cash deposit machines
-
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారత్ అప్‌గ్రేడబుల్ ఏటీఎం మెషీన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏటీఎంలను ఎప్పుడైనా నగదు రీసైక్లింగ్ మెషిన్ (CRM)కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఇది దేశంలోనే మొదటి అప్‌గ్రేడబుల్ ఏటీఎం అని హిటాచీ సంస్థ పేర్కొంది.' మేక్ ఇన్ ఇండియా ' చొరవ కింద తయారు చేసిన ఈ ఏటీఎంలు బ్యాంకులకు మెరుగైన సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న 2,64,000 ఏటీఎంలు/సీఆర్ఎంలలో, హిటాచీ 76,000కు పైగా నిర్వహిస్తోంది. రాబోయే ఎనిమిదేళ్లలో దాదాపు 1,00,000 అప్‌గ్రేడబుల్ ఏటీఎంల మార్కెట్‌ను కంపెనీ అంచనా వేసింది.ఏంటీ సీఆర్ఎం మెషీన్లు?సీఆర్ఎం మెషీన్లు అంటే క్యాష్ రీసైక్లింగ్ మెషీన్. దీని ద్వారా నగదు డిపాజిట్, విత్‌డ్రా రెండు సేవలనూ పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు ఈ నగదు రీసైక్లింగ్ మెషీన్ల ద్వారా తమ శాఖల వద్ద రౌండ్-ది-క్లాక్ నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆఫ్‌సైట్ ప్రదేశాల్లో బ్యాంకులు సాధారణంగా ఏటీఎంల ద్వారా 24 గంటలూ నగదు ఉపసంహరణ సేవలను మాత్రమే అందిస్తాయి. ఇలాంటి చోట్ల అప్‌గ్రేడబుల్ ఏటీఎంలను ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులు తమ వారి వ్యాపార అవసరాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిపాజిట్, విత్ డ్రా సేవలు విస్తరించడానికి బ్యాంకులకు వీలు కలుగుతుంది. -
ఏడాదిగా రోజూ రూ.లక్షల్లో డిపాజిట్
సాక్షి, చెన్నై: ఏడాదిగా చెన్నైలో ఓ యువకుడు ఎస్బీఐ డిపాజిట్ మిషన్ ద్వారా రోజుకు రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నగదు డిపాజిట్ చేస్తూ బ్యాంకు అధికారులకు చిక్కాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. చెన్నై కీల్పాక్కం అళగప్పా వీధిలో ఉన్న ఏటీఎం కేంద్రంలోని డిపాజిట్ మిషన్ ద్వారా ఓ యువకుడు రోజూ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఏదో ఒక ఖాతాలో డిపాజిట్ చేస్తున్నాడు. ఏడాదిగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఎస్బీఐ అధికారులు దృష్టిపెట్టి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఆదివారం రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోని సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు. రోజూ సాయంత్రం ఆరు గంటలకు ఆ యువకుడు నగదు డిపాజిట్ చేస్తున్నట్లు గుర్తించారు. సాయంత్రం 5.50 గంటలకు పోలీసులు ఆ కేంద్రం వద్ద నిఘా పెట్టారు. ఆరు గంటలకు ఏటీఎంలోకి వచ్చిన వ్యక్తి రూ.2.10 లక్షలు డిపాజిట్ చేస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలో ఉన్న యువకుడు, తమకు చిక్కిన వ్యక్తి ఒకడే కావడంతో రహస్య ప్రదేశానికి తరలించి రాత్రంతా విచారించారు. ఆ యువకుడు చెన్నైలోని పులియాంతోపునకు చెందిన సాయినా (29)గా గుర్తించారు. ఇతను ఓ బైక్ సర్వీస్ కంపెనీలో పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. చెన్నైలోని ప్యారిస్‌కు చెందిన పర్వేజ్ అనే వ్యక్తి రోజూ అతను చెప్పిన ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసే పని తనకు అప్పగించినట్లు ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. తనకు రూ.లక్షకు రూ.వెయ్యి కమీషన్‌గా ఇస్తాడని పేర్కొన్నాడు. దీంతో సాయినాను సోమవారం ఈడీ అధికారులకు పోలీసులు అప్పగించారు. -
ఎస్బీఐ : నెంబర్ తప్పుగా నొక్కాడు..
బెంగళూరు : క్యాష్ డిపాజిట్ మిషన్(సీడీఎం) ద్వారా అకౌంట్లలో డబ్బులు వేసుకుంటున్నారా? అయితే ఒకటికి రెండు సార్లు అకౌంట్ నెంబర్‌ను చెక్ చేసుకోవాలంట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ కస్టమర్ తన అకౌంట్ నెంబర్‌ను తప్పుగా నొక్కినందుకు రూ.49,500 కోల్పోయాడు. ఇదే విషయంపై దాదాపు ఏడాది పాటు బ్యాంక్ బ్రాంచ్ చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. వినియోగదారుల కోర్టులోనూ అతనికి ఎలాంటి మేలు జరగలేదు. మానవ తప్పిదంగా పేర్కొన్న కోర్టు ఆ కేసు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే... ఉత్తర కర్నాటకలోని కులబురగికి చెందిన మహింద్రా కుమార్ యమనాప్ప గతేడాది జూలై 18న క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా తన పొదుపు ఖాతాలోకి నగదును డిపాజిట్ చేశాడు. మధ్యాహ్నం డిపాజిట్ చేయడంతో, తన అకౌంట్లోకి కాస్త సమయం తీసుకుని క్రెడిట్ అవుతుందేమోనని వేచిచూశాడు. రెండు రోజులైన ఆ నగదు యమనాప్ప అకౌంట్లోకి డిపాజిట్ కాలేదు. ఈ విషయంపై కులబురగిలోని ఎస్బీ టెంపుల్ రోడ్డులో ఉన్న బ్రాంచులో ఫిర్యాదు చేశాడు. జూలై 20న తన ఫిర్యాదును దాఖలు చేశాడు. నగదు ఎందుకు అకౌంట్లోకి డిపాజిట్ కాలేదని బ్యాంక్‌లను ప్రశ్నించాడు. ఆగస్టులో కూడా రెండోసారి ఫిర్యాదు చేశాడు. ఆ అనంతరం తన అకౌంట్ హ్యాక్ అయిందని పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికీ తన తప్పు ఏమిటో తాను తెలుసుకోలేకపోయాడు.యమనాప్ప ఫిర్యాదులకు స్పందించిన బ్యాంక్, క్యాష్ డిపాజిట్ మిషన్ వద్ద అకౌంట్ నెంబర్లో ‘0’ కు బదులు ‘8’ నొక్కడంతో, వేరే వారి అకౌంట్లోకి నగదు వెళ్లినట్టు పేర్కొంది. ఆదిలాబాద్‌కు చెందిన ఎస్బీఐ కస్టమర్ ఖాన్ షాబాబ్ కస్టమర్ అకౌంట్లోకి ఆ నగదు వెళ్లినట్టు తెలిపారు. ఆదిలాబాద్ బ్రాంచ్‌కు కూడా లేఖ రాశారు. కానీ అవి తిరిగిరాలేదు. అప్పటికే ఆ మొత్తాన్ని ఖాన్ విత్‌డ్రా చేసేసుకున్నాడని తెలిసింది. వేరే వారి అకౌంట్లోకి వెళ్లిన 48 గంటల్లోగా ఫిర్యాదు చేస్తేనే ఆ నగదును బ్లాక్ చేయడం కుదురుతుందని బ్యాంక్ అథారిటీలు చెప్పారు. ప్రస్తుతం వాటిని వెనక్కి రప్పించడం కుదరడం లేదని పేర్కొన్నారు. ఇలా బ్యాంక్ వారు సైతం చేతులెత్తేశారు. ఎస్బీఐకి వ్యతిరేకంగా జిల్లా వినియోగదారుల సమస్యల పరిష్కార కోర్టుకు కూడా వెళ్లాడు యమనాప్ప. కోర్టులో అది బ్యాంక్ తప్పిదం కాదని, ఎస్బీఐ కౌన్సిల్ వాదించింది. కస్టమర్ తప్పుడు అకౌంట్ నెంబర్ నొక్కడం వల్లనే ఇదంతా జరిగిందని పేర్కొంది. తొలుత యమనాప్ప సైతం అకౌంట్ నెంబర్ తప్పుగా నొక్కినట్టు ఒప్పుకోలేదు. ఆ అనంతరం తన తప్పును ఒప్పుకున్నాడు. యమనాప్ప తప్పు చేసి ఒప్పుకోలేదని, పైగా బ్యాంక్ వారే తన నగదును వెనక్కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని వాదించడం సరియైనది కాదని పేర్కొంటూ.. ఈ నెల 5న యమనాప్ప కేసును కోర్టు కొట్టివేసింది. -
కొత్త పంథాలో నకిలీ నోట్ల మార్పిడి..
సాలూరు: జిల్లాలో దొంగనోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. అసలు నోట్లకు రెట్టింపు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మిస్తూ కొందరు వరుస మోసాలకు పాల్పడుతుండగా.. ఇంకొందరు ఎంచక్కా అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞాణాన్ని వినియోగించుకుంటూ బ్యాంకులను సైతం బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఏటీఎంల వద్ద బ్యాంకులు ఏర్పాటు చేసిన క్యాష్ డిపాజిట్ మిషన్లు (సీడీఎం)ను మార్పిడికి సురక్షిత మార్గంగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. డిపాజిట్ మిషన్లు దొంగ నోట్లను గుర్తించలేకపోవడంతో అక్రమార్కులు ఎంచక్కా అందులో నగదును జమ చేసుకుని, వేరే ఏటీఎంల ద్వారా తీసేస్తున్నారు. స్థానికంగా కొంతమంది వ్యాపారులు ఇదే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. గతంలో దొంగనోట్ల చెలామణీలో కీలకపాత్ర వహించి ఒక్కసారిగా లక్షాధికారులైన వారే ఈతరహా దోపిడీకి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సీడీఎం మిషన్లలో వేసినవి అసలు నోట్లా.. నకిలీవా అని బ్యాంక్ సిబ్బంది తెలుసుకోవచ్చు. కాని మిషన్లలో జమ చేస్తున్న నగదు బ్యాంక్ సిబ్బందికి చేరడం లేదు. అక్రమార్కులు సొమ్ము డిపాజిట్ చేస్తుంటే అదే మిషన్ నుంచి మిగతా ఖాతాదారులు డబ్బులు విత్‌డ్రా చేస్తుండడంలతో నకిలీ నోట్లు వారికి చేరిపోతున్నాయి. పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, హోమ్‌గార్డు ఇదిలా ఉండగా విజయనగరంలో జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్న హోమ్‌గార్డుతో పాటు సాలూరు గొర్లెవీధికి చెందిన శకుంతల, పెదకుమ్మరివీధి సమీపంలోని చెరువుగట్టుకు చెందిన శ్యామల దొంగనోట్ల చలామణి చేస్తున్నారనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వీరిని ఏఎస్పీ దీపికాపాటిల్ విచారణ నిమిత్తం శుక్రవారం విజయనగరానికి తరలించినట్లు తెలిసింది. దొంగనోట్లు తెచ్చుకుందామని వెళ్లి... ఇచ్చిన డబ్బులకు రెట్టింపు దొంగనోట్లు తెచ్చుకునే క్రమంలో ఇద్దరు మహిళలు పట్టుబడినట్లు సమాచారం. ఇదే తరహా వ్యవహారంలో హోమ్‌గార్డు కూడా చిక్కుకోవడంతో వీరిని పోలీసులు విచారిస్తున్నారు. -
పెద్ద నోట్ల రద్దు.. ప్రజలకు మరో షాక్!
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఇళ్లలో ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయడం కూడా చాలా కష్టం అవుతోంది. బ్యాంకుల్లో పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటంతో.. అక్కడకు వెళ్లి పెద్ద నోట్లు డిపాజిట్ చేయడం లేదా మార్చుకుని కొత్తవి తీసుకోవడానికి దాదాపు మూడు నాలుగు గంటల పాటు కూడా వేచి ఉండాల్సి వస్తోంది. ఈ బాధల నుంచి తప్పించుకోడానికి ఇన్నాళ్లూ ఎలాగోలా క్యాష్ డిపాజిట్ మిషన్ల (సీడీఎం) ద్వారా కొంతవరకు పని పూర్తి చేసుకునేవారు. కానీ, ఇప్పుడు అలా చేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే, ఈ సీడీఎంలు దాదాపు ఆరు వారాల పాటు పనిచేయవని విశ్వసనీయ వర్గాల కథనం. ఇప్పటికే కొత్త నోట్లు మార్కెట్లలోకి రావడంతో.. వాటిని కూడా సీడీఎంల ద్వారా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇవి ఏటీఎంల లాంటివి కావు. ఏటీఎంలలో ఏ ర్యాక్‌లో పెడితే ఆ ర్యాక్‌ను బట్టి కాగితాలు లెక్కించి డబ్బు బయటకు పంపుతుంది. కానీ సీడీఎంలు అయితే నోటును పూర్తిగా 'రీడ్' చేస్తాయి. అందులో ఏవైనా నకిలీ నోట్లు ఉంటే ఆ విషయాన్ని కూడా స్కాన్ చేస్తాయి. ఇప్పుడు కొత్త నోట్లకు సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్లను మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సీడీఎంలలో ఫీడ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. సుమారు ఆరు వారాల వరకు ఈ మిషన్లు పని చేయకపోవచ్చని తెలుస్తోంది. బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావడానికి, రోజుకు 24 గంటల్లో ఎప్పుడైనా కొంతవరకు సేవలు అందుకోడానికి వీలుగా సీడీఎంలను, పాస్‌బుక్ ప్రింటర్లను కొన్ని ఈ బ్యాంకింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేశారు. సీడీఎంలలో డబ్బులు వేయాలంటే ముందుగా ఒక కవర్లో నగదు ఉంచి మన ఏటీఎం కార్డును ఉపయోగించి డిపాజిట్ చేయాలి. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే.. ఇలా డిపాజిట్ చేసిన మొత్తం వెంటనే మన ఖాతాలోకి క్రెడిట్ అవుతుంది. కొత్త నోట్లను, వాటిలో నకిలీలను గుర్తించేలా సీడీఎంల సాఫ్ట్వేర్ మార్చాలంటే ఎంత లేదన్నా ఆరు వారాలకు తక్కువ పట్టదని ఏటీఎంలు, సీడీఎంలు తయారుచేసే ఎన్సీఆర్ కంపెనీ ఎండీ, సీఈవో నవ్రోజీ దస్తూర్ తెలిపారు. దేశంలో మొత్తం 30 వేల వరకు క్యాష్ డిపాజిట్ మిషన్లు ఉన్నాయి. వాటిని మళ్లీ రీక్యాలిబరేట్ చేసేవరకు వాటిలో కేవలం 100, 50, 20, 10 రూపాయల నోట్లు మాత్రమే డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది.