Real Time Gross Settlement
-
ఇక రోజంతా ఆర్టీజీఎస్ సర్వీసులు
ముంబై: పెద్ద మొత్తంలో నగదు బదిలీ లావాదేవీలకు ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) సర్వీసులు ఇకనుంచీ రోజంతా 24 గంటలూ .. అందుబాటులో ఉండనున్నాయి. ఈ విధానం ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఇలాంటి సర్వీసులను ఏడాది పొడవునా, వారమంతా, ఇరవై నాలుగ్గంటలూ అందిస్తున్న అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చోటు దక్కించుకుంది. దీన్ని సుసాధ్యం చేసిన భాగస్వాములందరినీ అభినందిస్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ .. ట్విటర్లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా నిధుల బదలాయింపునకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) విధానాన్ని, అంతకు మించితే ఆర్టీజీఎస్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. నెఫ్ట్ సేవలు ఇప్పటికే రోజంతా అందుబాటులో ఉంటుండగా.. తాజాగా ఏడాది తర్వాత ఆర్టీజీఎస్ సేవలను కూడా ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. 2004 మార్చి 26న ఆర్టీజీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్లో నాలుగు బ్యాంకులతో మొదలైన ఈ విధానం ద్వారా ప్రస్తుతం రోజుకు రూ. 4.17 లక్షల కోట్ల విలువ చేసే 6.35 లక్షల పైచిలుకు లావాదేవీలు జరుగుతున్నాయి. 237 బ్యాంకులు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. 2020 నవంబర్లో ఆర్టీజీఎస్లో సగటు లావాదేవీ పరిమాణం రూ. 57.96 లక్షలుగా నమోదైంది. జైపూర్లో బ్యాంక్నోట్ ప్రాసెసింగ్ సెంటర్ బ్యాంక్ నోట్ల చలామణీ పెరుగుతున్న నేపథ్యంలో వీటి నిర్వహణ కోసం జైపూర్లో ఆటోమేటెడ్ బ్యాŠంక్నోట్ ప్రాసెసింక్ కేంద్రాన్ని (ఏబీపీసీ) ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ప్రింటింగ్ ప్రెస్ల నుంచి వచ్చే కరెన్సీ నోట్ల జమ, నిల్వ, డిస్పాచ్ మొదలైన కార్యకలాపాల కోసం దీన్ని ఉపయోగించనున్నారు. ఏబీపీసీ ఏర్పాటుకు అవసరమయ్యే సేవల నిర్వహణ కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆర్బీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. 2039–40 నాటికి దశలవారీగా సగటున రోజుకి 685 కోట్ల కొత్త నోట్లను, 2,775.7 కోట్ల పాత నోట్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఏబీపీసీని రూపొందించనున్నారు. 2001 మార్చి నుంచి 2019 మార్చి దాకా చలామణీలో ఉన్న బ్యాంక్ నోట్ల పరిమాణం 3 రెట్లు పెరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరుతుందని అంచనా. -
‘లెక్క’ లేకుంటే చిక్కులే..!
ముంబై: వ్యాపార అవసరాలు.. ఇతరత్రా పనుల కోసం పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్తున్నారా..? అయితే ఈ ఎన్నికల సమయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. డబ్బులు వెంట తీసుకెళ్లడం సమస్యకు దారితీసే అవకాశముంది. ఈ విషయంలో తగిన అవగాహనతో వ్యవహరించకుంటే ఇబ్బందులు తప్పవు. నగరానికి చెందిన వ్యాపారులేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చినవారు కూడా వివిధ అవసరాల కోసం, కొనుగోళ్ల కోసం పెద్దమొత్తంలో నగదు తీసుకొని వస్తుంటారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, పోలింగ్లో డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. దీనిపై అవగాహన లేకపోవడంతో తనిఖీల్లో డబ్బు పట్టుబడి గతంలో చాలామంది వ్యాపారులు, కొనుగోలు దారులు ఇబ్బందుల్లో పడ్డారు. లెక్క తప్పనిసరి ఎన్నికల సందడి ఊపందుకున్న క్రమంలో నగరంతోపాటు ఢిల్లీ జాతీయ ప్రాదేశిక ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రూ.లక్షకు మించి నగదు తీసుకెళ్లే వారు కచ్చితంగా ఆ డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు చూపాల్సి ఉంటుంది. డబ్బులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. ఆ డబ్బులు ఎక్కడ నుంచి అందాయో.. ఏ అవసరాలకు తీసుకెళ్తున్నామనే విషయాలపై పూర్తిస్థాయి ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఆ విషయంతో పోలీసులు సంతృప్తి చెందకుంటే స్వాధీనం చేసుకున్న డబ్బులు సీజ్ చేసి కేసును ఇన్కంట్యాక్స్ అధికారులకు సిఫార్సు చేస్తారు. డబ్బులు తీసుకెళ్తున్న వారు ఆదాయపు పన్నుశాఖ అధికారులకు తగిన ఆధారాలు చూపితే డబ్బులు రిలీజ్ అవుతాయి. ఇంకా ఇలా చేయండి పెద్దమొత్తంలో నగదు తీసుకెళ్లడానికి ఆర్టీజీఎస్ (రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్) పద్ధతిని అనుసరిస్తే మేలు. ఈ పద్ధతిలో బ్యాంకు ద్వారా డబ్బులను నేరుగా అవసరమైన వారికి చేరవేయవచ్చు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తికి.. డబ్బులు పొందుతున్న వ్యక్తికి పాన్కార్డు తప్పనిసరిగా ఉండాలి. తాము ఎవరికైతే డబ్బులు పంపుతున్నామో వారి అకౌంట్ నంబరు, బ్యాంకు బ్రాంచి పేరు, ఏరియా, ఐఎఫ్ఎస్సీ కోడ్లను తెలపాలి. ఈ పద్ధతి ద్వారా తాము తీసుకెళ్లదల్చుకున్న డబ్బులను బ్యాంకు ద్వారా బదిలీ చేయవచ్చు. ఎన్నికల పర్వం ముగిసే వరకు ఈ పద్ధతిని అనుసరిస్తే పోలీసుల తనిఖీలతో ఇబ్బందులు పడే ఆస్కారం ఉండదు.