితులపై దాడులు చేయించిందని, ఎన్నో విధాలుగా అణిచివేసిందని మంద కృష్ణ గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ సర్కార్ దళితులకు భూపంపిణీ చేయకపోగా, గత ప్రభుత్వాలు పంచిన భూమిని లాక్కుందని ఆగ్రహంవ్యక్తం చేశారు. అలాంటి పార్టీకి ఓటు వేస్తే మరింత నష్టపోతామని, మాదిగలు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం ఉండటంతో కొంత ఆలస్యం జరగవచ్చని, జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు మందకృష్ణ వివరించారు.
గతవారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం వర్గీకరణపై స్పష్టత ఇచ్చారన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని, కాంగ్రెస్‌కు ఓటేస్తే రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి సీఎం అవుతారని, బీజేపీకి ఓటేస్తే బీసీ సీఎంతో పాటు ఎస్సీ వర్గీకరణ జరుగుతుందన్నారు. ఈ అంశాన్ని ప్రతిఒక దళిత ఓటరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఎమ్మార్పిఎస్‌కు ప్రధాన శత్రువులు బీఆర్‌ఎస్, కేసీఆర్ అని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటలు చెప్పడం తప్ప చేతలుండవని విమర్శించారు.
వర్గీకరణ కోసం కేంద్రానికి లేఖ రాయలంటూ గాందీభవన్‌లో వినతిపత్రం ఇస్తే తీసుకుని కనీసం మాట్లాడని వ్యక్తి రేవంత్ అన్నారు. గాం«దీభవన్ సాక్షిగా మాదిగలను రేవంత్ అవమానించారని, అలాంటి పార్టీకి ఓటు ఎందుకేయాలని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ల తర్వాత జాతీయ పార్టీ నుంచి బీసీ సీఎం హామీ వచ్చిందని, రాష్ట్రంలోని బీసీ కుల సంఘాలన్నీ బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని ఆయన అన్నారు. బీసీ రాజకీయ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆర్.కృష్ణయ్య తక్షణమే బీజేపీకి మద్దతు ప్రకటించాలని మందకృష్ణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment