బాధల బదిలీ | Transfer trials | Sakshi
Sakshi News home page

బాధల బదిలీ

Published Thu, Dec 4 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

బాధల బదిలీ

బాధల బదిలీ

గ్యాస్ బండ అందకున్నా తీసుకున్నట్లు మెసేజ్‌లు
నత్తనడకన వంటగ్యాస్ ఆధార్ సీడింగ్
జిల్లాలో  7,20,991 వంటగ్యాస్ కనెక్షన్‌లు
ఏజెన్సీల పరిధిలో 92 శాతం సీడింగ్
బ్యాంకుల వద్ద 82 శాతం సీడింగ్

 
చిత్తూరు: నగదు బదిలీ పథకం కాస్తా కష్టాల బదిలీగా మారింది. వంటగ్యాస్‌కు ఈ పథకం అమలు చేయడంలో బాలారిష్టాలను అధిగమించడం లేదు. గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల్లో ఇచ్చిన ఖాతా నంబర్‌కు నగదు సక్రమంగా జమ కావడం లేదు. ఒకే ఆధార్‌కార్డు నంబర్‌తో  వేర్వేరు బ్యాంకుల్లో ఖాతా ఉన్న వ్యక్తులకు కొత్త కష్టాలు తప్పడం లేదు. ఏజెన్సీలో ఇచ్చిన ఖాతాకు కాకుండా మరో అకౌంట్‌లో మొత్తం జమ అవుతోంది.

 దీంతో ఆ వినియోగదారుడు తిప్పలు పడుతున్నాడు. ఇంకొంత మందికి అసలు సబ్సిడీ అందుతున్న పరిస్థితి లేదు. కొందరికి సబ్సిడీ మొత్తం తక్కువగా జమ అవుతోంది. దీంతో వినియోగదారులు పదేపదే ఏజెన్సీలు, బ్యాంకుల వద్దకు తిరగాల్సి వస్తోంది.
 
సర్వర్ సమస్య

ఈ సమస్యలన్నింటికీ సాంకేతిక తప్పిదాలే కారణం అని చమురు సంస్థల ప్రతినిధులు చల్లగా చెబుతున్నారు. ముంబైలోని సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల సెల్‌ఫోన్‌లకు తప్పుడు ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నట్లు చెబుతున్నారు. ఒకే ఆధార్ నంబర్‌తో ఇతర బ్యాంకుల్లో కూడా అకౌంట్లు ఉండడంవల్ల వంటగ్యాస్ సబ్సిడీ మొత్తం  మిగిలిన అకౌంట్లలో పడే అవకాశం ఉంటుందనేది వారి వాదన. ఏది ఏమైనా వినియోగదారులు మాత్రం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.

 సాగని ఆధార్ సీడింగ్

 వంటగ్యాస్ సబ్సిడీకి సంబంధించి సవరించిన నగదు బదిలీ పథకాన్ని  చిత్తూరు జిల్లాలో అమలు చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో బ్యాంకుల ద్వారా వినియోగదారులకు అందించనున్నారు. ఇందుకోసం ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి 14వ తేదీ లోపల పూర్తి చేయాలని తుది గడువు విధించారు. ఆ లోపు ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారికి సబ్సిడీ అందదని చెబుతున్నారు. గతంలో ప్రక్రియను పూర్తిచేసిన వినియోగదారులు మాత్రం ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరంలేదు.
 
నాలుగేళ్లుగా నత్తనడక

 జిల్లాలో 2012లో వంటగ్యాస్‌కు ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. నాలుగేళ్లు గడిచినా  ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. వినియోగదారులు శ్రద్ధ చూపకపోవడంతోనే ఆధార్‌సీడింగ్ ప్రక్రియ ముందుకు సాగడంలేదని  గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. జిల్లాలో ఐవోసీ, హెచ్‌పీ, భారత్ పెట్రోలియం గ్యాస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఇండేన్‌కు సంబంధించి జిల్లాలో 4,50,000 మంది వంట గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకూ 89.98 శాతం మంది  గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆధార్ సీడింగ్ పూర్తి చేయగా బ్యాంకుల వద్ద మాత్రం కేవలం 81.84 శాతం మాత్రమే సీడింగ్ పూర్తి చేశారు. హెచ్‌పీకి సంబంధించి 20 ఏజెన్సీల పరిధిలో 2,20,976 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గ్యాస్ ఏజెన్సీల వద్ద 93 శాతం ఆధార్‌సీడింగ్ పూర్తి కాగా బ్యాంకుల వద్ద మాత్రం 83 శాతం మాత్రమే సీడింగ్ పూర్తయింది.
 
వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం వినియోగదారులను అష్టకష్టాలకు గురి చేస్తోంది. గ్యాస్ బండ అందని వారికి కూడా తీసుకున్నట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. రెండు లేదా మూడు బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి సబ్సిడీ మొత్తం ఏ ఖాతాలో జమ అయిందనేది కూడా తెలియడం లేదంటున్నారు. ఆధార్‌కార్డుల అనుసంధాన ప్రక్రియతోపాటు సాంకేతిక లోపాలు వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement