అయ్యా.. మా ఊరి గుర్రాన్ని వెతికిపెట్టండి
- గుర్రం కోసం గ్రామస్తుల గాలింపు
- పోలీసులకు ఫిర్యాదు
- గుర్రం దొరక్కపోతే గ్రామానికి అరిష్టమట
- ప్రస్తుతమెక్కడ చూసినా ఈ గుర్రం గోలే
రాజులు పాలించిన గ్రామమది. ఇప్పటికీ గ్రామంలో కోట, అప్పటి సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి పురాతన ఆలయంలో పూజల కోసం గ్రామస్తులు ఓ దేవర గుర్రాన్ని మేపుతున్నారు. అయితే వారం రోజులుగా ఆ గుర్రం కనిపించడం లేదు. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. గ్రామస్తులంతా ఏకమై ఆ గుర్రం కోసం ప్రత్యేక వాహనాల్లో గాలిస్తున్నారు. ఇంతకూ ఆ గ్రామమేదంటే పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం కలగటూరు సమీపంలోని అరసనపల్లె. ఆ గుర్రం కథేంటో మీరే చదవండి..
పలమనేరు: గంగవరం మండలం కలగటూరు సమీపంలోని అరసనల్లెలో పురాతన ఆలయం పక్కనే ఆంజనేయస్వామి గుడులున్నాయి. ఏటా హనుమాన్ జయంతి రోజు ఆలయ ధ్వజస్తంభంపై దీపం పెట్టి గ్రామం చుట్టూ గుర్రాన్ని మెరవణి చేయడం ఆనవాయితీ. ఆ గుర్రం నేలపై అడుగుపెట్టకుండా నడబావులు (గుర్రం నడిచే వీధుల్లో నేలైపై దస్త్రం పరుస్తూ వెళ్తారు) నిర్వహిస్తారు. గ్రామస్తులు ఏటా రోజుకు రూ.5 వేల అద్దెతో ఓ గుర్రాన్ని తీసుకొచ్చి ఈ తంతును ముగించేవారు.
మూడేళ్ల క్రితం ఆలయానికి సొంతంగానే ఓ గుర్రం ఉంటే బాగుటుందని గ్రామస్తులు చందాలేసుకొని ఓ దేవర గుర్రాన్ని కొన్నారు. ఈ గుర్రం ఎవరి పంటపొలాల్లో మేసినా ఎవరూ ఏమీ మాట్లాడరు. ఎందుకంటే అది దేవుని గుర్రం కాబట్టి. గ్రామస్తులకు ఆ గుర్రమంటే ఎంతో భక్తి. అలాంటి గుర్రం వారం రోజులగా కనిపించకుండా పోయింది. గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. విచారణలు చేపట్టారు. అయినా లాభం లేకుండా పోయింది. మూడ్రోజుల క్రితం తమ దేవర గుర్రాన్ని వెతికి పెట్టాలంటూ గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతటితో ఆగకుండా ప్రత్యేక వాహనాల్లో చుట్టుపక్కల మండలాల్లోనూ గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు వద్ద సర్కస్ నడుస్తోంది. ఒకవేళ ఆ కంపెనీ వాళ్లేమైనా గుర్రాన్ని పట్టుకెళ్లారేమోనని అక్కడ కూడా విచారించారు.
కానీ గుర్రం ఆచూకీ లభించలేదు. గుర్రం లేకపోతే గ్రామానికి అరిష్టమని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ గుర్రం ఎక్కడైనా కనిపిస్తే నల్లపురెడ్డి సెల్ నంబర్ 9912820315, వరదారెడ్డి సెల్ నం. 9618116436కు సమాచారమివ్వాలని, వారికి తగిన పారితోషికం అందజేస్తామని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.