పెద్ద నోట్ల రద్దు.. ప్రజలకు మరో షాక్! | another shock, cash deposit machines not to work for six weeks | Sakshi
Sakshi News home page

పెద్ద నోట్ల రద్దు.. ప్రజలకు మరో షాక్!

Published Mon, Nov 21 2016 6:16 PM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

పెద్ద నోట్ల రద్దు.. ప్రజలకు మరో షాక్! - Sakshi

పెద్ద నోట్ల రద్దు.. ప్రజలకు మరో షాక్!

కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఇళ్లలో ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయడం కూడా చాలా కష్టం అవుతోంది. బ్యాంకుల్లో పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండటంతో.. అక్కడకు వెళ్లి పెద్ద నోట్లు డిపాజిట్ చేయడం లేదా మార్చుకుని కొత్తవి తీసుకోవడానికి దాదాపు మూడు నాలుగు గంటల పాటు కూడా వేచి ఉండాల్సి వస్తోంది. ఈ బాధల నుంచి తప్పించుకోడానికి ఇన్నాళ్లూ ఎలాగోలా క్యాష్ డిపాజిట్ మిషన్ల (సీడీఎం) ద్వారా కొంతవరకు పని పూర్తి చేసుకునేవారు. కానీ, ఇప్పుడు అలా చేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే, ఈ సీడీఎంలు దాదాపు ఆరు వారాల పాటు పనిచేయవని విశ్వసనీయ వర్గాల కథనం. ఇప్పటికే కొత్త నోట్లు మార్కెట్లలోకి రావడంతో.. వాటిని కూడా సీడీఎంల ద్వారా డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇవి ఏటీఎంల లాంటివి కావు. ఏటీఎంలలో ఏ ర్యాక్‌లో పెడితే ఆ ర్యాక్‌ను బట్టి కాగితాలు లెక్కించి డబ్బు బయటకు పంపుతుంది. కానీ సీడీఎంలు అయితే నోటును పూర్తిగా 'రీడ్' చేస్తాయి. అందులో ఏవైనా నకిలీ నోట్లు ఉంటే ఆ విషయాన్ని కూడా స్కాన్ చేస్తాయి. ఇప్పుడు కొత్త నోట్లకు సంబంధించిన సెక్యూరిటీ ఫీచర్లను మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సీడీఎంలలో ఫీడ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. సుమారు ఆరు వారాల వరకు ఈ మిషన్లు పని చేయకపోవచ్చని తెలుస్తోంది. 
 
బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావడానికి, రోజుకు 24 గంటల్లో ఎప్పుడైనా కొంతవరకు సేవలు అందుకోడానికి వీలుగా సీడీఎంలను, పాస్‌బుక్ ప్రింటర్లను కొన్ని ఈ బ్యాంకింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేశారు. సీడీఎంలలో డబ్బులు వేయాలంటే ముందుగా ఒక కవర్‌లో నగదు ఉంచి మన ఏటీఎం కార్డును ఉపయోగించి డిపాజిట్ చేయాలి. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే.. ఇలా డిపాజిట్ చేసిన మొత్తం వెంటనే మన ఖాతాలోకి క్రెడిట్ అవుతుంది. కొత్త నోట్లను, వాటిలో నకిలీలను గుర్తించేలా సీడీఎంల సాఫ్ట్‌వేర్ మార్చాలంటే ఎంత లేదన్నా ఆరు వారాలకు తక్కువ పట్టదని ఏటీఎంలు, సీడీఎంలు తయారుచేసే ఎన్‌సీఆర్ కంపెనీ ఎండీ, సీఈవో నవ్రోజీ దస్తూర్ తెలిపారు. దేశంలో మొత్తం 30 వేల వరకు క్యాష్ డిపాజిట్ మిషన్లు ఉన్నాయి. వాటిని మళ్లీ రీక్యాలిబరేట్ చేసేవరకు వాటిలో కేవలం 100, 50, 20, 10 రూపాయల నోట్లు మాత్రమే డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement