- జిల్లాలో 74 శాతం ఆధార్ అనుసంధానం
- బ్యాంక్‌ల్లో ఆధార్ నంబర్ తప్పనిసరి
- 75 వేల ఇండేన్ గ్యాస్ కనక్షన్లు తాత్కాలికంగా నిలుపుదల !
- మార్చి నుంచి పూర్తి స్థాయిలోబదిలీ ప్రక్రియ అమలు
ఖమ్మం జెడ్పీసెంటర్ : జిల్లాలో వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం నేటి నుంచి అమలు కానుంది. నూతన సంవత్సరంలో గ్యాస్ వినియోగదారులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో యూపీఏ ప్రభుత్వం గ్యాస్‌కు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ నగదు బదిలీని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో జిల్లాలో నేటి నుంచి ఈ పథకం అమలు కానుంది.
బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాని గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ వర్తించదు. వారికి గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇకపై రూ. 981 చెల్లించాలి. తొలుత గ్యాస్ వినియోగదారులు గ్యాస్ ధర మొత్తాన్ని చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. కొద్దిరోజుల తర్వాత సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 5,05,446 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ప్రస్తుతం 5,00,114 కనెక్షన్‌లు వినియోగంలో ఉన్నాయి. వీటిలో 74 శాతం మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారు.
మార్చిలోపు అనుసంధానం కాకుంటే అదనపు భారం..
జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారభింస్తున్నప్పటికీ ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం చేసుకునేందుకు మార్చి వరకు గడువు ఉంది. అప్పటికి కూడా అనుసంధానం చేసుకోకుంటే అదనపు భారం మోయాల్సి వస్తుంది.
గ్యాస్ కనెక్షన్లు తాత్కాలిక నిలుపుదల..!
నగదు బదిలీ అమల్లో భాగంగా బ్యాంక్ ఖాతాలకు అధార్ అనుసంధానం చేసుకోని పలువురు వినియోగదారుల ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. వీటిలో ఇండేన్ గ్యాస్ వినియోగదారులైన 75 వేల మంది బ్యాంకుల్లో ఆధార్ అనుసంధానం చేసుకోకపోవటంతో వారి కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
వినియోగదారుల్లో గందళగోళం...
గ్యాస్ వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. జనవరి 1నుంచి నగదు బదిలీ అమలవుతుందని, ఇక నుంచి సిలిండర్‌కు సబ్సిడీ వర్తించద ని ప్రకటించడంతో వారు ఆందోళన చెందుతున్నా రు. గత ఏడాది జిల్లాను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి నగదు బదిలీ అమలు చేసే సమయంలో దాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే కొందరు లబ్ధిదారులు నగదు బదిలీ చేయించుకోవడంతో సబ్సిడీలో కొంత గందరగోళం నెలకొంది. ఒక వినియోగదారుడి సబ్సిడీ మరొకరి ఖాతాలోకి వెళ్లడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజాగా మళ్లీ నగదు బదిలీ వ్యవహారం తెరపైకి రావడంతో ఒక వైపు ఆధార్ పూర్తికాక పోవడం, మరో వైపు బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో అయోమయంలో పడ్డారు.
గ్యాస్ వివరాలు ఇలా...
జిల్లా వ్యాప్తంగా 5,00,114 గ్యాస్ కనక్షన్లు వినియోగంలో ఉన్నాయి. వీటిలో గ్యాస్ ఏజెన్సీల్లో అనుసంధానం అయినవి 3,69,816 కాగా, బ్యాంక్‌లో అనుసంధానం అయినవి 2,67,295 ఉన్నాయి. జిల్లాలో భారత్ పెట్రోలియం కంపెనీకి చెందినవి 76,805, ఇండియన్ అయిల్ కార్పొరేషన్ 1,66,118, హిందుస్థాన్ పెట్రోలియం 2,57,191 కనక్షన్‌లు ఉన్నాయి.