నూజివీడు : మండలంలోని రేగుంట అడవుల్లో సింహం సంచరిస్తోందంటూ గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం రేగుంట అడవుల్లో ఓ గేదె మెడభాగంలో పెద్దగాయమై చనిపోయి ఉండటాన్ని చూసిన గ్రామస్తులు, సమీపంలోనే పులి కాలును పోలిన గుర్తులను గమనించారు. దీంతో పులి చంపి ఉంటుందని భావిస్తున్నారు.
అయితే ఆగిరిపల్లి మండలం సీతారామపురానికి చెందిన పలువురు రైతులు తమ తోటలకు చుట్టూ కంచె వేసేందుకు అవసరమైన కంపకోసం బుధవారం అటవీప్రాంతంలో కంప నరుకుతుండగా, సాయంత్రం వేళ గట్టు కిందభాగాన ఉన్న చెరువులో ఓ జంతువు నీళ్లు తాగుతూ కనిపించిందని, దాని మెడ చుట్టూ జూలు వేలాడుతోందని, అది సింహమేనని భావించి అక్కడ నుంచి పారిపోయారు.
ఈ విషయాన్ని వారు గురువారం రేగుంట గ్రామానికి వచ్చి చెప్పారు. గ్రామస్తులు నూజివీడు అటవీశాఖాధికారులకు సమాచారమిచ్చారు. అది తోడేలు అయి ఉండవచ్చని, సింహం కాదని గ్రామస్తుల మాటలను అటవీ అధికారులు కొట్టిపారేస్తున్నారు. రేగుంట గ్రామానికి సమీపంలోని వీరమాలగట్టు, నల్లగట్టు, కొయ్యిగట్టు, బోగందారిగట్టు మధ్యలో అటవీ ప్రాంతంతో పాటు, ఎదురుగా ప్లాంటేషన్ దట్టంగా ఉంటుంది.
నాలుగు రోజులుగా పులి ఉందంటూ ఓసారి, సింహం కనపడిందని ఓసారి ప్రచారం జరుగుతుండటంతో రేగుంట గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రమైతే నూజివీడు నుంచి రేగుళ్ల వెళ్లేందుకు భయపడుతున్నారు. రోడ్డుకు రెండువైపులా మామిడితోటలు ఉండటం, అది దట్టమైన అడవిని తలపిస్తుండటంతో చీకటి పడిన తరువాత అటుగా రాకపోకలు సాగించేందుకు ఎవరూ సాహసించడం లేదు. అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇదిగో పులి.. అదుగో సింహం..?
Published Fri, Sep 5 2014 3:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement