
గుర్రపు స్వారీపై యువతతో పాటు సీనియర్ సిటిజన్స్ సైతం మక్కువ చూపుతున్నారు. ఆరు నుంచి అరవై సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ వరకూ గుర్రపు స్వారీ చేయవచ్చు. ప్రముఖ సినీ స్టార్స్, వీఐపీలు, టాప్ మాడల్స్ గుర్రపు స్వారీ నేర్చుకోడానికి క్యూ కడుతున్నారు. గుర్రపు స్వారీపై ప్రజల ఆసక్తిని గమనించిన హార్స్ ట్రైనర్స్ మేలు జాతి గుర్రాలను తెచ్చి హార్స్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు ఈక్వీరిస్టియన్ క్రీడకు ఆదరణ పెరుగుతుండడంతో వర్థమాన క్రీడాకారులు కూడా హార్స్ రైడింగ్ క్లబ్స్‌కు వెళ్తున్నారు.
గుర్రపు స్వారీ శిక్షణలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎంఏ.వహాబ్ శిక్షణ పొందిన మేలు జాతి గుర్రాలను సేకరించి షేక్‌పేట్, గండిపేట్, తదితర ప్రాంతాల్లో హార్స్ రైడింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేశారు. కాగా గుర్రపు స్వారీకి వయసు అడ్డంకి కాకపోవడంతో తమ క్లబ్‌లకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందన్నారు.
మచ్చిక చేసుకుంటే సులువే..
రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్ నగరంలో గుర్రపు స్వారీపై అంత మోజు లేకుండాపోయేది. రాను రాను యువత గుర్రపు స్వారీ నేర్చుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. గుర్రపు స్వారీ నేర్చుకోడం ఎంతో సులువు. గుర్రపు స్వారీ చేయడానికి డ్రెస్ కోడ్ నిబంధన కూడా ఉంది. పుల్ ష్యూజ్, జాకెట్, హెల్మెట్ తప్పకుండా ఉండాల్సిందే. గుర్రాన్ని ఒక్కసారి మచ్చిక చేసుకుంటే ఆ గుర్రం ఏ మాత్రం బెట్టుచేయకుండా ఉంటుంది.
గుర్రాన్ని అదుపు చేయడంలో కళ్లెం ఎంతో ముఖ్యం. అయితే తనపై స్వారీ చేసే వారు తనపై ఏమాత్రం దౌర్జన్యం చేసిన శిక్షణ పొందిన గుర్రం తనపై ఉన్న వ్యక్తిని కిందపడేయడం ఖాయం. ట్రైనర్ చెప్పినట్లు గుర్రాన్ని అదుపులో పెట్టుకుంటే సులువుగా ఎంత దూరమైన స్వారీ చేయవచ్చు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని షేక్‌పేట్, రేతిబౌలి, రింగ్‌రోడ్ తదితర ప్రాంతాల్లోని హార్స్ రైడ్ క్లబ్‌ల వారు వేసవిలో ప్రత్యేక గుర్రపు స్వారీ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. కాగా గుర్రంపై సవారీ చేయడం ఒక విభిన్నమైన అనుభూతిని కలిగించడమే కాకుండా గుర్రంపై స్వారీ చేసే వారు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారని శిక్షకులు అంటున్నారు.
(చదవండి: National Technology Day 2025: నైపుణ్యాలున్న యువతకు స్వర్గధామం భాగ్యనగరం)