దొంగనోట్లు
సాలూరు: జిల్లాలో దొంగనోట్ల చెలామణి జోరుగా సాగుతోంది. అసలు నోట్లకు రెట్టింపు నకిలీ నోట్లు ఇస్తామని నమ్మిస్తూ కొందరు వరుస మోసాలకు పాల్పడుతుండగా.. ఇంకొందరు ఎంచక్కా అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞాణాన్ని వినియోగించుకుంటూ బ్యాంకులను సైతం బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఏటీఎంల వద్ద బ్యాంకులు ఏర్పాటు చేసిన క్యాష్ డిపాజిట్ మిషన్లు (సీడీఎం)ను మార్పిడికి సురక్షిత మార్గంగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. డిపాజిట్ మిషన్లు దొంగ నోట్లను గుర్తించలేకపోవడంతో అక్రమార్కులు ఎంచక్కా అందులో నగదును జమ చేసుకుని, వేరే ఏటీఎంల ద్వారా తీసేస్తున్నారు. స్థానికంగా కొంతమంది వ్యాపారులు ఇదే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. గతంలో దొంగనోట్ల చెలామణీలో కీలకపాత్ర వహించి ఒక్కసారిగా లక్షాధికారులైన వారే ఈతరహా దోపిడీకి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి సీడీఎం మిషన్లలో వేసినవి అసలు నోట్లా.. నకిలీవా అని బ్యాంక్ సిబ్బంది తెలుసుకోవచ్చు. కాని మిషన్లలో జమ చేస్తున్న నగదు బ్యాంక్ సిబ్బందికి చేరడం లేదు. అక్రమార్కులు సొమ్ము డిపాజిట్ చేస్తుంటే అదే మిషన్ నుంచి మిగతా ఖాతాదారులు డబ్బులు విత్‌డ్రా చేస్తుండడంలతో నకిలీ నోట్లు వారికి చేరిపోతున్నాయి.
పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, హోమ్‌గార్డు
ఇదిలా ఉండగా విజయనగరంలో జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్న హోమ్‌గార్డుతో పాటు సాలూరు గొర్లెవీధికి చెందిన శకుంతల, పెదకుమ్మరివీధి సమీపంలోని చెరువుగట్టుకు చెందిన శ్యామల దొంగనోట్ల చలామణి చేస్తున్నారనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వీరిని ఏఎస్పీ దీపికాపాటిల్ విచారణ నిమిత్తం శుక్రవారం విజయనగరానికి తరలించినట్లు తెలిసింది.
దొంగనోట్లు తెచ్చుకుందామని వెళ్లి...
ఇచ్చిన డబ్బులకు రెట్టింపు దొంగనోట్లు తెచ్చుకునే క్రమంలో ఇద్దరు మహిళలు పట్టుబడినట్లు సమాచారం. ఇదే తరహా వ్యవహారంలో హోమ్‌గార్డు కూడా చిక్కుకోవడంతో వీరిని పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment