మీడియాతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో మందకృష్ణ
అంబర్‌పేట: అణగారిన వర్గాల కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎంతో కృషి చేశారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించడానికి ఢిల్లీకి వచ్చిన మందకృష్ణ ప్రమాదానికి గురయ్యారని, అది దురదృష్టకరమన్నారు. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిసారి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వర్గీకరణ అంశాన్నే ప్రస్తావించే వారని చెప్పారు. అణగారిన వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. మందకృష్ణ త్వరగా కోలుకొని ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో ప్రమాదానికి గురైన మందకృష్ణ మాదిగను కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు స్వయంగా వెంటపెట్టుకొని తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి వందలాది మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య డీడీ కాలనీలో ఉన్న నివాసానికి ర్యాలీగా వచ్చారు.
ఉద్యమాలకు అండగా కిషన్‌రెడ్డి
కొన్నేళ్లుగా అనేక ప్రజా ఉద్యమాలకు కిషన్‌రెడ్డి అండగా ఉంటూ వస్తున్నారని, ఇది ఆయన అణగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనమని మందకృష్ణ మాదిగ చెప్పారు. తాను ప్రజల పక్షాన పోరాడితే అవే అంశాలను కిషన్‌రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తుతూ పరిష్కారానికి చొరవ తీసుకున్నారన్నారు. దళితులను మోసం చేసినందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. పథకం కింద దళితులకు డబ్బులు ఇచ్చి వాటిపై కలెక్టర్ పెత్తనం చేయడమే పెద్ద కుట్ర అని అన్నారు. ఒక్క హుజురాబాద్‌కే దళితబంధు పథకం కింద రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని ప్రకటించిన కేసీఆర్, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ఎన్ని వేల కోట్లు అవుతాయి, ఎలా తెస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనలో మోదీకి అండగా నిలవాలి
దేశాన్ని ‘ఆత్మనిర్భర్ భారత్’గా రూపొందించేందుకు ప్రతిఒక్కరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరచాలని పర్యాటక, సాంస్కృతిక, శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ నీతివంతమైన పాలనను అందించి ప్రపంచదేశాల్లో భారత్‌కు గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి అక్టోబర్ 7వ తేదీతో 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకోనున్న సందర్భంగా నరేంద్రమోదీ–‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ఇంగ్లిష్ పుస్తకం తెలుగు అనువాదాన్ని ఆదివారం కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలను గురించి ఈ పుస్తకంలో వివరించారని, దీన్ని ఇతర భాషల్లోకి తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపినట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment