ముంబై: వ్యాపార అవసరాలు.. ఇతరత్రా పనుల కోసం పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్తున్నారా..? అయితే ఈ ఎన్నికల సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. డబ్బులు వెంట తీసుకెళ్లడం సమస్యకు దారితీసే అవకాశముంది. ఈ విషయంలో తగిన అవగాహనతో వ్యవహరించకుంటే ఇబ్బందులు తప్పవు. నగరానికి చెందిన వ్యాపారులేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చినవారు కూడా వివిధ అవసరాల కోసం, కొనుగోళ్ల కోసం పెద్దమొత్తంలో నగదు తీసుకొని వస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, పోలింగ్‌లో డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. దీనిపై అవగాహన లేకపోవడంతో తనిఖీల్లో డబ్బు పట్టుబడి గతంలో చాలామంది వ్యాపారులు, కొనుగోలు దారులు ఇబ్బందుల్లో పడ్డారు.
లెక్క తప్పనిసరి
ఎన్నికల సందడి ఊపందుకున్న క్రమంలో నగరంతోపాటు ఢిల్లీ జాతీయ ప్రాదేశిక ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రూ.లక్షకు మించి నగదు తీసుకెళ్లే వారు కచ్చితంగా ఆ డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు చూపాల్సి ఉంటుంది. డబ్బులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. ఆ డబ్బులు ఎక్కడ నుంచి అందాయో.. ఏ అవసరాలకు తీసుకెళ్తున్నామనే విషయాలపై పూర్తిస్థాయి ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఆ విషయంతో పోలీసులు సంతృప్తి చెందకుంటే స్వాధీనం చేసుకున్న డబ్బులు సీజ్ చేసి కేసును ఇన్‌కంట్యాక్స్ అధికారులకు సిఫార్సు చేస్తారు. డబ్బులు తీసుకెళ్తున్న వారు ఆదాయపు పన్నుశాఖ అధికారులకు తగిన ఆధారాలు చూపితే డబ్బులు రిలీజ్ అవుతాయి.
ఇంకా ఇలా చేయండి
పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్లడానికి ఆర్‌టీజీఎస్ (రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్) పద్ధతిని అనుసరిస్తే మేలు. ఈ పద్ధతిలో బ్యాంకు ద్వారా డబ్బులను నేరుగా అవసరమైన వారికి చేరవేయవచ్చు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే వ్యక్తికి.. డబ్బులు పొందుతున్న వ్యక్తికి పాన్‌కార్డు తప్పనిసరిగా ఉండాలి. తాము ఎవరికైతే డబ్బులు పంపుతున్నామో వారి అకౌంట్ నంబరు, బ్యాంకు బ్రాంచి పేరు, ఏరియా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను తెలపాలి. ఈ పద్ధతి ద్వారా తాము తీసుకెళ్లదల్చుకున్న డబ్బులను బ్యాంకు ద్వారా బదిలీ చేయవచ్చు. ఎన్నికల పర్వం ముగిసే వరకు ఈ పద్ధతిని అనుసరిస్తే పోలీసుల తనిఖీలతో ఇబ్బందులు పడే ఆస్కారం ఉండదు.
‘లెక్క’ లేకుంటే చిక్కులే..!
Published Wed, Mar 12 2014 10:47 PM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM
Advertisement
Advertisement