బెంగళూరు : క్యాష్ డిపాజిట్ మిషన్(సీడీఎం) ద్వారా అకౌంట్లలో డబ్బులు వేసుకుంటున్నారా? అయితే ఒకటికి రెండు సార్లు అకౌంట్ నెంబర్‌ను చెక్ చేసుకోవాలంట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ కస్టమర్ తన అకౌంట్ నెంబర్‌ను తప్పుగా నొక్కినందుకు రూ.49,500 కోల్పోయాడు. ఇదే విషయంపై దాదాపు ఏడాది పాటు బ్యాంక్ బ్రాంచ్ చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. వినియోగదారుల కోర్టులోనూ అతనికి ఎలాంటి మేలు జరగలేదు. మానవ తప్పిదంగా పేర్కొన్న కోర్టు ఆ కేసు కొట్టివేసింది.
వివరాల్లోకి వెళ్తే... ఉత్తర కర్నాటకలోని కులబురగికి చెందిన మహింద్రా కుమార్ యమనాప్ప గతేడాది జూలై 18న క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా తన పొదుపు ఖాతాలోకి నగదును డిపాజిట్ చేశాడు. మధ్యాహ్నం డిపాజిట్ చేయడంతో, తన అకౌంట్‌లోకి కాస్త సమయం తీసుకుని క్రెడిట్ అవుతుందేమోనని వేచిచూశాడు. రెండు రోజులైన ఆ నగదు యమనాప్ప అకౌంట్లోకి డిపాజిట్ కాలేదు. ఈ విషయంపై కులబురగిలోని ఎస్‌బీ టెంపుల్ రోడ్డులో ఉన్న బ్రాంచులో ఫిర్యాదు చేశాడు. జూలై 20న తన ఫిర్యాదును దాఖలు చేశాడు. నగదు ఎందుకు అకౌంట్‌లోకి డిపాజిట్ కాలేదని బ్యాంక్‌లను ప్రశ్నించాడు. ఆగస్టులో కూడా రెండోసారి ఫిర్యాదు చేశాడు. ఆ అనంతరం తన అకౌంట్ హ్యాక్ అయిందని పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికీ తన తప్పు ఏమిటో తాను తెలుసుకోలేకపోయాడు.యమనాప్ప ఫిర్యాదులకు స్పందించిన బ్యాంక్, క్యాష్ డిపాజిట్ మిషన్ వద్ద అకౌంట్ నెంబర్లో ‘0’ కు బదులు ‘8’ నొక్కడంతో, వేరే వారి అకౌంట్‌లోకి నగదు వెళ్లినట్టు పేర్కొంది.
ఆదిలాబాద్‌కు చెందిన ఎస్‌బీఐ కస్టమర్ ఖాన్ షాబాబ్ కస్టమర్ అకౌంట్‌లోకి ఆ నగదు వెళ్లినట్టు తెలిపారు. ఆదిలాబాద్ బ్రాంచ్‌కు కూడా లేఖ రాశారు. కానీ అవి తిరిగిరాలేదు. అప్పటికే ఆ మొత్తాన్ని ఖాన్ విత్‌డ్రా చేసేసుకున్నాడని తెలిసింది. వేరే వారి అకౌంట్‌లోకి వెళ్లిన 48 గంటల్లోగా ఫిర్యాదు చేస్తేనే ఆ నగదును బ్లాక్ చేయడం కుదురుతుందని బ్యాంక్ అథారిటీలు చెప్పారు. ప్రస్తుతం వాటిని వెనక్కి రప్పించడం కుదరడం లేదని పేర్కొన్నారు. ఇలా బ్యాంక్ వారు సైతం చేతులెత్తేశారు. ఎస్‌బీఐకి వ్యతిరేకంగా జిల్లా వినియోగదారుల సమస్యల పరిష్కార కోర్టుకు కూడా వెళ్లాడు యమనాప్ప. కోర్టులో అది బ్యాంక్ తప్పిదం కాదని, ఎస్‌బీఐ కౌన్సిల్ వాదించింది. కస్టమర్ తప్పుడు అకౌంట్ నెంబర్ నొక్కడం వల్లనే ఇదంతా జరిగిందని పేర్కొంది. తొలుత యమనాప్ప సైతం అకౌంట్ నెంబర్ తప్పుగా నొక్కినట్టు ఒప్పుకోలేదు. ఆ అనంతరం తన తప్పును ఒప్పుకున్నాడు. యమనాప్ప తప్పు చేసి ఒప్పుకోలేదని, పైగా బ్యాంక్ వారే తన నగదును వెనక్కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని వాదించడం సరియైనది కాదని పేర్కొంటూ.. ఈ నెల 5న యమనాప్ప కేసును కోర్టు కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment