
సాక్షి, చెన్నై: ఏడాదిగా చెన్నైలో ఓ యువకుడు ఎస్‌బీఐ డిపాజిట్ మిషన్ ద్వారా రోజుకు రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు నగదు డిపాజిట్ చేస్తూ బ్యాంకు అధికారులకు చిక్కాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. చెన్నై కీల్పాక్కం అళగప్పా వీధిలో ఉన్న ఏటీఎం కేంద్రంలోని డిపాజిట్ మిషన్ ద్వారా ఓ యువకుడు రోజూ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఏదో ఒక ఖాతాలో డిపాజిట్ చేస్తున్నాడు.
ఏడాదిగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఎస్‌బీఐ అధికారులు దృష్టిపెట్టి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఆదివారం రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలోని సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు. రోజూ సాయంత్రం ఆరు గంటలకు ఆ యువకుడు నగదు డిపాజిట్ చేస్తున్నట్లు గుర్తించారు. సాయంత్రం 5.50 గంటలకు పోలీసులు ఆ కేంద్రం వద్ద నిఘా పెట్టారు.
ఆరు గంటలకు ఏటీఎంలోకి వచ్చిన వ్యక్తి రూ.2.10 లక్షలు డిపాజిట్ చేస్తుండగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలో ఉన్న యువకుడు, తమకు చిక్కిన వ్యక్తి ఒకడే కావడంతో రహస్య ప్రదేశానికి తరలించి రాత్రంతా విచారించారు. ఆ యువకుడు చెన్నైలోని పులియాంతోపునకు చెందిన సాయినా (29)గా గుర్తించారు.
ఇతను ఓ బైక్ సర్వీస్ కంపెనీలో పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. చెన్నైలోని ప్యారిస్‌కు చెందిన పర్వేజ్ అనే వ్యక్తి రోజూ అతను చెప్పిన ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసే పని తనకు అప్పగించినట్లు ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. తనకు రూ.లక్షకు రూ.వెయ్యి కమీషన్‌గా ఇస్తాడని పేర్కొన్నాడు. దీంతో సాయినాను సోమవారం ఈడీ అధికారులకు పోలీసులు అప్పగించారు.