పరిహారం ఇస్తేనే పనులు జరగనిస్తాం
కలువాయి: కలువాయి, చేజర్ల మండలాల్లోని 7 వేల ఎకరాలకు నీటిని అందించేందుకు చేపట్టిన రిజర్వాయర్ పనులను చవటపల్లి గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. రాష్ట్రప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా సోమశిల-కండలేరు వరదకాలువ(తెలుగుగంగ) కింద నాలుగు రిజర్వాయర్లు నిర్మించేందుకు రూ.24 కోట్లు మంజూరుచేసింది. కలువాయి మండలం తోపుగుంట, చవటపల్లి, కేశమనేనిపల్లి, చేజర్ల మండలం కండాపురం గ్రామాల్లో వీటిని నిర్మించ తలపెట్టారు. నాలుగు రిజర్వాయర్ల కింద 13,600 ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే మూడేళ్ల క్రితం పనులు మంజూరైనా ఒక్క రిజర్యాయర్ నిర్మాణం కూడా ఇంతవరకు పూర్తికాలేదు.
తోపుగుంట, కండాపురం, కేశమనేనిపల్లి రిజర్వాయర్లు కొంతమేర పనులు చేసి వివిధ కారణాలతో అర్ధంతరంగా నిలిపివేశారు. చవటపల్లి రిజర్యాయర్ వనులు 15 రోజుల క్రితం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తమ గ్రామానికి చెందిన 600 ఎకరాలు రిజర్వాయర్ నిర్మాణంలో పోతాయని, ఆ పొలాలకు పరిహారం ఇవ్వకుండా పనులు జరుగనీయబోమని గ్రామస్తులు తేల్చిచెప్పారు. 15 రోజుల క్రితం రిజర్వాయర్ నిర్మాణం పనులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. అధికారుల పర్యవేక్షణ లేకుండానే పనులు చకచకా సాగుతున్నాయి.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు శనివారం పనుల జరుగుతున్న ప్రాంతం వద్దకు వెళ్లి తమ పొలాలకు పరిహారం సంగతేమిటని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. ఆ విషయం తనకు తెలియదని, అధికారులతో మాట్లాడాలని ఆయన చెప్పడంతో అక్కడ అధికారులు ఎవరూ లేకపోవడాన్ని గమనించి గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. గ్రామస్తులతో పాటు ఎస్సీ, ఎస్టీ కాలనీవాసులు పనులను అడ్డుకుని అధికారులు వచ్చి తమ పొలాలకు పరిహారం విషయం తే ల్చిన తర్వాతే పనులు చేయాలని స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం రిజర్వాయర్ నిర్మాణం కోసం సర్వే చేపట్టిన నాటినుంచి అధికారులు తమ పొలాలకు పరిహారం గురించి పట్టించుకోలేదని, గ్రామంలో రైతులతో సభ కూడా ఏర్పాటు చేయలేదని వారు చెబుతున్నారు. ఈవిషయమై తాము జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ముందు పరిహారం ఇవ్వాలి
గ్రామానికి చెందిన 600 ఎకరాలు రిజర్వాయర్ నిర్మాణంలో పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ఆర్డీవో, డీకేటీ పట్టా పొలాలు 400 ఎకరాలు, ఒరిజినల్ పట్టా పొలాలు 200 ఎకరాలు మునిగిపోతున్నాయి. వీటికి పరిహారం చెల్లించి పనులు చేపట్టాలి.
- రైతు వెంకట ప్రసాద్
మా కుటుంబాలు వీధిన పడతాయి
నాకు ప్రభుత్వం రెండెకరాల సాగు భూమి ఇచ్చింది. అందులో శనగ, మినుము, పెసర, పొగాకు లాంటి మెట్టపైర్లు సాగుచేస్తున్నాం. తమ పొలాలను లాగేసుకుని, పరిహారం కూడా ఇవ్వకుండా రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. తమ కుటుంబాలు వీధిన పడకుండా అధికారులు ఆదుకోవాలి. ఇక్కడ అందరూ నాలాంటి పేద రైతులే.
-వంగపాటి కృష్ణమ్మ(దళిత మహిళారైతు)
రిజర్వాయర్ పనులను అడ్డుకున్న గ్రామస్తులు
Published Sun, Mar 15 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement