Account number
-
కామన్ అకౌంట్ నంబర్ అంటే?
ఫండ్స్‌లో కామన్ అకౌంట్ నంబర్ (క్యాన్) అంటే ఏమిటి? ఇందులో అనుకూల, ప్రతికూలతలు ఏమున్నాయి? – దిలీప్ కామన్ అకౌంట్ నంబర్/క్యాన్ అనేది ఎంఎఫ్ యుటిలిటీస్ వద్ద రిజిస్టర్ చేసుకున్న వారికి ఇచ్చే ఏకీకృత ఖాతా. ఇది మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి అన్ని రకాల లావాదేవీలను నిర్వహించే ఏకీకృత వేదిక. 2015లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అన్నీ కలసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులకు సౌకర్యం, సులభతర నిర్వహణ దీని ఏర్పాటు ఉద్దేశ్యంగా ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడికి వీలు కల్పిస్తుంది. ఒక ఇన్వెస్టర్ వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు చెందిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే, విడివిడిగా ఖాతాలు ప్రారంభించి, లావాదేవీలను నిర్వహించుకోవాలి. ఇందుకోసం ప్రతి ఏఎంసీ వద్ద విడిగా నమోదు చేసుకోవాలి. అయితే, క్యాన్‌ను కలిగి ఉండడం తప్పనిసరి కాదు. ఎంఎఫ్ యుటిలిటీ ద్వారానే ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కూడా లేదు. ఇదొక వేదిక మాత్రమే. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఫిన్‌టెక్ కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా, బ్రోకర్ల ద్వారా సులభంగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. నా వయసు 40 ఏళ్లు. వచ్చే ఏడాది పీపీఎఫ్ గడువు తీరి రూ.15 లక్షలు చేతికి వస్తాయి. ఎన్పీఎస్ తదితర అధిక వృద్ధికి అవకాశం ఉన్న సాధనాల్లోకి ఈ మొత్తాన్ని బదిలీ చేయాలని అనుకుంటున్నాను. పీపీఎఫ్ నుంచి నాకు అందే మొత్తం పన్ను మినహాయింపు కిందకు వస్తుందని తెలిసింది. కనుక ఈ మొత్తాన్ని క్రమానుగతంగా ఈక్విటీ ఫండ్స్‌లోకి మళ్లించేది ఎలా? – సుచిత్ పూతియా పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లోకి మళ్లించే సమయంలో మీరు కొన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఇందులో ముందుగా డ్యురేషన్ ఒకటి. మీరు ఆ మొత్తం సమకూర్చుకోవడానికి పట్టిన కాలంలో సగం కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మీరు పీపీఎఫ్‌లో 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఈ మొత్తం సమకూరింది. కనుక ఏడున్నరేళ్ల పాటు సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయమని కాదు. గరిష్టంగా మూడేళ్లకు మించకుండా నెలవారీ వాయిదాల రూపంలో మీ వద్దనున్న మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ పెట్టుబడిని సమకూర్చుకోవడానికి ఐదేళ్లు పట్టిందని అనుకుందాం. అందులో సగం అంటే రెండున్నరేళ్ల పాటు క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ నూతన కాల వ్యవధి 15–20 ఏళ్లు అని అంటున్నారు. కనుక ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవాలి. ఎందుకంటే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించి మెరుగైన రాబడులను ఈక్విటీలు ఇవ్వగలవు. ఎన్పీఎస్ పథకాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈక్విటీల్లో 75% ఇన్వెస్ట్ చేసే యాక్టివ్ చాయిస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 60 ఏళ్లకు వచ్చిన తర్వాత అప్పటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్నే ఉపసంహరించుకోవడానికి ఉంటుంది. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ వరకు నిధిని ముట్టుకోని వారు అయితే, ఫ్లెక్సీ క్యాప్ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలు. ఉపసంహరణలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎన్‌పీఎస్‌లో అయితే ఈక్విటీ పెట్టుబడుల్లో అధిక శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కే కేటాయిస్తారు. కానీ, ఫ్లెక్సీక్యాప్ పథకాలు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి పెట్టుబడులను వైవిధ్యం చేస్తాయి. కనుక ఇవి కొంచెం మెరుగైన రాబడులు ఇస్తాయి. ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం లేకపోతే, నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకునే విషయంలో ఆందోళన చెందుతుంటే, అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి ఈక్విటీల్లో 65% వరకే ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన 35 శాతాన్ని డెట్‌లో పెడుతాయి. దీనివల్ల ఈక్విటీల్లోని అస్థిరతలను కొంత వరకు తగ్గించుకోవడానికి వీలుంటుంది. ఈక్విటీలతో పోలిస్తే స్థిరమైన రాబడులు ఇస్తాయి. -
కొత్త స్కాం వెలుగులోకి: సొమ్ము గోవిందా! లబోదిబోమంటున్న నగల వ్యాపారులు
‘మీ అకౌంట్లో డబ్బు పడింది’ అంటూ జ్యూయల్లరీ వ్యాపారులను దోచేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలా ఒక్కరు ఇద్దరుకాదు చాలామంది నగల వ్యాపారులు ఇలాంటి మోసానికి బలైనట్టు తెలుస్తోంది. ఎన్డీటీవీ అందించిన కథనంలోని వి వరాలను పరిశీలస్తే నగలవ్యాపారి నావల్ కిషోర్ ఖండేల్వాల్ ఢిల్లీలో అతిపెద్ద బంగారం, వెండి మార్కెట్లో ఐదు దశాబ్దాల నాటి దుకాణాన్ని నడుపుతున్నారు. గత వారం అయోధ్యకు వెళ్లారు. అక్కడ ఉండగానే ఒక వ్యక్తి ఫోన్లో సంప్రదించి, 15 గ్రాముల బంగారు గొలుసు కొనుగోలుకు కొడుకులతో డీల్ కుదుర్చుకున్నానని చెప్పాడు. తాను దుకాణాన్ని సందర్శించ లేనని ఆన్లైన్లోనే డబ్బులు చెల్లిస్తానంటూ ఖండేల్వాల్ని నమ్మించాడు. ఇంటర్నెట్-బ్యాంకింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వెంటనే తన బ్యాంక్ ఖాతాలో రూ. 93,400 జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అతను తన కుమారులకు స్క్రీన్‌షాట్ పంపాడు. దీంతో పేమెంట్ అయినట్టుగా భావించిన వారు ఆ వ్యక్తి ఇచ్చిన చిరునామాకు బంగారు గొలుసును పంపించారు. ఇదే ప్లాన్‌ను పక్కగా మరోసారి అమలు చేశారు కేటుగాళ్లు. దీంతో మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్ చేసి తనకు 30 గ్రాముల బంగారు గొలుసు కావాలని చెప్పాడు. సేమ్ సీన్ రిపీట్ అయింది. ఖండేల్వాల్కి రూ.1,95,400 తన ఖాతాలో జమ చేసినట్లు ఎస్ఎంఎస్ రావడం, ఆ గోల్డ్ చెయిన్‌ను అతనికి పంపడం జరిగిపోయింది. ఆ తరువాత తీరిగ్గా నగల వ్యాపారి బ్యాంక్ మొబైల్ యాప్‌లో అకౌంట్ చెక్ చేసుకొని డబ్బు జమ కాలేదని గ్రహించాడు. అపుడు తనకు వచ్చిన మెసేజ్ అచ్చం బ్యాంకు ఫార్మాట్లో ఉన్న ఫేక్ మేసేజ్ అని తెలుసుకుని లబోదిబోమన్నాడు. మరోవైపు ఇందులో తమ బాధ్యత ఏమీ లేదని, తామేం చేయలేమని బ్యాంకు అధికారులు తెలిపారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు నేరగాళ్లు ఎవరు అనేది కనుగొనలేక పోయారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇతనితో పాటు దేశంలో పలు చోట్ల పలువురు వ్యాపారులు కూడా ఇలాంటి మోసానికి బలైయ్యారనేది తమ దృష్టికి వచ్చిందని బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగేష్ సింఘాల్ తెలిపారు. అయితే బ్యాంక్ పోర్టల్ లేదా ఏదైనా వెబ్ పోర్టల్ ఉపయోగించలేదు కాబట్టి ఈ మోసం సైబర్ చట్టం కిందకు రాదని ఇది మోసం, ఫోర్జరీకి సంబంధించిన విషయం కాబట్టి క్రిమినల్ యాక్ట్ కిందికి వస్తుందని సైబర్ లా నిపుణుడు సజల్ ధమిజా అన్నారు. -
ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మార్చుకోవాలా? ఇదిగో ఇలా సింపుల్‌గా
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉందా. ఎస్బీఐ ఖాతాను ఒక శాఖ నుండి మరొక శాఖకు బదిలీ చేయాలనుకుంటున్నారా? బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండానే డిజిటల్‌గా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. వివరాలు ఇలా.. ముఖ్యంగా ఎస్బీఐలో ఖాతాదారు ఫోన్ నంబరు రిజిస్టర్ అయి ఉండాలి. YONO యాప్ లేదా YONO Lite ద్వారా కూడా బ్రాంచ్ని మార్చుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఎస్బీ బ్యాంక్ ఖాతా ఒక శాఖ నుండి మరొక శాఖకు ఎలా బదిలీ చేయాలి. ఎస్బీఐ అధికారిక పెర్సనల్ బ్యాంకింగ్ వెబ్యాంకింగ్ విభాగంలోకి వెళ్లి యూజర్ నేమ్, పాస్వర్డ్ నమోదు చేయాలి. తర్వాత ఈ-సర్వీస్ కేటగిరీని ఎంచుకోవాలి. అందులో ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్‌పై ఆప్షన్‌పై క్లిక్ చేసి మీరు మార్చుకోవాలనుకుంటున్న బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎంటర్ చేయాలి. అన్ని వివరాలు నమోదు చేశాక రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కొద్దిరోజుల్లో మీ అకౌంట్ సంబంధిత శాఖకు బదిలీ అవుతుంది. యోనో యాప్‌లో కూడా దాదాపు ఇదే పద్దతిలో బ్రాంచ్‌ను మార్చుకోవచచ్చు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) ఎస్బీఐ యోనో యాప్ ద్వారా అయితే యోనో యాప్‌లో లాగిన్ అయ్యి 'సర్వీసెస్'ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి కొత్త బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్‌తో పాటు బదిలీ చేయాలనుకుంటున్న ఖాతావివరాలివ్వాలి. గెట్ బ్రాంచ్ నేమ్ క్లిక్ చేయాలి. కొత్త బ్రాంచ్ పేరు ఫ్లాష్ అవుతుంది. అది సరియైనది అని నిర్దారించుకున్నాక, సబ్మిట్ 'సమర్పించు' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. -
ఎస్బీఐ : నెంబర్ తప్పుగా నొక్కాడు..
బెంగళూరు : క్యాష్ డిపాజిట్ మిషన్(సీడీఎం) ద్వారా అకౌంట్లలో డబ్బులు వేసుకుంటున్నారా? అయితే ఒకటికి రెండు సార్లు అకౌంట్ నెంబర్‌ను చెక్ చేసుకోవాలంట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ కస్టమర్ తన అకౌంట్ నెంబర్‌ను తప్పుగా నొక్కినందుకు రూ.49,500 కోల్పోయాడు. ఇదే విషయంపై దాదాపు ఏడాది పాటు బ్యాంక్ బ్రాంచ్ చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. వినియోగదారుల కోర్టులోనూ అతనికి ఎలాంటి మేలు జరగలేదు. మానవ తప్పిదంగా పేర్కొన్న కోర్టు ఆ కేసు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే... ఉత్తర కర్నాటకలోని కులబురగికి చెందిన మహింద్రా కుమార్ యమనాప్ప గతేడాది జూలై 18న క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా తన పొదుపు ఖాతాలోకి నగదును డిపాజిట్ చేశాడు. మధ్యాహ్నం డిపాజిట్ చేయడంతో, తన అకౌంట్లోకి కాస్త సమయం తీసుకుని క్రెడిట్ అవుతుందేమోనని వేచిచూశాడు. రెండు రోజులైన ఆ నగదు యమనాప్ప అకౌంట్లోకి డిపాజిట్ కాలేదు. ఈ విషయంపై కులబురగిలోని ఎస్బీ టెంపుల్ రోడ్డులో ఉన్న బ్రాంచులో ఫిర్యాదు చేశాడు. జూలై 20న తన ఫిర్యాదును దాఖలు చేశాడు. నగదు ఎందుకు అకౌంట్లోకి డిపాజిట్ కాలేదని బ్యాంక్‌లను ప్రశ్నించాడు. ఆగస్టులో కూడా రెండోసారి ఫిర్యాదు చేశాడు. ఆ అనంతరం తన అకౌంట్ హ్యాక్ అయిందని పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికీ తన తప్పు ఏమిటో తాను తెలుసుకోలేకపోయాడు.యమనాప్ప ఫిర్యాదులకు స్పందించిన బ్యాంక్, క్యాష్ డిపాజిట్ మిషన్ వద్ద అకౌంట్ నెంబర్లో ‘0’ కు బదులు ‘8’ నొక్కడంతో, వేరే వారి అకౌంట్లోకి నగదు వెళ్లినట్టు పేర్కొంది. ఆదిలాబాద్‌కు చెందిన ఎస్బీఐ కస్టమర్ ఖాన్ షాబాబ్ కస్టమర్ అకౌంట్లోకి ఆ నగదు వెళ్లినట్టు తెలిపారు. ఆదిలాబాద్ బ్రాంచ్‌కు కూడా లేఖ రాశారు. కానీ అవి తిరిగిరాలేదు. అప్పటికే ఆ మొత్తాన్ని ఖాన్ విత్‌డ్రా చేసేసుకున్నాడని తెలిసింది. వేరే వారి అకౌంట్లోకి వెళ్లిన 48 గంటల్లోగా ఫిర్యాదు చేస్తేనే ఆ నగదును బ్లాక్ చేయడం కుదురుతుందని బ్యాంక్ అథారిటీలు చెప్పారు. ప్రస్తుతం వాటిని వెనక్కి రప్పించడం కుదరడం లేదని పేర్కొన్నారు. ఇలా బ్యాంక్ వారు సైతం చేతులెత్తేశారు. ఎస్బీఐకి వ్యతిరేకంగా జిల్లా వినియోగదారుల సమస్యల పరిష్కార కోర్టుకు కూడా వెళ్లాడు యమనాప్ప. కోర్టులో అది బ్యాంక్ తప్పిదం కాదని, ఎస్బీఐ కౌన్సిల్ వాదించింది. కస్టమర్ తప్పుడు అకౌంట్ నెంబర్ నొక్కడం వల్లనే ఇదంతా జరిగిందని పేర్కొంది. తొలుత యమనాప్ప సైతం అకౌంట్ నెంబర్ తప్పుగా నొక్కినట్టు ఒప్పుకోలేదు. ఆ అనంతరం తన తప్పును ఒప్పుకున్నాడు. యమనాప్ప తప్పు చేసి ఒప్పుకోలేదని, పైగా బ్యాంక్ వారే తన నగదును వెనక్కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని వాదించడం సరియైనది కాదని పేర్కొంటూ.. ఈ నెల 5న యమనాప్ప కేసును కోర్టు కొట్టివేసింది. -
బాధల బదిలీ
గ్యాస్ బండ అందకున్నా తీసుకున్నట్లు మెసేజ్‌లు నత్తనడకన వంటగ్యాస్ ఆధార్ సీడింగ్ జిల్లాలో 7,20,991 వంటగ్యాస్ కనెక్షన్లు ఏజెన్సీల పరిధిలో 92 శాతం సీడింగ్ బ్యాంకుల వద్ద 82 శాతం సీడింగ్ చిత్తూరు: నగదు బదిలీ పథకం కాస్తా కష్టాల బదిలీగా మారింది. వంటగ్యాస్‌కు ఈ పథకం అమలు చేయడంలో బాలారిష్టాలను అధిగమించడం లేదు. గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల్లో ఇచ్చిన ఖాతా నంబర్‌కు నగదు సక్రమంగా జమ కావడం లేదు. ఒకే ఆధార్‌కార్డు నంబర్‌తో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతా ఉన్న వ్యక్తులకు కొత్త కష్టాలు తప్పడం లేదు. ఏజెన్సీలో ఇచ్చిన ఖాతాకు కాకుండా మరో అకౌంట్లో మొత్తం జమ అవుతోంది. దీంతో ఆ వినియోగదారుడు తిప్పలు పడుతున్నాడు. ఇంకొంత మందికి అసలు సబ్సిడీ అందుతున్న పరిస్థితి లేదు. కొందరికి సబ్సిడీ మొత్తం తక్కువగా జమ అవుతోంది. దీంతో వినియోగదారులు పదేపదే ఏజెన్సీలు, బ్యాంకుల వద్దకు తిరగాల్సి వస్తోంది. సర్వర్ సమస్య ఈ సమస్యలన్నింటికీ సాంకేతిక తప్పిదాలే కారణం అని చమురు సంస్థల ప్రతినిధులు చల్లగా చెబుతున్నారు. ముంబైలోని సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల సెల్ఫోన్లకు తప్పుడు ఎస్ఎంఎస్లు వస్తున్నట్లు చెబుతున్నారు. ఒకే ఆధార్ నంబర్‌తో ఇతర బ్యాంకుల్లో కూడా అకౌంట్లు ఉండడంవల్ల వంటగ్యాస్ సబ్సిడీ మొత్తం మిగిలిన అకౌంట్లలో పడే అవకాశం ఉంటుందనేది వారి వాదన. ఏది ఏమైనా వినియోగదారులు మాత్రం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సాగని ఆధార్ సీడింగ్ వంటగ్యాస్ సబ్సిడీకి సంబంధించి సవరించిన నగదు బదిలీ పథకాన్ని చిత్తూరు జిల్లాలో అమలు చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో బ్యాంకుల ద్వారా వినియోగదారులకు అందించనున్నారు. ఇందుకోసం ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి 14వ తేదీ లోపల పూర్తి చేయాలని తుది గడువు విధించారు. ఆ లోపు ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారికి సబ్సిడీ అందదని చెబుతున్నారు. గతంలో ప్రక్రియను పూర్తిచేసిన వినియోగదారులు మాత్రం ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరంలేదు. నాలుగేళ్లుగా నత్తనడక జిల్లాలో 2012లో వంటగ్యాస్‌కు ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. వినియోగదారులు శ్రద్ధ చూపకపోవడంతోనే ఆధార్‌సీడింగ్ ప్రక్రియ ముందుకు సాగడంలేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. జిల్లాలో ఐవోసీ, హెచ్‌పీ, భారత్ పెట్రోలియం గ్యాస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఇండేన్‌కు సంబంధించి జిల్లాలో 4,50,000 మంది వంట గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకూ 89.98 శాతం మంది గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆధార్ సీడింగ్ పూర్తి చేయగా బ్యాంకుల వద్ద మాత్రం కేవలం 81.84 శాతం మాత్రమే సీడింగ్ పూర్తి చేశారు. హెచ్‌పీకి సంబంధించి 20 ఏజెన్సీల పరిధిలో 2,20,976 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గ్యాస్ ఏజెన్సీల వద్ద 93 శాతం ఆధార్‌సీడింగ్ పూర్తి కాగా బ్యాంకుల వద్ద మాత్రం 83 శాతం మాత్రమే సీడింగ్ పూర్తయింది. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం వినియోగదారులను అష్టకష్టాలకు గురి చేస్తోంది. గ్యాస్ బండ అందని వారికి కూడా తీసుకున్నట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. రెండు లేదా మూడు బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి సబ్సిడీ మొత్తం ఏ ఖాతాలో జమ అయిందనేది కూడా తెలియడం లేదంటున్నారు. ఆధార్‌కార్డుల అనుసంధాన ప్రక్రియతోపాటు సాంకేతిక లోపాలు వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. -
‘లెక్క’ లేకుంటే చిక్కులే..!
ముంబై: వ్యాపార అవసరాలు.. ఇతరత్రా పనుల కోసం పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్తున్నారా..? అయితే ఈ ఎన్నికల సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. డబ్బులు వెంట తీసుకెళ్లడం సమస్యకు దారితీసే అవకాశముంది. ఈ విషయంలో తగిన అవగాహనతో వ్యవహరించకుంటే ఇబ్బందులు తప్పవు. నగరానికి చెందిన వ్యాపారులేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చినవారు కూడా వివిధ అవసరాల కోసం, కొనుగోళ్ల కోసం పెద్దమొత్తంలో నగదు తీసుకొని వస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, పోలింగ్‌లో డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. దీనిపై అవగాహన లేకపోవడంతో తనిఖీల్లో డబ్బు పట్టుబడి గతంలో చాలామంది వ్యాపారులు, కొనుగోలు దారులు ఇబ్బందుల్లో పడ్డారు. లెక్క తప్పనిసరి ఎన్నికల సందడి ఊపందుకున్న క్రమంలో నగరంతోపాటు ఢిల్లీ జాతీయ ప్రాదేశిక ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రూ.లక్షకు మించి నగదు తీసుకెళ్లే వారు కచ్చితంగా ఆ డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు చూపాల్సి ఉంటుంది. డబ్బులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. ఆ డబ్బులు ఎక్కడ నుంచి అందాయో.. ఏ అవసరాలకు తీసుకెళ్తున్నామనే విషయాలపై పూర్తిస్థాయి ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఆ విషయంతో పోలీసులు సంతృప్తి చెందకుంటే స్వాధీనం చేసుకున్న డబ్బులు సీజ్ చేసి కేసును ఇన్‌కంట్యాక్స్ అధికారులకు సిఫార్సు చేస్తారు. డబ్బులు తీసుకెళ్తున్న వారు ఆదాయపు పన్నుశాఖ అధికారులకు తగిన ఆధారాలు చూపితే డబ్బులు రిలీజ్ అవుతాయి. ఇంకా ఇలా చేయండి పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్లడానికి ఆర్టీజీఎస్ (రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్) పద్ధతిని అనుసరిస్తే మేలు. ఈ పద్ధతిలో బ్యాంకు ద్వారా డబ్బులను నేరుగా అవసరమైన వారికి చేరవేయవచ్చు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తికి.. డబ్బులు పొందుతున్న వ్యక్తికి పాన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. తాము ఎవరికైతే డబ్బులు పంపుతున్నామో వారి అకౌంట్ నంబరు, బ్యాంకు బ్రాంచి పేరు, ఏరియా, ఐఎఫ్ఎస్సీ కోడ్లను తెలపాలి. ఈ పద్ధతి ద్వారా తాము తీసుకెళ్లదల్చుకున్న డబ్బులను బ్యాంకు ద్వారా బదిలీ చేయవచ్చు. ఎన్నికల పర్వం ముగిసే వరకు ఈ పద్ధతిని అనుసరిస్తే పోలీసుల తనిఖీలతో ఇబ్బందులు పడే ఆస్కారం ఉండదు.