![Karnataka labour department officials visited Infosys campuses in Bengaluru and Mysuru](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/infy01.jpg.webp?itok=cBe1x5aI)
కర్ణాటక కార్మిక శాఖ అధికారులు బెంగళూరు, మైసూరులోని ఇన్ఫోసిస్(Infosys) క్యాంపస్‌లను సందర్శించారు. ఇటీవల కంపెనీ ఉద్యోగులను భారీగా తొలగించిందనే ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. రెండున్నరేళ్ల క్రితం నియమితులైన సుమారు 700 మంది ట్రెయినీలను ఇన్ఫోసిస్ తొలగించిందని ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) ఆరోపించింది. అయితే, సంస్థ మూడుసార్లు నిర్వహించిన ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలో సదరు ఉద్యోగులు ఉత్తీర్ణత సాధించలేదని ఇన్ఫోసిస్ తెలిపింది. దాంతో నిబంధనలకు అనుగుణంగానే వారు రాజీనామా చేసినట్లు చెప్పింది. ఈ ఉద్యోగుల సంఖ్య కూడా 350 మాత్రేమేనని కంపెనీ వాదిస్తోంది.
ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, తదనుగుణంగా ఫిర్యాదుదారులకు వివరాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దాంతో ఇటీవల అధికారులు స్థానిక క్యాంపస్‌లను సందర్శించి విచారణ జరిపారు.
స్నేహపూర్వక విధానాలు..
కంపెనీపై వస్తోన్న ఆరోపణలకు ప్రతిస్పందనగా ఇన్ఫోసిస్ ఉద్యోగుల స్నేహపూర్వక విధానాలకు కట్టుబడి ఉందని నొక్కి చెప్పింది. నియామక ఒప్పందాలకు అనుగుణంగానే తొలగింపులు జరిగాయని కంపెనీ పేర్కొంది. ఉద్యోగులు కంపెనీకి అవసరమైన నైపుణ్యాలు, ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైతే కలిగే పరిణామాలపై స్పష్టమైన మార్గదర్శకాలున్నట్లు చెప్పింది. దానివల్లే కొందరికి లేఆఫ్స్ అనివార్యం అయ్యాయని స్పష్టం చేసింది. తమ ఉద్యోగుల నైపుణ్యాలు, పనితీరును నిర్ధారించడానికి ఈ చర్యలు ఎప్పటినుంచో అమల్లో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
ఇదీ చదవండి: శ్రీలంక పవర్ ప్రాజెక్టుల నుంచి అదానీ బయటకు
స్పష్టత కోసం ఎదురుచూపులు
ఈ నేపథ్యంలో పరిస్థితిని అంచనా వేయడం, ఇన్ఫోసిస్ అమలు చేస్తున్న చర్యలు కార్మిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం కర్ణాటక కార్మిక శాఖ దర్యాప్తు లక్ష్యం. దర్యాప్తు కొనసాగుతుండటంతో ఇన్ఫోసిస్ బాధిత ఉద్యోగులు ఈ విషయంపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ పరిశ్రమలో ఉద్యోగుల సంక్షేమం-కార్పొరేట్ విధానాలను సమతుల్యం చేయడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment