సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలకు విద్యార్ధులు, టీచర్ల హాజరును పర్యవేక్షించడంతో పాటు మధ్యాహ్నభోజన పథకంలో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ విధానాన్ని చేపడుతోంది. వచ్చే విద్యాసంవత్సరంనుంచే ఈ బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానుంది. దీనికోసం రూ.20 కోట్లను వెచ్చించి పరికరాలు సమకూర్చనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల వాస్తవ సంఖ్యకు రికార్డుల్లోని సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉంటోందని, దీనివల్ల సరైన ప్రణాళికల రూపకల్పనకు వీలులేకపోవడంతో పాటు దొంగ హాజరువల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగమవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
దీనికి అడ్డుకట్ట వేసేందుకు బయోమెట్రిక్ పరికరాలు ఉపయోగపడతాయని వీటి ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, కస్తూరిబా బాలికా విద్యాలయాలు, సంఘిక సంక్షేమ హాస్టళ్లు తదితర అన్ని స్కూళ్లలోనూ బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటుచేయనున్నారు. ఈ పాఠశాలల్లో రోజువారీ హాజరు, మధ్యాహ్నభోజన వివరాలను ఎప్పటికప్పుడు ఈ బయోమెట్రిక్ పరికరాలనుంచి పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ సర్వీస్ కంప్యూటర్లకు అందుతుంది. దీన్ని ప్రతిరోజూ పర్యవేక్షించి తదనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు. దీనివల్ల అర్హులైన వారికి మెరుగైన సేవలందించడానికి వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. పుస్తకాలు, యూనిఫారాలు, స్కాలర్‌షిప్పులు ఇతర ప్రోత్సాహకాల పంపిణీని ప్రక్షాళన చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. బడ్జెటింగ్, అకౌంటింగ్‌ను సరిగ్గా నిర్వహించడానికి ఎలక్ట్రానిక్ విధినిర్వహణ పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్ధుల ఆధార్ లింకేజీని తప్పనిసరిచేస్తున్నారు. దీనివల్ల విద్యార్ధుల సమగ్ర డాటాబేస్‌ను రూపొందిస్తారు. విద్యార్ధుల హాజరులో నకిలీబాగోతాలను అరికట్టడం, విద్యార్ధులు, సిబ్బంది హాజరులో సమయపాలన ఉండేలా చూడడం ఈ బయోమెట్రిక్ ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ పద్ధతి వల్ల విద్యార్థులు ఏదైనా ఇతర పాఠశాలల్లో నమోదయ్యాడా? లేదా అనే విషయాన్ని పసిగట్టనున్నారు. డబుల్ నమోదును నివారించనున్నారు.
ఆధార్ సంఖ్యతోపాటు ఆయా విద్యార్ధుల పుట్టిన తేదీ, తండ్రిపేరు, వయసు, సామాజికవర్గం, తదితర వివరాలను కూడా కంప్యూటరీకరణ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వ్యవస్థలోకి తెచ్చి లోపాలను అరికట్టాలన్నది దీని ముఖ్యోద్దేశమని అధికారులు పేర్కొన్నారు. విద్యార్ధులు, టీచర్లు సరైన సమయానికి స్కూళ్లకు వస్తున్నారా? లేదా పర్యవేక్షిస్తారు. స్కూళ్లలో ఆలస్యపు హాజరును నివారించడంతోపాటు విద్యాసంబంధ పనితీరును మెరుగుపర్చనున్నారు. రాష్ట్రంలో 48వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఎంతమంది విద్యార్ధులు రోజువారీ భోజనాలను స్వీకరిస్తున్నారో అంచనాకు రానున్నారు. ఈ డేటా ఆధారంగా సరకుల పంపిణీ, నిధుల విడుదల సిబ్బంది నియామకాలోని లోపాలను సరిదిద్దనున్నారు. ప్రత్యేక అవసరాలు క ల వికలాంగులు తదితర పిల్లలకోసం వినియోగిస్తున్న నిధులు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోందని, ఈ బయోమెట్రిక్ ద్వారా దానికి అడ్డుకట్టపడుతుందని అధికారులు చెబుతున్నారు.
విద్యార్ధుల వాస్తవిక సంఖ్యను అనుసరించి మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, ఇతర సదుపాయాలను కల్పించనున్నారు. కేంద్రీకృత పర్యవేక్షణ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరును కేంద్రీకృత సర్వర్‌లో అప్పటికప్పుడే నమోదయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరితో పాటు కాంట్రాక్టర్లు, ఆయా సరకుల సరఫరాదార్ల నుంచి అందుతున్న వివిధ సరకులు, పరికరాల సమాచారాన్నీ ఈ కేంద్రీకృత సర్వర్‌లో నమోదు చేయించనున్నారు. డీఈఓలు, సర్వశిక్ష అభియాన్ పీఓలు, పాఠశాలల యాజమాన్య కమిటీలు, కేజీబీవీల ఎస్‌ఓలు, స్కూళ్ల హెడ్మాస్టర్లు తమ పరిధిలోని సమాచారాన్ని కేంద్రీకృత సర్వర్ పరిధిలోకి నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్
Published Wed, Mar 23 2016 8:19 PM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM
Advertisement
Advertisement