బాబోయ్..మాకొద్దు నగదు బదిలీ
- లబ్ధిదారుల హడల్
- పలువురికి నేటికీ అందని సబ్సిడీ
- ఎన్డీయే ప్రభుత్వంపై ఆగ్రహం
నగర శివారు వాంబే కాలనీలో నివసిస్తున్న ఒడగట్ల పైడమ్మ సబ్సిడీ రాక ఫిబ్రవరి నుంచి బ్యాంక్, గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతోంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ ఖాతా నంబరు ఇచ్చినా ఆమె డబ్బు జమ పడలేదు. ఏజెన్సీ నిర్వాహకులు తమకు సంబంధం లేదంటున్నారు.
భవానీపురానికి చెందిన అలీం జనవరి, ఫిబ్రవరిల గ్యాస్ సబ్సిడీ జమ పడక నానా అగచాట్లు పడుతోంది. ఇటు బ్యాంకర్లు, అటు గ్యాస్ ఏజెన్సీల పట్టించుకోకపోవటంతో డబ్బు వెనక్కి రాలేదని ఆమె గగ్గోలు పెడుతోంది.
వాంబే కాలనీకి చెందిన శీలం చుక్కమ్మ పోయిన సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో తీసుకున్న గ్యాస్ సిలెండర్లకు సంబంధించిన నగదు ఖాతాల్లో జమ పడలేదు. అప్పట్లో రూ. 1300 చొప్పున గ్యాస్ కొనుగోలు చేసినట్లు ఆమె వివరించింది.
విజయవాడ : ప్రజల్లో నగదు బదిలీపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ అమలులోకి వస్తే అగచాట్లు తప్పవని నిరసన తెలుపుతున్నారు. యూపీఏ ప్రభుత్వం మార్చి వరకు నగదు బదిలీ అమలు చేసింది. అయితే కొందరు ఖాతాల్లో నగదు పడలేదు. దాని సంగతి ప్రస్తావించకుండా వచ్చే నెల 10వ తేదీ నుంచి పథకాన్ని ఎన్డీయే అమలు చేయడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
12 వేల మందికి అందని నగదు
నగరంలో, జిల్లాలో 11లక్షల గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. జిల్లాలో దాదాపు 12వేల మందికి ఇంకా సబ్సిడీ నగదు జమ పడ లేదు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం గాక, మరికొన్ని అన్‌లైన్‌లో పొరపాట్ల వల్ల నగదు అందలేదు. ఈలోగా కోర్టు ఉత్తర్వులు రావటంతో ప్రభుత్వం సబ్సిడీని నేరుగా మినహాయించి గ్యాస్ సరఫరా చేయడంతో నగదు బదిలీ గురించి పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
పేదల్లో భయం
గతంలో నగదు బదిలీ పథకంతో ఇబ్బంది పడ్డామని పేద ప్రజలు వాపోతున్నారు. పూర్తిగా డబ్బు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేసే స్థోమత తమకు లేదని పేర్కొంటున్నారు. ఆధార్ లేకపోయినా బ్యాంకు ఖాతాలు ఉంటే సబ్సిడీ వేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అసలు బ్యాంకు ఖాతా తెరవాలంటే ఆధార్ లేదా రేషన్ కార్డు తప్పని సరి అని బ్యాంకర్లు అంటున్నారని పేదలు వాపోతున్నారు.
నగదు బదిలీతో రానున్న ఇబ్బందులు
ఆధార్ కార్డు ఆధారంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో పేర్లు, గ్యాస్ కనెక్షన్‌పై ఉన్న పేరుకు తేడా వస్తే సబ్సిడీ గల్లంతే. పేరు మార్చాలంటే కొత్త కనెక్షన్ చార్జి కంపెనీలకు చెల్లించాల్సిందే. ఆధార్ తీయించుకోకున్నా, దాంట్లో పేర్లు తప్పుపడినా గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు.