అంతర్గత మదింపులో నెగ్గకపోవడంతో చర్య
బాధితుల సంఖ్య ఎక్కువేనన్న ఉద్యోగుల సంఘం
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ 300 మంద్రి ఫ్రెషర్లను తొలగించింది. మైసూరులోని క్యాంపస్‌లో వీరికి ప్రాథమిక శిక్షణ ఇవ్వగా, అంతర్గతంగా నిర్వహించిన మదింపు ప్రక్రియల్లో మెరుగైన పనితీరు చూపించలేకపోయినట్టు, మూడు విడతలు అవకాశం ఇచ్చినప్పటికీ ఉత్తీర్ణత సాధించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు ఇన్ఫోసిస్ ప్రకటించింది. కానీ, వాస్తవానికి ఇలా తొలగించిన వారి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని ఐటీ ఉద్యోగుల సంఘం నైటెస్ తెలిపింది.
కేంద్ర కారి్మక, ఉపాధి కల్పన శాఖకు ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కంపెనీపై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై మీడియా సంస్థలు వివరణ కోరగా.. ‘‘ఇన్ఫోసిస్‌లో కఠినమైన నియామక ప్రక్రియను అనుసరిస్తాం. మైసూరు క్యాంపస్‌లో విస్తృతమైన ప్రాథమిక శిక్షణ అనంతరం అంతర్గత మదింపు ప్రక్రియల్లో ఫ్రెషర్లు (ఎలాంటి అనుభవం లేకుండా కొత్తగా ఉద్యోగ అవకాశాలు పొందిన వారు) విజయం సాధించాల్సి ఉంటుంది.
ఇందుకు గాను ప్రతి ఒక్కరి మూడు విడతలుగా అవకాశం కల్పిస్తాం. అయినప్పటికీ విఫలమైతే వారు సంస్థతో కలసి కొనసాగలేరు. ఉద్యోగ కాంట్రాక్టులో ఈ నిబంధన కూడా ఉంటుంది. రెండు దశాబ్దాల నుంచి ఇదే ప్రక్రియ అమల్లో ఉంది. మా క్లయింట్ల అవసరాలను తీర్చే అత్యుత్తమ నైపుణ్యాలు ఉండేలా చూడడమే ఇందులోని ఉద్దేశ్యం’’అని ఇన్ఫోసిస్ సంస్థ వివరణ ఇచ్చింది.
మూడు నెలల క్రితమే చేరిక
తాజాగా తొలగింపునకు గురైన వారి సంఖ్య గణనీయంగా ఉంటుందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (నైటెస్) పేర్కొంది. వీరిని 2024 అక్టోబర్‌లో నియమించుకున్నట్టు తెలిపింది. ‘‘ఆఫర్ లెటర్లు అందుకున్న తర్వాత వీరంతా రెండేళ్లపాటు నిరీక్షించారు. నైటెస్, బాధిత అభ్యర్థులు కలసి చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాతే వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు’’అని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment