హార్ట్స్‌.. రైడింగ్‌.. | Hyderabad People Interest Horse Riding | Sakshi
Sakshi News home page

హార్ట్స్‌.. రైడింగ్‌..

Published Tue, Dec 24 2024 7:03 AM | Last Updated on Tue, Dec 24 2024 7:03 AM

Hyderabad People Interest Horse Riding

 నగర యువతలో పెరుగుతున్న ఆసక్తి 

 శివారు ప్రాంతాల్లో కొత్తగా శిక్షణా కేంద్రాలు 

సొంత గుర్రాల కొనుగోలుపై  పలువురి దృష్టి 

 ప్రత్యేక ట్రైనర్లను నియమించుకుంటున్న రైడర్స్‌ 

శిక్షణ పొందిన ఇండియన్, బ్రిటిష్‌ బ్రీడ్‌లకు గిరాకీ 
 

గుర్రపు స్వారీ నేర్చుకోవడం అనేది నగరంలో ఒక నయా ట్రెండ్‌గా మారుతోంది. విద్యార్థి దశ నుంచే గుర్రమెక్కాలని టీనేజర్స్‌ తహతహలాడుతున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల అభిరుచి, ఆసక్తులను గమనించి ఆ మేరకు ప్రోత్సహిస్తున్నారు. నగరంలోని కొంత మంది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు ఏకంగా గుర్రాన్ని కొనుగోలు చేసుకుని, ప్రత్యేకంగా శిక్షకుడిని నియమించుకుంటున్నారు. పిల్లలకు గుర్రపు స్వారీలో మెళకువలు నేరి్పస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరికొంత మంది మాత్రం శిక్షణా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరంలో గుర్రపు స్వారీ శిక్షణా కేందాల సంఖ్య పెరుగుతోంది. పూర్తి స్థాయి శిక్షణ పొందిన ఇండియన్, బ్రిటిష్‌ బ్రీడ్‌ గుర్రాలకు స్థానికంగా గిరాకీ ఏర్పడింది. 
 
నగరానికి చెందిన పలువురు ఔత్సాహికులు బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, జోథ్‌పూర్‌ తదితర ప్రాంతాల నుంచి రూ.లక్షలు వెచి్చంచి గుర్రాలను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఫాం హౌస్‌లు, ఖాళీ ప్రదేశాల్లో ప్రత్యేకించి ఇసుకతో కూడిన మెత్తని నేలలను శిక్షణా కేంద్రాలుగా తయారు చేస్తున్నారు. శిక్షణ తీసుకునే వారు ప్రమాదవశాత్తూ కిందపడినా దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుర్రం ఎక్కడం ఎలా, కుడి, ఎడమ ఎటు వైపు తిప్పాలంటే ఎలాంటి సంకేతాలు ఇవ్వాలి, గుర్రాన్ని ఆపడానికి ఏం చేయాలనే విషయాలు శిక్షకులు ముందుగానే పిల్లలకు బోధిస్తున్నారు.  

ఏడు వేల నుంచి.. 
హార్స్‌ రైడింగ్‌ అనుకున్నంత సులువైనదేమీ కాదు. ఇందుకు చాలా ఏకాగ్రత, దృష్టికేంద్రీకరణ ఉండాలి. ముఖ్యంగా గుర్రంపై కూర్చోవడమే ఓ పెద్ద సవాలుగా ఉంటుంది. కూర్చున్నాక అది ఎటు వెళుతుందనేదీ ముందుగానే పసిగట్టాల, మన దారిలోకి తెచ్చుకోగల నైపుణ్యాన్ని సాధించాలి. చాలా మంది పిల్లలు నెల నుంచి రెండు నెలల్లో అశ్వాన్ని అదుపులోకి తెచ్చుకోగలుగుతున్నారని శిక్షకులు చెబుతున్నారు. కాగా శిక్షణకు గానూ పెద్దవాళ్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, పిల్లలకు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ ఫీజు తీసుకుంటున్నారు. 

రిచ్‌మ్యాన్‌ గేమ్‌.. 
గుర్రపు స్వారీ అనేది రిచ్‌మ్యాన్‌ గేమ్‌. సామాన్యులకు గుర్రం కొనుగోలుచేయడం, పోషించడం, శిక్షణకు అవసరమైన విధంగా తీర్చిదిద్దడం, అనారోగ్య సమస్యలు వచి్చనప్పుడు దాన్ని బాగోగులు.. ఇలా అన్నీ ఖర్చుతో కూడుకున్న పనులే. ఆరోగ్యంగా ఉన్న గుర్రానికి నెలకు కనీసం రూ.25 వేలు, ఆపైనే వెచి్చంచాల్సి ఉంటుంది. జంతువులను మచి్చక చేసుకోవడం, వాటితో స్నేహంచేయడం, జాగ్రత్తగా చూసుకోవడంలో ఎంతో సంతృప్తినిస్తుందని పలువురు నిర్వాహకులు చెబుతున్నారు. జంతువుల నుంచి కొత్తవిషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని ట్రైనర్స్‌ పేర్కొంటున్నారు.

వారాంతంలో రైడ్స్‌..
నగరంలోని కొన్ని క్లబ్‌లు వారాంతంలో ప్రత్యేకంగా హార్స్‌ రైడ్స్‌ నిర్వహిస్తున్నాయి. ప్రశాంతమైన ప్రకృతిలో గుర్రపు స్వారీ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. గ్రూప్‌ ఆఫ్‌ పీపుల్స్‌ కలుసుకుని, హాయిగా ఎంజాయ్‌ చేస్తున్నారు. గండిపేట్, ఎల్‌బీ నగర్, ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి హార్స్‌ రైడింగ్‌ కనిపిస్తోంది.

ఇదో హాబీలా..
పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన గుర్రాలను మాత్రమే గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు వచ్చేవారికి ఇస్తాం. మొత్తం 25 గుర్రాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసు్కలు ఎక్కువ మంది శిక్షణ తీసుకోడానికి వస్తున్నారు. ఉత్తర భారత దేశంలో గుర్రపు స్వారీకి ఎక్కువ డిమండ్‌ ఉంది. హైదరాబాద్‌లో ఇటీవల కాలంలోనే ఆ ట్రెండ్‌ మొదలైంది. ఇదొక హాబీలా మారిపోయింది. డిల్లీ, జైపూర్, జోథ్‌పూర్, ముంబయి, గుజరాత్‌ తదితర ప్రాంతాల్లో గుర్రపు క్రీడల పోటీలకు వెళుతుంటాం. 
– సయ్యద్‌ మాజ్, ట్రైనర్, క్రాస్‌ కంట్రీ క్లబ్‌ హైదరాబాద్‌

నవాబుల కాలం నుంచే హైదరాబాద్‌లో గుర్రపు స్వారీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడదే క్రేజ్‌గా మారుతోంది. నగరంలో రాత్రి పూట పలువురు గుర్రాలపై సంచరిస్తున్న సందర్భాలూ కనిపిస్తున్నాయి. అయితే వారికి తిరిగేందుకు వాహనాలు అందుబాటులో లేక ఇలా వస్తున్నారనుకుంటే పొరపాటే.. అందరిలోకీ ప్రత్యేకంగా ఉండాలనే దృష్టితో కొందరు.. గుర్రపు స్వారీపై మక్కువతో మరికొందరు ఇలా చేస్తున్నామంటున్నారు.  

స్వారీ చాలా నేరి్పస్తుంది.. 
కరోనా లాక్‌డౌన్‌ సమయంలో గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. శరీరంలోని కండరాల అమరిక, ఆత్మస్థైర్యం, పాజిటివ్‌ థింకింగ్, సెల్ఫ్‌ కంట్రోల్, జంతువుల పట్ల గౌరవం, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం, క్లాస్, మీటింగ్, ఓపెన్‌ ప్లేస్‌ ఎక్కడైనా మాట్లాడగలిగే వాక్చాతుర్యం, ఇలా అన్నీ కలిపి ఒక ప్యాకేజీలా వచ్చాయి. నేర్చుకునేందుకు పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన గుర్రం కొనుగోలు చేసుకున్నాం. దాన్ని నిర్వహణ కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వారాంతాల్లో రైడ్స్‌కి వెళుతుంటాం. ఆ గుర్రమే మనకు అన్నీ నేరి్పస్తుంది. 
– ఇషాన్‌ శర్మ, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, మణికొండ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement