
బూర్గంపాడు: పినపాక పట్టీనగర్ గ్రామానికి చెందిన రొడ్డా వెంకటేశ్వర్లు పుట్టుకతోనే మూగ, చెవుడు. ఇతను రెండేళ్ల క్రితం పాల్వంచకు పనికి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతని కోసం కుటుంబసభ్యులు తీవ్రంగా గాలించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అచూకీ దొరకలేదు. ఈ నెల 18న గ్రామానికి చెందిన నాగేంద్రబాబు టిక్‌టాక్ చూస్తుండగా ఓ వీడియోలో వెంకటేశ్వర్లు కనిపించాడు. విషయాన్ని ఆ యువకుడు వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. వారు కూడా ఆ వీడియోను చూసి వెంకటేశ్వర్లుగా నిర్ధారించుకున్నారు. ఆ టిక్‌టాక్ పోస్ట్ చేసిన ఐడీ ఆధారంగా అతను పంజాబ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లేందుకు స్థానిక ఎస్‌ఐ బాలకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత సహకారం కోరారు.
వెంకటేశ్వర్లును అప్పగిస్తున్న పంజాబ్ పోలీసులు
వారు జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌కు సమాచారమిచ్చారు. వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు పంజాబ్‌లోని లూథియానాకు వెళ్లి అతనిని తీసుకొచ్చేందుకు అనుమతిలిచ్చారు. వెంకటేశ్వర్లు కుమారుడు పెద్దిరాజు కారులో పంజాబ్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసుల నుంచి ఇబ్బందులు వచ్చాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌తో అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడించి వెంకటేశ్వర్లును కలుసుకున్నారు. ఆదివారం అతనిని తీసుకుని తిరుగుపయనమయ్యారు. రెండేళ్ల క్రితం అదృశ్యమైన వెంకటేశ్వర్లు టిక్‌టాక్ వీడియోతో తమకు దొరకటం ఆనందంగా ఉందని కుటుంబసభ్యులు ఆదివారం తెలిపారు. తమకు సహకరించిన పోలీస్ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment