ఫండ్స్‌లో కామన్ అకౌంట్ నంబర్ (క్యాన్) అంటే ఏమిటి? ఇందులో అనుకూల, ప్రతికూలతలు ఏమున్నాయి? – దిలీప్
కామన్ అకౌంట్ నంబర్/క్యాన్ అనేది ఎంఎఫ్ యుటిలిటీస్ వద్ద రిజిస్టర్ చేసుకున్న వారికి ఇచ్చే ఏకీకృత ఖాతా. ఇది మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి అన్ని రకాల లావాదేవీలను నిర్వహించే ఏకీకృత వేదిక. 2015లో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అన్నీ కలసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులకు సౌకర్యం, సులభతర నిర్వహణ దీని ఏర్పాటు ఉద్దేశ్యంగా ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడికి వీలు కల్పిస్తుంది.
ఒక ఇన్వెస్టర్ వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు చెందిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే, విడివిడిగా ఖాతాలు ప్రారంభించి, లావాదేవీలను నిర్వహించుకోవాలి. ఇందుకోసం ప్రతి ఏఎంసీ వద్ద విడిగా నమోదు చేసుకోవాలి. అయితే, క్యాన్‌ను కలిగి ఉండడం తప్పనిసరి కాదు. ఎంఎఫ్ యుటిలిటీ ద్వారానే ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కూడా లేదు. ఇదొక వేదిక మాత్రమే. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఫిన్‌టెక్ కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా, బ్రోకర్ల ద్వారా సులభంగా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
నా వయసు 40 ఏళ్లు. వచ్చే ఏడాది పీపీఎఫ్ గడువు తీరి రూ.15 లక్షలు చేతికి వస్తాయి. ఎన్‌పీఎస్ తదితర అధిక వృద్ధికి అవకాశం ఉన్న సాధనాల్లోకి ఈ మొత్తాన్ని బదిలీ చేయాలని అనుకుంటున్నాను. పీపీఎఫ్ నుంచి నాకు అందే మొత్తం పన్ను మినహాయింపు కిందకు వస్తుందని తెలిసింది. కనుక ఈ మొత్తాన్ని క్రమానుగతంగా ఈక్విటీ ఫండ్స్‌లోకి మళ్లించేది ఎలా? – సుచిత్ పూతియా
పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లోకి మళ్లించే సమయంలో మీరు కొన్ని అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఇందులో ముందుగా డ్యురేషన్ ఒకటి. మీరు ఆ మొత్తం సమకూర్చుకోవడానికి పట్టిన కాలంలో సగం కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మీరు పీపీఎఫ్‌లో 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఈ మొత్తం సమకూరింది. కనుక ఏడున్నరేళ్ల పాటు సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయమని కాదు. గరిష్టంగా మూడేళ్లకు మించకుండా నెలవారీ వాయిదాల రూపంలో మీ వద్దనున్న మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
మీ పెట్టుబడిని సమకూర్చుకోవడానికి ఐదేళ్లు పట్టిందని అనుకుందాం. అందులో సగం అంటే రెండున్నరేళ్ల పాటు క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ నూతన కాల వ్యవధి 15–20 ఏళ్లు అని అంటున్నారు. కనుక ఈక్విటీలకు ఎక్కువ కేటాయించుకోవాలి. ఎందుకంటే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించి మెరుగైన రాబడులను ఈక్విటీలు ఇవ్వగలవు. ఎన్‌పీఎస్ పథకాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈక్విటీల్లో 75% ఇన్వెస్ట్ చేసే యాక్టివ్ చాయిస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. 60 ఏళ్లకు వచ్చిన తర్వాత అప్పటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్నే ఉపసంహరించుకోవడానికి ఉంటుంది. మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది.
రిటైర్మెంట్ వరకు నిధిని ముట్టుకోని వారు అయితే, ఫ్లెక్సీ క్యాప్‌ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అచ్చమైన ఈక్విటీ పథకాలు. ఉపసంహరణలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎన్‌పీఎస్‌లో అయితే ఈక్విటీ పెట్టుబడుల్లో అధిక శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కే కేటాయిస్తారు. కానీ, ఫ్లెక్సీక్యాప్ పథకాలు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి పెట్టుబడులను వైవిధ్యం చేస్తాయి. కనుక ఇవి కొంచెం మెరుగైన రాబడులు ఇస్తాయి.
ఇప్పటి వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన అనుభవం లేకపోతే, నూరు శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకునే విషయంలో ఆందోళన చెందుతుంటే, అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి ఈక్విటీల్లో 65% వరకే ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన 35 శాతాన్ని డెట్‌లో పెడుతాయి. దీనివల్ల ఈక్విటీల్లోని అస్థిరతలను కొంత వరకు తగ్గించుకోవడానికి వీలుంటుంది. ఈక్విటీలతో పోలిస్తే స్థిరమైన రాబడులు ఇస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment