Gas Agency
-
సిలిండర్ ఈకేవైసీ @ రూ.150
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గృహజ్యోతి’ పథకంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ ప్రారంభానికి ముందే అక్రమార్కులకు కాసులపంట కురిపిస్తోంది. ఈకేవైసీ పేరుతో అందినకాడికి దోచుకుంటున్న విషయం మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై మహిళలు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక శివనగర్ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీకి రూ.150 చెల్లించాలని ఏజెన్సీ నిర్వాహకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మరోవైపు ఈకేవైసీతో పాటుగా కచ్చితంగా పైపు తీసుకోవాలనే నిబంధన ఉందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల అధికారిని వివరణ కోరగా.. ఈకేవైసీకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
సామాన్యులకు షాక్, భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్. ఇళ్లలో వినియోగించే 14.2కేజీల సిలిండర్‌పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి.దీంతో రూ.1055 నుంచి రూ.1105కు చేరిన సిలిండర్ ధరకు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, 5కేజీల డొమెస్టిక్ గ్యాస్ ధరను చమురు కంపెనీలు రూ.188కి పెంచాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం రూ.8.50కి తగ్గించాయి. సామాన్యులకు ధరాఘాతం ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉండగా..మరోవైపు పెరిగిపోతున్న ఎల్పీజీ గ్యాస్ ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బుధవారం చమురు కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ ధరను రూ.50కి పెంచాయి. దీంతో జులై 2021 నుంచి ఇవాళ్టితో మొత్తం 8సార్లు గ్యాస్ ధరల్ని పెంచినట్లైంది. ఇదిలా ఉండగా, జూలైలో కమర్షియల్ సిలిండర్ల ధరల్ని రెండోసారి తగ్గించింది. అంతకుముందు జూలై 1న 19 కిలోల ఎల్పిజి సిలిండర్‌ను రూ.198 తగ్గించారు. సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచేసింది ఈ జూన్ నెలలో కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ గ్యాస్ వినియోగం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 16 నుంచి గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అంటే గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌పై సెక్యూరిటీ డిపాజిట్ రూ.1450 ఉండగా.. దాని పెంపుతో కొత్తసింగిల్ సిలిండర్ ఇండేన్ కనెక్షన్ కోరుకునే వారు రూ.2,500కు పైనే చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక రూ. 800గా ఉన్న 5 కేజీల సిలిండర్ డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది. దీంతోపాటు రెగ్యులేటర్‌కు గతంలోని 150 రూపాయలతో పోలిస్తే ఇపుడు రూ. 250 చెల్లించాలి. కాగా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తుతోపాటు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. -
వినియోగదారులతో గ్యాస్ ఏజెన్సీల చెలగాటం
సాక్షి,సిటీబ్యూరో : నగరంలోని ముషీరాబాద్ నివాసం ఉండే శ్రీనివాస్‌కు సికింద్రాబాద్‌లోని ఒక గ్యాస్ ఏజెన్సీలో ఎల్పీజీ కనెక్షన్ ఉంది. గత పదేళ్లుగా రీఫిల్ బుక్ చేయగానే సంబంధిత గ్యాస్ ఏజెన్సీ ద్వారా డోర్ డెలివరీ జరుగుతూ వస్తోంది. గత ఏడాది క్రితం శ్రీనివాస్ కుటుంబం ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు నివాసం మారింది. అడ్రస్ మార్పు చేసుకునేందుకు వీలు పడక ఎప్పటి మాదిరిగా రీఫిల్ బుక్ చేసుకొని పాత అడ్రస్‌కు డెలివరీ జరిగిన సిలిండర్‌ను తీసుకుంటూ వస్తున్నారు. ఈ ప్రక్రియ కొంత ఇబ్బంది కరంగా ఉండటంతో కొత్త అడ్రస్‌కు గ్యాస్ కనెక్షన్ మార్చుకోవాలని భావించారు. సికింద్రాబాద్‌లోని గ్యాస్ ఏజెన్సీకి అడ్రస్ మార్పు కోసం సంప్రదించారు. అక్కడ కంప్యూటర్లో పరిశీలించి మీ కనెక్షన్ ఇక్కడ లేదని... ముషీరాబాద్ లోని ఏజెన్సీకి మార్పు చేశామని చెప్పారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఇతర ఏజెన్సీకి ఏలా మార్చుతారని నిలదీస్తే.. తమకు సంబంధం లేదని ఆయిల్ కంపెనీ అడ్రస్ ఆధారంగా కనెక్షన్ బదిలీ చేసిందని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న నివాసానికి సికింద్రాబాద్ ఏజెన్సీ దగ్గర ని పేర్కొనగా, ముషీరాబాద్ ఏజెన్సీకి వెళ్లి అడ్రస్ బదిలీ చేసుకోవాలన్నారు. గత్యంతరం లేక గ్యాస్ కనెక్షన్ కాగితాలు, చిరునామా గుర్తింపు తదితరాలు తీసుకొని వెళ్లి ముషీరాబాద్ ఏజెన్సీ నుంచి తిరిగి సికింద్రాబాద్ ఏజెన్సీకి అడ్రస్ మార్పు కోవడంతో కనెక్షన్ (వినియోగదారుడి) నెంబర్ కాస్త మారింది. ఇదీ ఒక శ్రీనివాస్ ఎదుర్కొన సమస్య కాదు... నగరంలో వేలాది మంది వంట గ్యాస్ వినియోగదారుల సమస్య. వినియోగదారులతో చెలగాటం గృహోపయోగ వంట గ్యాస్ వినియోగదారులతో ఆయిల్ కంపెనీలు చెలగాటమాడుతున్నాయి. వినియోగదారులకు కనీసం సమాచారం లేకుండానే ఏజెన్సీలను మార్చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. తిరిగి కనెక్షన్లను బదిలీ కోసం నానా తిప్పలు పడాల్సిన వస్తోంది. అడ్రస్ మార్పు కాస్త ఏళ్ల తరబడి ఉన్న గ్యాస్ కనెక్షన్ నంబర్ పై ప్రభావం చూపుతోంది. వాస్తవంగా నగరంలో సొంత నివాసాల కంటే అద్దె గృహాల్లో ఉంటున్న గ్యాస్ వినియోగదారుల సంఖ్య అధికంగా ఉంటుంది. అద్దె పెంపు తదితర కారణాలతో రెండేళ్లు... మూడేళ్లకు ఒక సారి నివాసాలను మార్చుతుంటారు. ప్రతి సారి గ్యాస్ కనెక్షన్ల అడ్రస్ మార్పిడి చేయకుండా పాత అడ్రస్ లేదా డెలివరీ బాయ్స్‌తో పరిచయాలతో రీఫిల్ తీసుకుంటుండం సర్వసాధారణంగా మారింది. ఆయితే ఆయిల్ కంపెనీలు మాత్రం అడ్రస్ ఆధారంగా గ్యాస్ కనెక్షన్లను సమీప ఏజెన్సీలకు బదిలీ చేస్తుండటం వినియోగదారులకు శాపంగా తయారైంది. 40 వేల కనెక్షన్లు దాటితే.... నగరంలోని గ్యాస్ ఏజెన్సీలకు 40 వేల కనెక్షన్ల వరకు పరిమితి ఉంది. ఆ సంఖ్య దాటితే ఆయిల్ కంపెనీలు మాస్ క్యాంపియన్లో అడ్రస్ ఆధారంగా కొన్ని కనెక్షన్లను సంబంధిత ఏరియాలకు బదిలీచేసి చేస్తుంటాయి. ఒక ఏజెన్సీకి కేవలం 24 వేల రీఫిల్ సామర్థ్యం వరకు పరిమితం మాత్రమే ఉండటంతో 40 వేల కనెక్షన్లు దాటకుండా ఎప్పటి కప్పుడు సంబంధిత ఆయిల్ కంపెనీ పర్యవేక్షిస్తోంది. ఒక ఏజెన్సీపై అదనపు భారం లేకపోవడంతోపాటు సేవలందించేందుకు మరింత వెసులుబాటు కోసం వినియోగదారులకు దగ్గర లోకి కనెక్షన్ బదిలీ చేస్తోంది. ఆయిల్ కంపెనీల నిబంధన ప్రకారం ఒక ఏజెన్సీ నుంచి మరొక ఏజెన్సీకి కనెక్షన్ బదిలీ జరిగినప్పుడు సదరు వినియోగదారులకు సెల్‌ఫోన్ ద్వారా సమచారం అందించాల్సి ఉంటుంది. గ్యాస్ బుకింగ్ సమయంలో సైతం ఏజెన్సీ మారిందన్న సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. కానీ, ఇదేమి లేకుండానే ఆయిల్ కంపెనీలు ఇష్టానుసారం ఏజెన్సీలను మార్చి వినియోగదారులకు తిప్పలకు గురిచేస్తోంది. కనెక్షన్లు ఇలా.. మహా నగర పరిధిలో మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన 125 డిస్ట్రిబ్యూటర్లకు పైగా ఉన్నారు. వారి పరిధిలో సుమారు 28.21లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రోజు డిమాండ్‌ను బట్టి ఆయిల్ కంపెనీల నుంచి డిస్ట్రిబ్యూటర్లకు రీఫిల్ స్టాక్ సరఫరా అవుతుంది. డిస్ట్రిబ్యూటర్లు అన్లైన్ బుకింగ్‌ను బట్టి వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తుంటారు. ప్రధానంగా ఐఓసీ కి సంబందించిన 11.94 లక్షలు, బీపీసీఎల్‌కు సంబంధించిన 4.96 లక్షలు,హెచ్పీసిఎల్కు సంబధించిన 11.31 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. పరిమితికి మించి ఉంటే కనెక్షన్ల బదిలీ గ్యాస్ ఏజెన్సీలకు కనెక్షన్లు, రీఫిల్‌పై పరిమితి ఉంటుంది. పరిమితికి మించితే ఆయిల్ కంపెనీలు వినియోగదారుడి ఆడ్రస్ ఆధారంగా సమీపంలోని గ్యాస్ ఏజెన్సీలకు కనెక్షన్లను బదిలీ చేస్తారు. బదిలీ జరిగిన సమయంలో వినియోగదారుల సెల్ఫోన్లకు తప్పని సరిగా సమాచారం వస్తుంది. కేవలం ఏజెన్సీలపై అదనపు భారం లేకుండా వినియోగదారులకు మరింత వెసులు బాటు కల్పించేందుకు ఎల్పీజీ కనెక్షన్ల బదిలీ ప్రక్రియ. – అశోక్ కుమార్, అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్ ఎల్పీజీ గ్యాస్ డీలర్ల సంఘం. -
‘ఆన్లైన్’ పేరుతో మోసం
విజయనగరం, నెల్లిమర్ల రూరల్: నేను నెల్లిమర్ల గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చాను.. మీ ఇంటికి ఇప్పటివరకు గ్యాస్ నేరుగా తెచ్చి డెలివరీ చేసేవారు.. వచ్చే నెల నుంచి ఆ విధానం మారుతుంది. మీ పేరిట గ్యాస్ ఆన్లైన్ చేసుకోవాలి. దీనికి ఒక్కో వినియోగదారుడు రూ.50 చెల్లించాలి. చివరి తేదీ కూడా అయిపోతోంది.. ఆన్లైన్ చేయకపోతే మీ ఇంటికి గ్యాస్ మరి రాదు.. అంటూ గ్యాస్ వినియోగదారులకు మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశాడు కొత్తపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు.. గ్యాస్ ఆన్లైన్ నమోదు పేరిట మండలంలో వల్లూరు గ్రామంలో గురువారం సాయంత్రం కాసేపు హల్చల్ చేశాడు. ఈ మాయగాడి మాటలు విన్న పలువురు రూ.50 చొప్పున చెల్లించారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు గ్యాస్ ఏజెన్సీ ఫోన్ నంబర్ ఇవ్వమని కోరగా చెప్పలేక తడబడ్డాడు. అనంతరం గ్యాస్ ఆఫీస్‌కు ఫోన్ చేసి వివరాలు కోరగా తాము ఎవ్వరినీ పంపించలేదని స్పష్టం చేయడంతో గ్రామస్తులు నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడు గతంలో నెల్లిమర్ల గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో కొన్నాళ్ల కిందట తీసేశారు. ఈ అనుభవంతోనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు భోగట్టా. గతంలో గుర్ల, చీపురపల్లి మండలాల్లో కూడా ఇదే తరహా మోసానికి పాల్పడినట్లు తెలుస్తుంది. నెల్లిమర్ల ఎస్సై నారాయణరావును వివరణ కోరగా వల్లూరు గ్రామంలో గ్యాస్ ఏజెన్సీ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు మాకు సమాచారం అందిందని మోసానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని విచారిస్తామని తెలిపారు. మోసగాళ్లను నమ్మవద్దు.... గ్యాస్ ఏజెన్సీ పేరిట తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్న మోసగాళ్లను నమ్మవద్దు. డెలివరీ బాయ్ వచ్చి గ్యాస్ ఇచ్చి డబ్బులు వసూలు చేసాడు. వాళ్లు ఎక్కువ డబ్బులు అడిగినా మాకు ఫిర్యాదు చేయండి. – గోవింద్, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహుకుడు -
జనాన్ని కొట్టి.. గ్యాస్ ఏజెన్సీలకు కట్టబెట్టి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల కంటే వ్యాపారుల పైనే మక్కువ పెరిగింది. ప్రజలపై భారం పడుతున్నా పట్టించుకోకుండా గ్యాస్ ఏజెన్సీల డీలర్లకు ఊరట కలిగించే విధంగా రవాణా చార్జీలు పెంచడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఒకేసారి వంతుకు వంతు పెంచడం గమనార్హం. దీంతో గ్యాస్ వినియోగదారులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల క్రియాశీలక పాత్ర.. వంట గ్యాస్ సిలెండర్లను చమురు సంస్థలు వినియోగదారులకు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో గ్యాస్ ఏజెన్సీలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. అవి చమురు సంస్థలు నుంచి తెచ్చి వినియోగదారులకు ఇస్తున్నాయి. మొన్నటివరకు ఉన్న నిబంధనలు ఏజెన్సీలు తమ గోదాం నుంచి ఐదు కిలోమీటర్లు లోపల సరఫరా చేసేందుకు ఎలాంటి రుసుము వసూలు చేయరాదు. ఆరు కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్ల మధ్య వినియోగదారుడు నుంచి రూ.10 వసూలు చేయొచ్చు. 15 కిలోమీటర్లు దాటి ఎంత దూరం ఉన్నా రూ.15 వసూలు చేయాలి. రవాణా చార్జీలు నిర్ణయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఒకేసారి డబుల్.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుండి గ్యాస్ సిలెండర్ల రవాణా చార్జీలను పెంచేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణ యం ప్రకారం ఐదు కిలోమీటర్ల లోపల సరఫరా చేసేందుకు ఎలాంటి రుసుం వసూలు చేయరా దు. ఆరు కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్లు మధ్య వినియోగదారుడు నుంచి ఇంతకుముందు వసూలు చేసిన రూ.10కి బదులు రూ.20 వసూలు చేయాలి. 15 కిలోమీటర్లు దాటి ఎంత దూరమైనా రూ.15 బదులు రూ.30 వసూలు చేయాలి. అంటే రెండు ఫేజుల్లో వసూలు చేసే రవాణా చార్జీ లను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసిందన్నమాట. వినియోగదారులపై భారం.. గ్యాస్ ఏజెన్సీలకు 6,15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరంతా నెలకు దాదాపు 3.20 లక్షలు గ్యాస్ బండలు వినియోగిస్తున్నారు. ఇందులో ఐదు కిలోమీటర్ల దూరం లోపల రవాణా చేసే సిలెండర్లు 80 వేలు వరకు ఉంటాయని అంచనా. 6 నుంచి 15 కిలోమీటర్ల మధ్య దూరం రవాణా చేసే సిలెండర్లు సుమారు 1.60 లక్షలు వరకు ఉంటాయి. 15 కిలోమీటర్ల దూరం దాటి రవాణా అవుతున్న సిలెండర్ల 80 వేల వరకు ఉంటాయని ఒక లెక్క. ఈ విధంగా చూస్తే 1.60 లక్షల వినియోగదారులపై నెలకు పెద్ద మొత్తంలో రూ.32 లక్షలు భారం పడినట్లే. మరో 80 వేల మంది వినియోగదారులపై నెలకు రూ.24 లక్షలు భారం పడుతుంది. వెరసి జిల్లాలో మొత్తం వినియోగదారులపై రూ.56 లక్షలు భారం పడినట్లువుతుంది. అయితే ఇందులో రూ.28 లక్షలు గతంలో భరిస్తున్నది కావడంతో కొత్తగా భారం పడినది మాత్రం రూ.28 లక్షలు. ఈ మొత్తం గ్యాస్ ఏజెన్సీలకు అదనంగా లాభం తెచ్చి పెడుతుంది. ప్రభుత్వం అకస్మాత్తుగా గ్యాస్ ఏజెన్సీలకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరగడంతో ఏజెన్సీలు రవాణా చార్జీలు పెంచాలని కోరి ఉండొచ్చు. అయితే గతం కంటే చమురు ధరలు డబుల్ కాలేదు. అలాంటప్పుడు రవాణా చార్జీలు పెంచడం ఏంటని వినియోగదారులు మండిపడుతున్నారు. వినియోగదారులకు నష్టం.. గ్యాస్ రవాణా చార్జీలు పెంచడం దారుణం. ఒకేసారి రెండింతలు చేయడం మరీ దారుణం. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రవాణా చార్జీలు కొంతైనా తగ్గిస్తే వినియోగదారులకు మేలు జరుగుతుంది. కానీ పెంచి గ్యాస్ ఏజెన్సీలు పక్షాన ప్రభుత్వం నిలవడం బాధ కలిగిస్తుంది.– ఎస్.జగదీశ్వరి, సిరిపురం, గంట్యా -
వెలగని దీపం!
► నియోజకవర్గానికి 5వేల చొప్పున ► గ్యాస్ కనెక్షన్ల కేటాయింపు ► రెండేళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియ ► ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుచేయని వైనం ► లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ► ఇవ్వడంలో తీవ్రజాప్యం ► ఇదే అదునుగా సీఎస్ఆర్ కనెక్షన్లు ► ఇస్తున్న గ్యాస్ కంపెనీలు మహబూబ్‌నగర్ న్యూటౌన్ కట్టెలపొయ్యితో పొగచూరిన మహిళలకు విముక్తి కల్పించి వారి ఆరోగ్యాలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం గ్యాస్ కనెక్షన్ల పథకం జిల్లాలో అర్హుల దరి చేరడం లేదు. ఈ పథకం గ్రౌండింగ్ విషయంలో సమావేశాలు నిర్వహించి పురోగతిని పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా కిందిస్థాయి అధికారులకు పట్టడం లేదు. సరైన సిబ్బంది లేరనే సాకు వారికి తోడైంది. దీంతో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. దీపం పథకం కింద నియోజకవర్గానికి 5 వేల చొప్పున పేదలకు గ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసి రెండేళ్లు గడుస్తోంది. అయినా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం పట్ల ఉన్నతాధికారులు సైతం పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమలులో ఎలాంటి లోపాలున్నాయో ఇప్పటివరకు స్పష్టత రాని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారుకు ఇష్టం లేకపోతే రాతపూర్వకంగా రాయించుకొని రద్దు చేసి ఆ స్థానంలో వేరొకరికి అవకాశవిువ్వాలని దీపం పథకం గ్రౌండింగ్‌పై గత నెల క్రితం నిర్వహిం చిన సమావేశంలో పౌరసరఫరా ల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులకు జిల్లా జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు నెల రోజులు గడిచినా పురోగతిలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. పర్యవేక్షణా లోపం కారణంగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఈ పథకం అమలుపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. అడ్డంకిగా మారిన సీఎస్ఆర్ దీపం పథకం అమలుకు సీఎస్ఆర్ (కంపెనీ సోషల్ రెస్సా¯Œ్సబుల్) విధా నం అడ్డంకిగా మారింది. దీపం పథకంలో లబ్ధిదారుల ఎంపిక రాజకీయ నాయకులు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల ప్రమేయంతో జరుగుతోంది. దీంతో కనెక్షన్లు మంజూరై రెండేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు ఇప్పటివరకు మంజూరు ప్రొసీడింగులు అందలేదు. లబ్ధిదారుల అవసరాలను ఆసరాగా చేసుకున్న గ్యాస్ ఏజెన్సీలు.. కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ కనెక్ష¯ŒSలపై దృష్టి సారించాయి. దీపం లబ్ధిదారులకు సీఎస్ఆర్ కనెక్ష¯ŒSలు ఇస్తున్నాయి. అప్పటికే కనెక్ష¯ŒS తీసుకోవడంతో దీపం పథకం కింద మంజూరైన కనెక్షన్ల గ్రౌండింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్యాస్ కంపెనీల లాభాల్లోనుంచి 2 శాతం ఖర్చు చేయాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం... సీఎస్ఆర్ కనెక్షన్లను పేద లబ్ధిదారులకు డిపాజిట్ లేకుండా గ్యాస్ కంపెనీలు అందజేయడం గమనార్హం. లక్ష్యం 27,262 దీపం కనెక్షన్లు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 5 వేల చొప్పున దీపం కనెక్షన్లు మం జూరు చేసింది ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన తర్వాత తాజా మహబూబ్‌నగర్ జిల్లాకు 27,262 దీపం కనెక్షన్లను లక్ష్యంగా నిర్దేశిం చారు. అందులో 20,846 మంది లబ్ధిదారులను గుర్తించగా 20,406 మందికి అనుమతులు మంజూరు చేశారు. మొత్తం 18,077 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగులను జారీ చేశారు. ఇప్పటివరకు అందులో 9,624 మందికి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అనుమతులు జారీ చేసిన వాటిలో ఇంకా 8,453 కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. మంజూరు చేసిన దీపం పథకం కనెక్షన్లకు డిపాజిట్ రూపేణ రూ.1600 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు చెల్లించింది. దీపం పథకం లబ్ధిదారుల పేరిట డిపాజిట్ రూపేణ గ్యాస్ కంపెనీలకు దాదాపు రూ.4.36 కోట్లు వెచ్చించింది. రాజకీయ పట్టువిడుపులు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ పథకం పురోగతి సాధించకపోవడానికి క్షేత్రస్థాయిలో రాజకీయాల పట్టువిడుపులు ఒక కారణమైతే, కంపెనీలు ఇస్తున్న సీఎస్ఆర్ కనెక్షన్లు మరో కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎస్ఆర్ కనెక్షన్లు నిలిపివేయాలని అధికారుల సిఫారసు మేరకు ప్రజాప్రతినిధులు సంబంధిత గ్యాస్ కంపె నీలపై ఒత్తిడి తెచ్చారు. పథకం పురోగతిలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులతో రెండుమూడు సార్లు స మీక్షలు నిర్వహించి చర్చించారు. సీ ఎస్ఆర్ కనెక్షన్లకు అనుమతులు ఎందుకిస్తున్నారని, గతంలో ఇచ్చి న వాటికి కచ్చితంగా అనుమతి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు.. అధికారులకు హుకూం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన సీఎస్ఆర్ కనెక్షన్లకు అనుమతుల కోసం గ్యాస్‌డీలర్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటికే దీపం పథకం లబ్ధిదారులు సీఎస్ఆర్ కనెక్షన్లు పొం దడం, గ్యాస్ ఏజెన్సీలను టార్గెట్ చేసి ప్రజాప్రతినిధులు టెక్నికల్‌గా ఇబ్బందులు పెట్టడం, అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధచూపకపోవడం కారణాలు దీపం పథకం అమలుకు అడ్డంకిగా మారాయని తెలుస్తోంది. -
మళ్లీ వంట గ్యాస్ కొరత!
బిల్లు జనరేట్ ఆ తర్వాత రద్దు రెండు సార్లు బుకింగ్ చేస్తేనే.. గ్యాస్ ఏజెన్సీల చేతివాటమా..? డెలివరీకి కనీసం 20 రోజులు నగరంలోని సైదాబాద్‌కు చెందిన హుస్సేన్ అనే వినియోగదారుడు ఆన్లైన్ ద్వారా ఈ నెల 2న తన ఎల్పీజీ రీఫిల్‌ను బుకింగ్ చేసుకున్నాడు. 10వ తేదీన బిల్లు జనరేట్ జరిగి త్వరలో రీఫిల్ డెలివరీ కానున్నట్లు మొబైల్‌కు మేస్జ్ వచ్చింది. రెండు రోజుల తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోగా, బుకింగ్ రద్దయినట్లు... తిరిగి బుక్ చేసుకోమని మరో మేసెజ్ చేరింది. మళ్లీ బుక్ చేస్తే వారం తర్వాత బిల్లు జనరేట్ ఆయినట్లు త్వరగా డెలివరీ జరగనున్నట్లు మొబైల్‌కు సమాచారం వచ్చినా.. సిలిండర్ మాత్రం రాలేదు. ఇది గ్రేటర్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇక్కట్లకు నిదర్శనం.. సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో మళ్లీ వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఆన్లైన్లో రెండు సార్లు బుకింగ్ చేస్తే కానీ.. సిలిండర్ ఇంటికి చేరే పరిస్థితి కన్పించడంలేదు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల చేతివాటమో.. లేక డెలివరీ బాయ్స్ జమ్మిక్కులో తెలియడం లేదు. అయితే డోర్ లాక్ లేకున్నా వంట గ్యాస్ సిలిండర్ ఇంటికి చేరేసరికి కనీసం 20 రోజులు పడుతుంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. వాస్తవంగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు నగదు బదిలీ పథకంలో చేరిన వినియోగదారులకు ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీపై సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ పైన సిలిండర్లకు సంబందించిన సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ కాదు. ఆయితే ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుండటంతో గత రెండు నెలలుగా బిల్లు జనరేట్ తర్వాత బుకింగ్ అటోమెటిక్‌గా రద్దు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా వంట గ్యాస్ కొరతతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇదీ కనెక్షన్ల పరిస్థితి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 29.18 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, హైదరాబాద్ పరిధిలోనిలోని 13.22 లక్ష లు, రంగారెడి జిల్లా పరిధిలో 15.96 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. మొత్తంమీద గ్యాస్ ఏజెన్సీలు 115 ఉండగా, ప్రతిరోజు 80 వేల నుంచి లక్షల మంది వినియోగదారుల వరకు గ్యాస్ బుకింగ్ చేస్తుంటారు. డెలివరీ సైతం ప్రతిరోజు 60 వేలకు తగ్గకుండా సరఫరా ఉంటుందని ఆయిల్ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.. తాజాగా బుకింగ్ రద్దు వ్యవహారంతో కనీసం 40 వేల వరకు కూడా సిలిండర్ డెలివరీ కానట్లు సమాచారం. -
గుదిబండ
గ్యాస్ బండలు వినియోగదారుల పాలిట గుదిబండల్లా మారుతున్నాయి. సిలిండర్ డెలివరీ చేసినందుకు 15 కిలోమీటర్ల మేరకు ఏజెన్సీలకు వినియోగదారులు రూపాయి కూడా చెల్లించాల్సినఅవసరంలేదు.. దీనిని దాచిపెట్టి ఏజెన్సీలు వినియోగదారుల నుంచి దండుకుంటున్నాయి.. అదేమని ప్రశ్నిస్తే.. సర్వీస్ చార్జ్ అని డెలివరీ బాయ్స్ సమాధానం చెబుతున్నారు... రవాణా పేరిట అదనపు వసూళ్లు గ్యాస్ ఏజెన్సీల ఘరానా దోపిడీ జిల్లాలో నెలకు సామాన్యుడిపై రూ.రెండు కోట్లపైనే భారం బాపట్లటౌన్ పట్టణంలోని రామకృష్ణాపురం కాలనీ.. గ్యాస్ ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి రెండు కిలోమీటర్ల లోపే ఉంటుంది. కాలనీకి చెందిన వి.శ్రీలతకు గ్యాస్ కంపెనీ నుంచి ఇటీవల సిలిండర్ వచ్చింది. బిల్లుపై రూ.642 ఉంటే డెలివరీ బాయ్ రూ.680 తీసుకున్నాడు. అదేంటని ప్రశ్నిస్తే అది అంతే.. సర్వీస్ ట్యాక్స్ అంటూ వెళ్లిపోయాడు. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన రాములమ్మకు గ్యాస్ వచ్చింది. ఆమె సిలిండర్‌కు సరిపడా రూ.645 ఇచ్చింది. ఇదేంటి సర్వీస్ చేసినందుకు రూ.50 ఇవ్వాలి.. లేదంటే సిలిండర్ వెనక్కు తీసుకుపోతా.. అని డెలీవరీ బాయ్ వసూలు చేశాడు. మరుప్రోలువారిపాలేనికి చెందిన మస్తానమ్మ గృహం గ్యాస్ ఏజెన్సీ నుంచి రెండు కి.మీ దూరంలో ఉంటుంది. ఆమెకు సిలిండర్ సరఫరా చేసినందుకు గ్యాస్ రేటు కంటే రూ.30 అదనంగా వసూలు చేశారు.. దండుకుంటున్న ఏజెన్సీలు కంపెనీ బిల్లుపై ఒక్క రూపాయి కూడా గ్యాస్ సిలిండర్ కోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా ఒక్కో సిలిండర్‌కు రవాణా చార్జీల కింద రూ.30 నుంచి 50 వరకూ వసూలు చేస్తున్నారు. ఇలా నెలకు సుమారు జిల్లా వ్యాప్తంగా రూ.రెండు కోట్లపైనే వినియోగదారుల నుంచి గ్యాస్ ఏజెన్సీలు దండుకుంటున్నాయి. ఆ అక్రమార్జనలో మాముళ్లు చేతులు మారుతుండటంతో మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. నిబంధనలు.. గ్యాస్ ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి 15 కిలోమీటర్లలోపు ఉన్న వినియోగదారులకు కంపెనీ ధరకే సిలిండర్ అందజేయాల్సి ఉంది. ఆ తర్వాత కిలోమీటరకు రూ.5 చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలు జరగడంలేదు. ఏజెన్సీలకు కూతవేటు దూరంలో ఉన్న గృహాలకు సిలిండర్ వచ్చినా అదనంగా వసూలు చేస్తున్నారు. జిల్లా అధికారులకు తెలిసినా.. తెలియనట్టు! జిల్లా వ్యాప్తంగా సుమారు 70 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి నుంచి నెలకు సరాసరి సుమారు 8.50 లక్షల సిలిండర్లు వినియోగదారులకు సరఫరా అవుతున్నాయి. ఒక్కో సిలిండర్‌కు రూ.30 చొప్పున చూస్తేనే 8.50 లక్షల సిలిండర్లకు రూ.2.55 కోట్లు వినియోగదారుల నుంచి దండుకుంటున్నారు. ఈ విషయం మండల స్థాయి జిల్లా స్థాయి అధికారుల దృష్టికి అనేకమంది తీసుకెళ్లినా ఫలితంలేకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి ఉంది. బిల్లు కంటే అదనంగా రూపాయి కూడా చెల్లించొద్దు.. గ్యాస్ సిలిండర్ పై ఉన్న బిల్లు కంటే 15 కి.మీ లోపు డెలివరీ చేస్తే ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అదనంగా వసూలు చేస్తున్న ఏజెన్సీలపై ఫిర్యాదు చేస్తే సత్వరమే చర్యలు తీసుకుంటాం. - డీఎస్వో చిట్టిబాబు -
గ్యాస్‌కు ఆధార్ గుదిబండ
సాక్షి, ప్రతినిధి, నెల్లూరు : సంక్షేమ పథకాలకు కోతపెట్టే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. వంటగ్యాస్‌పై రాయితీని తగ్గించుకునేందుకు కేంద్రం ఆధార్ అనుసంధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. గ్యాస్‌పై రాయితీ పొందాలంటే ఈనెల 31వ తేదీలోపు లబ్ధిదారులు ఆధార్ నంబరును అనుంధానం చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. గ్యాస్ ఏజెన్సీల్లో ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసుకోకుంటే వచ్చేనెల నుంచి సిలిండర్‌పై నగదు బదిలీ వర్తించదని తేల్చి చెప్పింది. ఓవైపు సుప్రీంకోర్టు సంక్షేమ పథకాలకు ఆధార్ లింకు పెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. గ్యాస్ నిర్వాహకులు సిలిండర్ రాయితీపై ఆంక్షలు సడలించలేదు. దీంతో గ్యాస్ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అనుసంధానం చేయాల్సిందే జిల్లావ్యాప్తంగా మొత్తం 4,76,920 మంది గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు. భారత్, ఎచ్పీ, ఇండియన్ గ్యాస్ కంపెనీల నుంచి లబ్ధిదారులు కనెక్షన్లు పొంది ఉన్నారు. ఈ గ్యాస్ సరఫరా మొత్తం 52 మంది డీలర్ల నుంచి పంపిణీ జరుగుతోంది. అయితే 3,93,712 మంది లబ్ధిదారులు ఆధార్ నంబరు అనుసంధానం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 83,212 మంది ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. అయితే అనధికారికంగా లక్షమందికిపైగా ఉన్నట్లు సమాచారం. లబ్ధిదారులకు అందించే ప్రతి సిలిండర్‌కు కేంద్రం రాయితీ ఇస్తుంది. కంపెనీ ధర ప్రకారం సిలిండర్‌కు రూ.860లు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం రాయితీ మీద రూ.472లకే అందజేస్తున్న విషయం తెలిసిందే. గ్యాస్ పథకానికి కేంద్రం ఆధార్ అనుసంధానం చేసి లబ్ధిదారుని ఖాతాకే నేరుగా రాయితీ నగదును బదీలీ చేసే విధం గా చర్యలు చేపట్టింది. ఇందుకుగాను లబ్ధిదారుడు ఆయా ఏజెన్సీల్లో ఆధార్‌తో పాటు బ్యాంకు ఖాతా నంబర్‌ను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ అనుంధానానికి 31 గడువు గ్యాస్ లబ్ధిదారులు ఆధార్ అనుంధానానికి ఈనెల 31 చివరి గడువుగా విధించారు. అందులో భాగంగా లీడ్ బ్యాంక్ మేనేజనర్ డి వెంకటేశ్వరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి లబ్ధిదారులకు తప్పనిసరిగా నగదు బదిలీ పథకాన్ని వర్తింపజేయునున్నట్లు తెలిపారు. ఆధార్ అనుంధానం చేసుకోని లబ్ధిదారులు సిలిండర్‌కు మొత్తం ధర ను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆధార్ అనుసంధానం చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీని నగదు బదిలీ పథకం ద్వారా ఖాతాకు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ చెప్పిన విధంగా.. లబ్ధిదారుడు ముందు సిలిండర్‌కు సంబంధించి మొత్తం ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోని వారు, ఎన్రోల్మెంట్ చేసుకున్నా.. నంబర్ రాని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఆయా కంపెనీలకు చెందిన డీలర్లు మాత్రం ఆధార్ నంబరు అనుసంధానం చేయకుంటే నగదు బదిలీ పథకం వర్తించదని తెగేసి చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఆధార్ లేని లక్షమందికి వచ్చేనెల నుంచి వంటగ్యాస్ రాయితీ వర్తించదని అధికారులు తేల్చిచెబుతున్నారు. లక్షమందికి వచ్చేనెల నుంచి ఒకరికి రూ.388 చొప్పున మొత్తం రూ.3.88 కోట్లు అదనపు భారం పడనుంది. సుప్రీం ఆదేశాలుకు బేఖాతర్ సంక్షేమ పథకాలకు ఆధార్ లింకు పెట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే సుప్రీం ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బేఖాతరు చేస్తూ సంక్షేమ పథకాలకు ఆధార్ లింకును ముడిపెడుతున్నాయి. దీంతో ఆయా లబ్ధిదారులు ఆధార్ లింకుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పేద, మధ్య తరగతికి చెందిన వర్గాలు మాత్రమే ఆధార్‌కార్డు అనుసంధానంలో వెనుకబడినట్లు తెలుస్తుంది. వీరందరిపై వచ్చేనెల నుంచి వంటగ్యాస్‌కు భారం పడనుంది. వంటగ్యాస్‌కు ఆధార్ నెంబరు ముడిపెట్టడంపై ఆయ వర్గాలకు చెందిన ప్రజలు మండిపడుతున్నారు. -
బండ దోపిడీ
ఏలూరు (టూటౌన్) :జిల్లాలోని వివిధ కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులను దోచేస్తున్నాయి. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని అయినకాడికి దండుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ఏజెన్సీల అక్రమార్జన మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్టుగా సాగుతోంది. జిల్లాలో 57 గ్యాస్ ఏజెన్సీల ద్వారా 8 లక్షల 19వేల 568 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో లక్షా 45 వేలు డ్వాక్రా మహిళలకు సంబంధించినవి. వీరందరికీ ఒకే గ్యాస్ బండ ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీలు తమ వినియోగదారులకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా డోర్ డెలివరీ చేయాల్సి ఉంది. అది దాటితే 30 కిలోమీటర్ల లోపు 10 రూపాయలు, అది కూడా దాటితే 15 రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం ఒక్కొక్క వినియోగదారుడి నుంచి రూ. 50 నుంచి రూ. వంద వరకూ వసూలు చేస్తున్నారు. కొన్ని ఏజెన్సీలైతే వినియోగదారులను తమ వద్దకే వచ్చి గ్యాస్ బండ తీసుకోవాలని నిబంధన పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్నిచోట్ల గ్యాస్ బుక్ చేసిన ప్పటికీ కంప్యూటర్స్ పనిచేయటం లేదని చెప్పి సకాలంలో గ్యాస్‌ను సరఫరా చేయడం లేదు. దీంతో వినియోగదారుడు తన అవసరం కొద్దీ అదనంగా సొమ్ము చెల్లించి గ్యాస్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డ్వాక్రా గ్రూపులకు గ్యాస్ సరఫరా చేసే ఏలూరుకు చెందిన ఒక గ్యాస్ ఏజెన్సీ బాగా ఇబ్బంది పెడుతోందని ఆరోపణలున్నాయి. ఈ ఏజెన్సీ పరిధిలో సకాలంలో గ్యాస్ సరఫరా చేయాలంటే ఆటోడ్రైవర్లకు అదనపు సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. లేకపోతే రెండు నెలలకు కూడా గ్యాస్ పంపిణీ చేయటం లేదు. అదేమని మహిళలు అడిగితే మీ గ్యాస్ కనెక్షన్ తిరిగి రెగ్యులర్ చేసుకోవాలని, మీ వివరాలు విశాఖపట్నంలోని ఐఓసీకి పంపి కొత్తగా అనుమతి తెచ్చుకోవలసి ఉంటుందని చెప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ అధికారులకు తెలిసినా వారు పట్టించుకోకపోవటంతో గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల్ని పీడిస్తున్నాయి. అక్రమ మార్గంలో వినియోగం గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ బండలను కొంతమంది వ్యాపారులు, హోటల్స్ యజమానులు తమ ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వ్యాపారులకు ఎక్కువకు అమ్ముకుని డ్వాక్రా మహిళలను, గృహ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వినియోగదారులకు సంవత్సరానికి 12 గ్యాస్ బండలు ఇవ్వాలన్నది నిబంధన కాగా, చాలా ఏజెన్సీలు గ్రామీణ ప్రాంతాలలో 6 నుంచి 8 బండలను మాత్రమే అందిస్తున్నాయి. మిగిలినవి అడ్డదారిలో అమ్ముకుంటున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం గ్యాస్ కనెక్షన్లకు పూర్తి స్థాయిలో ఆధార్‌కు అనుసంధానం చేయకపోవటమే. నిబంధనల మేరకు గ్యాస్ సరఫరా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం డ్వాక్రా మహిళలకు, గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా చేసే సమయంలో అక్రమంగా వసూళ్లకు పాల్పడితే వాహనాలను ఆపి మాకు సమాచారం అందించాలి. అలా చేసిన వారి ఏజెన్సీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం త్వరలో గ్యాస్ పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో వినియోగదారుడు గ్యాస్ కనెక్షన్లు వేరే కంపెనీకి మార్చుకోవటంతో పాటు, కావలసిన ఏజెన్సీకి మార్చుకోవచ్చు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ను వ్యాపారులు వినియోగిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ప్రజలు మాకు సమాచారం అందించాలి. - డి. శివశంకర్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏలూరు. -
బాధల బదిలీ
గ్యాస్ బండ అందకున్నా తీసుకున్నట్లు మెసేజ్‌లు నత్తనడకన వంటగ్యాస్ ఆధార్ సీడింగ్ జిల్లాలో 7,20,991 వంటగ్యాస్ కనెక్షన్లు ఏజెన్సీల పరిధిలో 92 శాతం సీడింగ్ బ్యాంకుల వద్ద 82 శాతం సీడింగ్ చిత్తూరు: నగదు బదిలీ పథకం కాస్తా కష్టాల బదిలీగా మారింది. వంటగ్యాస్‌కు ఈ పథకం అమలు చేయడంలో బాలారిష్టాలను అధిగమించడం లేదు. గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల్లో ఇచ్చిన ఖాతా నంబర్‌కు నగదు సక్రమంగా జమ కావడం లేదు. ఒకే ఆధార్‌కార్డు నంబర్‌తో వేర్వేరు బ్యాంకుల్లో ఖాతా ఉన్న వ్యక్తులకు కొత్త కష్టాలు తప్పడం లేదు. ఏజెన్సీలో ఇచ్చిన ఖాతాకు కాకుండా మరో అకౌంట్లో మొత్తం జమ అవుతోంది. దీంతో ఆ వినియోగదారుడు తిప్పలు పడుతున్నాడు. ఇంకొంత మందికి అసలు సబ్సిడీ అందుతున్న పరిస్థితి లేదు. కొందరికి సబ్సిడీ మొత్తం తక్కువగా జమ అవుతోంది. దీంతో వినియోగదారులు పదేపదే ఏజెన్సీలు, బ్యాంకుల వద్దకు తిరగాల్సి వస్తోంది. సర్వర్ సమస్య ఈ సమస్యలన్నింటికీ సాంకేతిక తప్పిదాలే కారణం అని చమురు సంస్థల ప్రతినిధులు చల్లగా చెబుతున్నారు. ముంబైలోని సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల సెల్ఫోన్లకు తప్పుడు ఎస్ఎంఎస్లు వస్తున్నట్లు చెబుతున్నారు. ఒకే ఆధార్ నంబర్‌తో ఇతర బ్యాంకుల్లో కూడా అకౌంట్లు ఉండడంవల్ల వంటగ్యాస్ సబ్సిడీ మొత్తం మిగిలిన అకౌంట్లలో పడే అవకాశం ఉంటుందనేది వారి వాదన. ఏది ఏమైనా వినియోగదారులు మాత్రం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సాగని ఆధార్ సీడింగ్ వంటగ్యాస్ సబ్సిడీకి సంబంధించి సవరించిన నగదు బదిలీ పథకాన్ని చిత్తూరు జిల్లాలో అమలు చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో బ్యాంకుల ద్వారా వినియోగదారులకు అందించనున్నారు. ఇందుకోసం ఆధార్ సీడింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి 14వ తేదీ లోపల పూర్తి చేయాలని తుది గడువు విధించారు. ఆ లోపు ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారికి సబ్సిడీ అందదని చెబుతున్నారు. గతంలో ప్రక్రియను పూర్తిచేసిన వినియోగదారులు మాత్రం ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరంలేదు. నాలుగేళ్లుగా నత్తనడక జిల్లాలో 2012లో వంటగ్యాస్‌కు ఆధార్ సీడింగ్ ప్రక్రియను ప్రారంభించారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. వినియోగదారులు శ్రద్ధ చూపకపోవడంతోనే ఆధార్‌సీడింగ్ ప్రక్రియ ముందుకు సాగడంలేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. జిల్లాలో ఐవోసీ, హెచ్‌పీ, భారత్ పెట్రోలియం గ్యాస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. ఇండేన్‌కు సంబంధించి జిల్లాలో 4,50,000 మంది వంట గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకూ 89.98 శాతం మంది గ్యాస్ ఏజెన్సీ వద్ద ఆధార్ సీడింగ్ పూర్తి చేయగా బ్యాంకుల వద్ద మాత్రం కేవలం 81.84 శాతం మాత్రమే సీడింగ్ పూర్తి చేశారు. హెచ్‌పీకి సంబంధించి 20 ఏజెన్సీల పరిధిలో 2,20,976 కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గ్యాస్ ఏజెన్సీల వద్ద 93 శాతం ఆధార్‌సీడింగ్ పూర్తి కాగా బ్యాంకుల వద్ద మాత్రం 83 శాతం మాత్రమే సీడింగ్ పూర్తయింది. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం వినియోగదారులను అష్టకష్టాలకు గురి చేస్తోంది. గ్యాస్ బండ అందని వారికి కూడా తీసుకున్నట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. రెండు లేదా మూడు బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి సబ్సిడీ మొత్తం ఏ ఖాతాలో జమ అయిందనేది కూడా తెలియడం లేదంటున్నారు. ఆధార్‌కార్డుల అనుసంధాన ప్రక్రియతోపాటు సాంకేతిక లోపాలు వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. -
గ్యాస్ ఏజెన్సీల మంజూరుకు రాజకీయ గ్రహణం!
-
గ్యాస్ ఏజెన్సీల మంజూరుకు రాజకీయ గ్రహణం!
రెండేళ్లుగా కార్యరూపం దాల్చని నోటిఫికేషన్ ఏపీ, తెలంగాణల్లో 499 ఎల్పీజీ ఏజెన్సీల కేటాయింపుపై నీలినీడలు రాజకీయ పలుకుబడితో అడ్డుపడుతున్న పాత ఏజెన్సీల నిర్వాహకులు విజయవాడ బ్యూరో: గ్యాస్ ఏజెన్సీల మంజూరుకు రాజకీయ గ్రహణం పట్టింది. దీంతో కొత్త ఏజెన్సీల ఏర్పాటు కోసం మూడు చమురు కంపెనీలు ఇచ్చిన నోటిఫికేషన్ రెండేళ్లుగా కార్యరూపం దాల్చడంలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 499 కొత్త ఏజెన్సీల మంజూరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎల్పీజీ కొత్త ఏజెన్సీలు ఏర్పాటు చేస్తే తమ ఆదాయానికి గండి పడుతుందని భావించిన పాత డీలర్లు అడ్డుపడుతుండటంతో ఈ వ్యవహారం కొలిక్కిరావట్లేదని తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు కేంద్ర పెట్రోలియం శాఖ పరిధిలోకి చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓఎల్ కంపెనీలు 499 కొత్త ఏజెన్సీల డీలర్‌షిప్‌ల కోసం 2012లో నోటిఫికేషన్ జారీ చేశాయి. అప్పట్లో పాత డీలర్లు రాజకీయ పలుకుబడితో దానిని రద్దు చేయించగలిగారు. తర్వాత అవే ఏజెన్సీలకు సంబంధించి 2013 సెప్టెంబర్ 15న మరోసారి నోటిఫికేషన్ జారీ అయింది. కొత్త ఏజెన్సీల కోసం వేలసంఖ్యలో ఔత్సాహికులు దరఖాస్తు చేశారు. అయితే కొత్త ఏజెన్సీలిస్తే తాము తీవ్రంగా నష్టపోతామంటూ పాత ఏజెన్సీల నిర్వాహకులు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. వీరి వాదనను పెట్రోలియం శాఖతోపాటు మూడు చమురు కంపెనీలు తోసిపుచ్చాయి. ‘‘గతంలో ఐదారు వేలు వంటగ్యాస్ కనెక్షన్లున్న పాత ఏజెన్సీల్లో ఇప్పుడు 25 వేల నుంచి 40 వేల వరకు పెరిగాయి. అందువల్ల వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందట్లేదు. వీలైనంత ఎక్కువ ఏజెన్సీలు ఏర్పాటు చేసి వినియోగదారులకు భారాన్ని తగ్గించాలన్నదే మా ఉద్దేశం’’ అని పేర్కొంటూ వాదనలు వినిపించాయి. దీంతో ఎల్పీజీ కొత్త ఏజెన్సీల నియామకాన్ని సమర్థిస్తూ గత నెలలో హైకోర్టు తీర్పు చెప్పింది. పట్టువదలని పాత డీలర్లు..: హైకోర్టు తీర్పుచెప్పినా పాత ఏజెన్సీల నిర్వాహకులు పట్టువదల్లేదు. ఏకంగా కేంద్రంలోని పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. తమకు మద్దతుగా ఏపీ, తెలంగాణల్లో 30 మంది ఎంపీల సంతకాలను సైతం సేకరించి కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్రప్రధాన్‌కు సమర్పించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏజెన్సీల ఏర్పాటు ఇప్పుడు కేంద్రం నిర్ణయంపై ఆధారపడి ఉంది. -
పండగ వేళ.. గుది‘బండ’
సాక్షి, రాజమండ్రి : ఇంట్లో గ్యాస్ నిండుకుందా. అయితే మీకు తిప్పలు తప్పవు. రెండు వారాలు దాటినా గ్యాస్ ఇంటికి రాదు. డీలర్ వద్దకెళ్లి స్పాట్ బుకింగ్ చేసుకుందామనుకున్నా, వందల్లో జనం క్యూలో పడిగాపులు పడుతుంటారు. ఉదయం 8 గంటలకు వెళ్లి, పది గంటలకు ఆఫీసు సమయంలోగా గ్యాస్ ఇంట్లో పడేసుకుందాం అనుకుంటే.. ఆ పప్పులేం ఉడకవు. కనీసం రెండు రోజులు సెలవు పెట్టి క్యూలో నిలబడాల్సిందే. ఎందుకంటే జిల్లాలో ఈ పండగల సీజన్లో జనానికి గ్యాస్ కష్టాలు పట్టుకున్నాయి. మూడు వారాలుగా వినియోగదారులకు పంపిణీ అయ్యే గ్యాస్ సరఫరాలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఐవీఆర్ఎస్ ద్వారా బుక్ చేసుకున్న వారికి సుమారు 15 నుంచి 20 రోజుల్లో కానీ గ్యాస్ సరఫరా కావడం లేదు. సిలిండర్ ఎందుకు రాలేదని డీలర్‌ను అడిగితే.. మీ వద్ద ఉన్న ఐవీఆర్ఎస్ నంబరులో డయల్ చేస్తే విషయం తెలుస్తుందని ఉచిత సలహా పడేస్తున్నారు. గతంలో లేదిలా.. ఏడాది కాలంగా జిల్లాలో సిలిండర్ బుక్ చేస్తే గరిష్టంగా వారం రోజుల్లో ఇంటికి వచ్చేది. కొంతమంది బుకింగ్‌తో ప్రమేయం లేకుండా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి, స్పాట్ బుకింగ్ ద్వారా సిలిండర్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ నెల రోజులుగా వినియోగదారుల ఇంట్లో బండ నిండుకుంటే.. ఓ గండం ఎదురవుతోంది. డీలర్ వద్దకు వెళితే స్టాక్ లేదంటాడు. స్టాక్ ఉంటే.. వందల జనం క్యూలో ఉంటున్నారు. కష్టపడి క్యూలో నిలబడితే, వారి నంబరు వచ్చేసరికి ‘నో స్టాక్’ అంటున్నారు. శ్రావణ మాసం నుంచి ఇళ్లల్లో పండగలు వరుసగా వస్తుంటాయి. వినాయక చవితి పూట కూడా ఇదే స్థితి ఎదురైనా సర్దుకుంటుందేమో అని భావించిన జనానికి రానురాను పరిస్థితి మరింత జటిలమవుతోంది. దసరా, దీపావళి సమీపిస్తున్న తరుణంలో పండగ పూటా ఇదేం గోలరా బాబూ అనుకుంటున్నారు వంటింట్లో ఆడపడుచులు. గ్యాస్ కనెక్షన్ల తీరిలా.. జిల్లాలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ డీలర్లు సుమారు 35 మంది వరకూ ఉన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పంపిణీదారులు 12, భారత్ పెట్రోలియం పది, ఇతరులు ఐదుగురు మొత్తం 65 మంది వరకూ గ్యాస్ డీలర్లు ఉన్నారు. జిల్లాలో 25 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరంతా ముందుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని, ఆ తర్వాత ప్రయారిటీ ప్రకారం బుక్ చేసుకున్న వారికి పంపిణీ చేస్తారు. ఐవీఆర్ఎస్తో తిప్పలు ఇటీవల అన్ని కంపెనీలు దళారులకు చెక్ పెట్టేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సర్వీసులకు ఓ నంబరు ఉంటుంది. వినియోగదారులు దానికి ఫోన్ చేసి, తమ గ్యాస్ కనెక్షన్ నంబరు ఫోన్ కీ ప్యాడ్‌పై టైపు చేస్తే రిక్వెస్ట్ బుక్ అవుతుంది. అందులో ఎన్నాళ్లకు సిలిండర్ ఇస్తారనే సమాచారం సరిగ్గా లభించడం లేదు. మళ్లీ డయల్ చేసి ఆప్షన్ల ద్వారా బుకింగ్ స్థితి తెలుసుకుందామంటే.. బుక్ చేసిన తేదీ మాత్రం తెలుస్తోంది. గ్యాస్ డీలర్‌ను సంప్రదిస్తే.. ఆన్లైన్లో రావాలని, కనీసం పది రోజులు పడుతుందని చెబుతున్నారు. కానీ 15 రోజులు దాటితే కానీ గ్యాస్ బోయ్ తలుపు త ట్టడం లేదు. -
బోగస్ కనెక్షన్లు 68 వేలు
చమురు కంపెనీల సర్వేలో బయటపడిన నిజాలు ఒకే పేరు, ఒకే అడ్రస్‌తో ఎన్నో కనెక్షన్లు ఆధార్ సాయంతో గుర్తిస్తున్న అధికారులు వేర్వేరు కంపెనీల్లో అకౌంట్ ఉన్న వారికి సరఫరా నిలిపివేత ‘దీపం’ కనెక్షన్లరునా రద్దే.. విజయవాడ : బోగస్ గ్యాస్ కనెక్షన్ల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఒకే పేరు, ఒకే అడ్రస్‌తో ఉన్న రెండు, మూడు గ్యాస్ కనెక్షన్లను ఏజెన్సీల నిర్వాహకులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేస్తున్నారు. ఇలాంటి కనెక్షన్లను రద్దుచేసేందుకు ప్రతిపాదనలు తయూరుచేస్తున్నారు. ఆధార్ నంబర్ల సహాయంతో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. జిల్లాలో బినామీ పేర్లతో, రకరకాల అడ్రస్‌లు సృష్టించి వివిధ కంపెనీల గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారుల వివరాలు తెలుసుకునేందుకు చమురు కంపెనీలు ఓ సర్వే నిర్వహించాయి. నెలరోజుల పాటు జరిగిన ఈ సర్వేలో హైదరాబాద్ తరువాత జిల్లావ్యాప్తంగా విజయవాడలో 68వేల దొంగ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన బోగస్ గ్యాస్ కనెక్షన్లు రద్దు చేయటానికి నిర్ణయించారు. సర్వే ప్రక్రియ ఇదీ.. జిల్లాలో 77 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. బీపీసీ, హెచ్పీసీ, ఇండేన్ గ్యాస్ కంపెనీలకు సంబంధించి జిల్లాలో 10,94,104 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 8,59,071 మంది తమ ఆధార్ నంబర్లు గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధానం చేసుకున్నారు. ఇంకా 2,35,033 మంది ఈ ప్రక్రియ పూర్తిచేయలేదు. వీరిలో దాదాపు 1,67,033 మందికి ఇంకా ఆధార్‌కార్డు రాలేదు. మిగిలిన 68 వేలమంది వినియోగదారులకు దొంగ కనెక్షన్లు ఉన్నట్లు చమురు కంపెనీలు గుర్తించాయి. మూడు రకాలుగా దొంగ కనెక్షన్లు గ్యాస్ ఏజెన్సీలు జరిపిన సర్వేలో మూడు రకాలైన దొంగ కనెక్షన్లు గుర్తించారు. ఒకే అడ్రస్, ఒకే పేరుతో వేల సంఖ్యలో కనెక్షన్లు ఉన్నాయి. వేరే పేరు, వేరే అడ్రస్‌తో కూడా చాలామంది కనెక్షన్లు తీసుకున్నారు. దీపం గ్యాస్ కనెక్షన్లు పొందిన వేలాది మంది వాటిని అన్యాక్రాంతం చేసి ఇతరులకు విక్రయించారు. దీపం పథకం ద్వారా పొందిన కనెక్షన్‌ను కొందరు ఇతరులకు అమ్ముకుని, తిరిగి వేరొక కంపెనీలో తమ సొంత పేర్లతో కొత్త కనెక్షన్ తీసుకున్నారు. ఇలా.. గ్యాస్ కనెక్షన్ పొందిన వారిని సర్వేలో గుర్తించారు. చమురు కంపెనీలను ఆన్లైన్లో అనుసంధానం చేసుకుని ఒకే పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లను పట్టుకున్నారు. మూడు కంపెనీలలో ఒకే పేరు ఉన్న వారికి గ్యాస్ సరఫరా నిలిపివేశారు. మిగిలిన రెండు కంపెనీల్లో కనెక్షన్లు రద్దుచేసుకుని అక్కడి డిపాజిట్లను వెనక్కి తీసుకెళ్లిన వారికి మూడో కంపెనీకి చెందిన గ్యాస్‌ను రెగ్యులర్ చేస్తామని చమురు కంపెనీల అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
‘గ్యాస్’ బుకింగ్ ఇకపై ఆన్లైన్లో..
ఒంగోలు టూటౌన్ : గ్యాస్ వినియోగదారులకు బుకింగ్ కష్టాలు తప్పాయి. గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లకుండానే ఇంటి నుంచే సెల్‌ఫోన్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే వ్యవస్థను గ్యాస్ కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. గ్యాస్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్ సిస్టం(ఐవీఆర్ఎస్) పద్ధతిని ప్రవేశపెట్టాయి. ఆన్లైన్ బుకింగ్‌కు గాను గ్యాస్ కంపెనీలకు ప్రత్యేక నంబర్లు కేటాయించారు. ఇచ్చిన నంబర్లకు నేరుగా వినియోగదారుడు ఫోన్ చేస్తే సిలిండర్ బుక్ చేసుకునే విధానం గురించి తెలియజేస్తారు. వినియోగదారుడు ఏ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఉన్నాడో.. ఆ ఏజెన్సీ ఫోన్ నంబర్‌ను సెల్ఫోన్లో ఎంటర్ చేయాలి. అనంతరం గ్యాస్ బుక్ నంబర్‌ను నమోదు చేయాలి. ...అలా ఆన్లైన్లో ఒక వాయిస్ అడిగిన సమాచారాన్ని ఫోన్లో ఎంటర్ చేస్తే మీ గ్యాస్ బుకింగ్ అయిపోయినట్లే. గ్యాస్ బుక్ చేసినట్లు సెల్‌కు మెసెజ్ కూడా పంపిస్తారు. ఈ విధానం ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు డీఎస్ఓ కే రంగాకుమారి తెలిపారు. జిల్లాలో ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీలకు సంబంధించిన 57 ఏజెన్సీలు ఉన్నాయి. సింగిల్ సిలిండర్లు 3, 3,403, డబుల్ సిలిండర్లు 2,47,092, దీపం కనెక్షన్లు 1,45,516, వాణిజ్య సిలిండర్లు 9,426 ఉన్నాయి. వీరందరూ ఇక నుంచి ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకోవాల్సిందేనని డీఎస్ఓ స్పష్టం చేశారు. -
రీ కిల్లింగ్
నగరంలో వరుసగా రీఫిల్లింగ్ ప్రమాదాలు మేల్కోని పోలీసులు తాజా ఘటనలో ఒకరి మృతి ఎనిమిది మందికి గాయాలు కాచిగూడ, న్యూస్‌లైన్: నగరంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలు పోలీసులకు కొత్తేమీ కాదు. గతంలో సైదాబాద్‌లో గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పెద్ద ప్రమాదమే జరిగింది. ఆ సమయంలో హడావుడి చేసిన అధికారులు చివరకు అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాల గురించే మరిచిపోయారు. శనివారం రాత్రి కాచిగూడలోని సంజయ్‌గాంధీ నగర్లో తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడంతో అధికారులందరు మేల్కొనక తప్పలేదు. తాజా ఘటన వివరాలివీ.. ధూల్‌పేట్‌కు చెందిన బిరుజు, లోథిలు రెండేళ్ల నుంచి కాచిగూడలోని సంజయ్‌గాంధీ నగర్లో దీపక్‌సింగ్‌కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకుని అందులో అక్రమ గ్యాస్ రీపిల్లింగ్ కేంద్రాన్ని గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆయా గ్యాస్ ఏజెన్సీల ద్వారా అక్కడి సిబ్బంది సహాయసహకారాలతో వినియోగదారులకు సరఫరా చేయాల్సిన వంటగ్యాస్ సిలిండర్లు అక్రమమార్గం ద్వారా ఇక్కడి గోడౌన్‌కు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి వీరు చిన్న సిలిండర్లతో పాటు ప్యాసింజర్ ఆటోలకు గ్యాస్‌ను నింపుతుంటారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ గౌడాన్‌లో ఆరుగురు వర్కర్లు పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో గోడౌన్లో సుమారు 50కి పైగా సిలిండర్లు ఉన్నాయి. పెద్ద సిలిండర్‌లోంచి చిన్న సిలిండర్‌లోకి గ్యాస్‌ను నింపుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పెద్ద పేలుడు సంభవించింది. దీంతో పాటే పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా ఆకాశాన్ని ఎగబాకాయి. గోడౌన్‌కు ఆనుకుని ఉన్న సుమారు 60 ఇళ్లలోని జనాలు తీవ్ర భయాందోళనలకు గురై ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ సమయంలోనే గోదాంలో లేచిన మంటల ధాటికి ఒక్కో సిలిండర్ పేలుతుండటంతో ప్రాణాలు దక్కించుకునే క్రమంలో బస్తీవాసులు ఒక్కసారిగా రహదారి పైకి పరుగు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. అయితే ఘటనా స్థలంలో మాత్రం ఎనిమిది మంది యువకులు రక్తం మడుగులో కుప్పకూలి పోయారు. కొందరు స్థానికులు ధైర్యంచేసి వారిని 108లో చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అయితే ఘటనాస్థలిలో నరేందర్ అనే యువకుడు చనిపోగా.. ఎనిమిది మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అదుపులోకి మంటలు ఈ సమాచారం మేరకు గౌలిగూడ, మలక్‌పేట ఫైర్స్టేషన్లకు చెందిన నాలుగు ఫైరింజన్లు ప్రమాదస్థలికి చేరుకుని గోదాంలో చెలరేగిన మంటలు బస్తీలోకి వ్యాపించకుండా సకాలంలో ఆర్పేశాయి. ఘటనా స్థలానికి నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, ఏసీపీ రంజన్త్రన్, ఇన్స్పెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింహారావు తదితరులు వచ్చారు. జనాలు ఘటనా స్థలానికి తరలి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికితోడు రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ పెద్దలు వరుసగా రావడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తాయి. రాత్రి 8 గంటల నుంచి 12 గంటలకు వరకు చాదర్‌ఘాట్ నుంచి అంబర్‌పేట వైపు వెళ్లే వాహనాలను కాచిగూడ, ఫీవర్ ఆసుపత్రి, నల్లకుంట వైపు మళ్లించారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పాపం పోలీసు మామూళ్లదే ఈ ప్రాంతంలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతుందని స్థానిక పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సైతం సమాచారం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వీరిద్దరూ కూడా వారి నుంచి నెలనెలా మామూళ్లు తీసుకుంటూ ఉండడం వల్లే అక్రమార్కులను చూసీచూడనట్లు వదిలే శారని స్థానికులు అంటున్నారు. ఈ ఘోరం జరగడానికి పోలీసులే పరోక్షంగా కారణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల మత్తులో జోగకుండా... అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాన్ని మూసివేసి కేసులు నమోదు చేసి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు. ఫిర్యాదు చేసినా గతంలో పోలీసులు పట్టించుకోలేదని పలువురు ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకుంటాం హోం మంత్రి నాయిని సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఘటన విషయం తెలియగానే ఆయన ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీతో కలిసి సంఘటనా స్థలానికి రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. సంఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించారని ఆయన తెలిపారు. మంత్రి పద్మారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, నగర మేయర్ మాజిద్ హుస్సేన్, కార్పొరేటర్ కన్నె ఉమారాణి, బీజేపీ నేతలు రమేష్ యాదవ్, ఎంబీటీ కార్పొరేటర్ అమ్జదుల్లాఖాన్, టీడీపీ నాయకులు మాజీ మంత్రి కృష్ణయాదవ్ తదితరులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. -
మన గ్యాస్..మన ఇష్టం
సాక్షి, ఏలూరు:గ్యాస్ సిలిండర్ సకాలంలో డెలివరీ కావడం లేదా.. అధిక ధర వసూలు చేస్తున్నారా.. తూకం తక్కువ ఉంటోందా.. మీ ఇంటికి గ్యాస్ ఏజెన్సీ దూరంగా ఉందా.. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ గ్యాస్ కనెక్షన్‌ను సంబంధిత ఏజెన్సీ/కంపెనీ నుంచి మరో ఏజెన్సీ/కంపెనీకి మార్చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ పేరిట వినియోగదారులందరికీ ఈ అవకాశం లభించింది. గ్యాస్ పోర్టబిలిటీ విధానం రాష్ట్రంలోని 19 జిల్లాలకు బుధవారం నుంచి అందుబాటులోకి రాగా, ఆ జాబితాలో మన జిల్లా కూడా ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో వినియోగదారులు తమకు నచ్చిన ఏజెన్సీ నుంచి, తాము కోరుకున్న ఎల్పీజీ కంపెనీ నుంచి గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. దీనివల్ల గ్యాస్ కంపెనీల గుత్తాధిపత్యానికి,ప్రజల సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఆగడాలకు అడ్డుకట్ట జిల్లాలో 48 గ్యాస్ ఏజన్సీల పరిధిలో దాదాపు 9.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నారుు. వీటిలో సుమారు 80వేల గృహ వినియోగ కనెక్షన్లు బ్లాక్ మార్కెటీర్ల చేతుల్లో ఉన్నాయి. బ్లాక్ మార్కెట్లో రూ.1,200 నుంచి రూ.1,500 చెల్లిస్తే తప్ప సిలిండర్ దొరకడం లేదు. డీలర్లే దీనిని పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వినియోగదారులను డీలర్లు అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఒక్కో ఏజెన్సీకి పరిమితికి మించి కనెక్షన్లు ఉండటం వల్ల వారు ఎవరికీ జవాబుదారీగా ఉండరు. గ్యాస్ సిలిండర్లలోని కొంత గ్యాస్‌ను బయటకు తీసి అమ్మేసుకుంటున్న ఘటనలు ఉన్నారుు. దీనిని అరికట్టేందుకు చమురు సంస్థలు కొత్త విధానాలను తీసుకువస్తున్నాయి. దానిలో భాగంగా అక్రమ గ్యాస్ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కూడా కల్పించాయి. తాజాగా కల్పించిన సౌకర్యంతో గ్యాస్ కంపెనీల మధ్య, డీలర్ల మధ్య పోటీ పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశాలున్నాయి. మరోవైపు బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మార్చుకోండిలా... గ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ చాలా సులభం. వినియోగదారులు ఇంటర్నెట్లో గ్యాస్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి క్లస్టర్లో లభించే ప్రతి కంపెనీ డిస్ట్రిబ్యూటర్లను చూడొచ్చు. గతంలో కల్పించిన స్టార్ రేటింగ్ ద్వారా డీలర్ల పనితీరును తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా కంపెనీ, డిస్ట్రిబ్యూటర్ను ఎంపిక చేసుకోవచ్చు. పాత డిస్ట్రిబ్యూటర్‌కు ఎక్విప్మెంట్ను తిరిగి ఇచ్చేసి, కొత్త డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి కొత్త సిలిండర్, రెగ్యులేటర్ తీసుకోవాలి. కంపెనీ మార్చుకోకుండా ఒకే కంపెనీలో వేరే డిస్ట్రిబ్యూటర్‌కు మారితే సిలిండర్, రెగ్యులేటర్ స్వాధీనం చేయూల్సిన అవసరంలేదు. వ్యతిరేకతను తట్టుకునేందుకేనా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయనే సాకుతో ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఇస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ సంఖ్యను తొమ్మిదికి పెంచింది. తొమ్మిది సిలిండర్ల వరకూ ప్రభుత్వం దాదాపు రూ.843 సబ్సిడీ ఇస్తోంది. దానికి ఆధార్ లింకుపెట్టి సరిగ్గా ఇవ్వడం లేదు. మరోవైపు సబ్సిడీ లేని సిలిండర్ ధరలను ఏడాదిగా పెంచుతూనే ఉన్నారు. గతేడాది జనవరిలో రూ.46.50 పైసలు పెంచారు. దీనివల్ల జిల్లా గ్యాస్ వినియోగదారులపై రూ.4 కోట్ల భారం పడింది. ఏడాది చివర్లో రాయితీ సిలిండర్‌పై మరో రూ.3 పెంచారు. ఈ ఏడాది ప్రారంభంలో సబ్సిడీ సిలిండర్‌పై రూ.25 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తొమ్మిది సిలిండర్లు దాటి (పదో సిలిండర్ నుంచి) రాయితీ లేని సిలిండరుపై రూ.217 పెంచడంతో ధర రూ.1,326 అయ్యింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.385 పెంచడంతో అదికాస్తా రూ.2,266కి చేరింది. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ ధరలు పెంచి జిల్లా వినియోగదారులపై రూ.11,20,50,00 భారాన్ని మోపారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఓట్లు రాబట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తులు వేస్తోంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ కోరారని సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను 12కు పెంచుతామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. తాజాగా గ్యాస్ కనెక్షన్ పోర్టబులిటీ నిర్ణయం తీసుకున్నారు. -
గ్యాస్ట్రబుల్
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకంతో వంట గ్యాస్ వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. సబ్సిడీ జమ కాక పూర్తి ధర చెల్లించి గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేసి కళ్లు తేలేస్తున్నారు. పొద్దున లేస్తూనే పనులన్నీ పక్కన పెట్టి గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. కొంత మందికి ఒక సిలిండర్‌కు సబ్సిడీ జమ అయితే మూడు సిలిండర్లకు పడలేదు. మరి కొంత మందికి గ్యాస్ ఏజెన్సీలో, బ్యాంక్‌లో ఆధార్ నంబర్‌తో సీడింగ్ అయి ఆరు సిలిండర్లు తీసుకున్నా రూపాయి సబ్సిడీ కూడా జమ కాలేదు. సీడింగ్‌కు నోచుకోని లక్ష మంది వినియోగదారులు జిల్లాలో 60 ఏజెన్సీల పరిధిలో 5,88,205 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో ఇప్పటిదాకా 5,24,545 మంది వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల్లో సీడింగ్ అయ్యాయి. 4.80 లక్షల మందికి బ్యాంక్‌లో అనుసంధానం పూర్తి చేశారు. ఏజెన్సీల్లో 63,660, బ్యాంకుల్లో 1.08 లక్షల మందికి సంబంధించి ఆధార్ సీడింగ్ కాలేదు. చాలా మంది వినియోగదారులు ఐదారు సార్లు ఏజెన్సీలు, బ్యాంక్‌ల చుట్టూ తిరిగి బ్యాంక్, ఆధార్, గ్యాస్ జిరాక్స్ పుస్తకాలు అందజేసినా సీడింగ్ చేయలేదు. ఇదిలా ఉండగా వినియోగదారులు అనుసంధానం చేసేందుకు బ్యాంకుల్లో, ఏజెన్సీలో జిరాక్స్ పత్రాలు అందజేసినా పక్కన పడేస్తున్నారు. వినియోగదారులు సంబంధిత పత్రాలు ఇచ్చినట్లు అటు ఏజెన్సీలు గానీ, బ్యాంకులు గానీ ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. దీంతో అనేక సార్లు అందజేసినా సీడింగ్ చేయలేదని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. రూ.52 కోట్ల మేర వినియోగదారుల జేబులకు చిల్లు జిల్లాలో నెలకు 2.5 లక్షల సిలిండర్లు రీఫిల్ అవుతున్నాయి. జూన్ నుంచి ఇప్పటికి 17.5 లక్షల మందికి సిలిండర్లు డెలివరీ ఇచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 లక్షల మంది వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా వారికి సబ్సిడీ అందలేదు. ఈ ప్రకారం 7.50 లక్షల మందికి రూ.48 కోట్లు, ఆధార్ కార్డులు లేక సీడింగ్ చేయించుకోలేకపోయిన 60 వేల మందికి రూ.4 కోట్లు మొత్తం రూ.52 కోట్ల మేర నగదు బదిలీ కింద సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లోకి జమ కాలేదు. ఇంత పెద్ద సమస్యను జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. -
కదిలిన బ్యాంకర్లు
=పెండింగ్ ఆధార్ నంబర్ల అనుసంధాన ప్రక్రియ ప్రారంభం =గ్యాస్ ఏజెన్సీల్లో జాబితాల సేకరణ =దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : బ్యాంకర్లు ఎట్టకేలకు కదిలారు. ఎంతోకాలంగా బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాకుండా కుప్పలుతెప్పలుగా పెండింగ్‌లో ఉన్న ఆధార్ నంబర్ల అనుసంధాన ప్రక్రియ యుద్ధప్రాతిపదికన చేపట్టారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద, బ్యాంకుల్లో రెండుచోట్లా కలిపి ఆధార్ నంబర్ ఇవ్వని 2 లక్షల 50 వేల గ్యాస్ వినియోగదారులు సబ్సిడీ గ్యాస్ కోల్పోతున్నారని శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందించి వెంటనే చర్యలు ప్రారంభించారు. పక్కన పెట్టేశారు... గ్యాస్ ఏజెన్సీల వద్ద, బ్యాంకుల వద్ద కూడా ఆధార్ అనుసంధానం చేయించుకోవాల్సి ఉండగా, వినియోగదారులు కొంతమంది తెలియక ఒకచోట మాత్రమే నంబర్లు ఇచ్చి సరిపెట్టుకున్నారు. రెండు చోట్లా నమోదు చేయించుకోవాల్సిన బాధ్యత వినియోగదారులదేనని బ్యాంకులు, గ్యాస్ ఏజెన్సీలు కూడా అనుసంధాన ప్రక్రియను పెండింగ్‌లో పెట్టేశాయి. ఈ నేపథ్యంలో ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులకు జనవరి నుంచి సబ్సిడీ నిలిపివేసేందుకు చమురు కంపెనీలు నిర్ణయించడంపై వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సబ్సిడీ లేకుండా పూర్తి ధర రూ.1,323 చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాల్సి రావడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఆధార్ అనుసంధానంపై లీడ్‌బ్యాంకు ఉత్తర్వులు... ఈ క్రమంలో శుక్రవారం జిల్లాలోని అన్ని బ్యాంకుల కంట్రోలర్లకు లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంకు (ఇండియన్ బ్యాంకు) నుంచి పెండింగ్‌లో ఉన్న ఆధార్ అనుసంధానం తక్షణమే పూర్తిచేయాలని ఉత్తర్వులు అందాయి. దాంతో పౌరసరఫరాల అధికారులు, బ్యాంకర్లు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి పెండింగ్ జాబితాలు సేకరించారు. ఒక్కో గ్యాస్ ఏజెన్సీలో వేలాదిగా పెండింగ్‌లో ఉన్న ఆధార్ నంబర్లను బ్యాంకు అధికారులు తమ ఖాతాలకు అనుసంధానం చేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రెండున్నర లక్షల ఆధార్ లింక్‌ను పూర్తిచేసేలా బ్యాంకర్లు, అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ కోసం వివరాలిచ్చిన వెంటనే ఆన్లైన్లో లింక్... ఇప్పటివరకు ఆధార్ నంబర్ వస్తేనే బ్యాంకు ఖాతాలలో, గ్యాస్ ఏజెన్సీలలో అనుసంధానం చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆధార్ నమోదు కేంద్రాల్లో వివరాలు అందజేసిన రోజునే వినియోగదారునికి ఆన్లైన్ నంబర్ ఆధారంగా వెంటనే బ్యాంకు ఖాతాలకు, గ్యాస్ ఏజెన్సీలకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఓ బ్యాంకు అధికారి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఇప్పటికీ ఆధార్ దిగనివారు వెంటనే ఈ కింది ఆధార్ సెంటర్లలో నమోదు చేసుకోవాలని ఆ అధికారి పేర్కొన్నారు. జిల్లాలో నాలుగు ఆధార్ కేంద్రాలు... జిల్లాలో నాలుగు ఆధార్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. విజయవాడ నగరంలో లబ్బీపేట, పాత బస్టాండ్ వద్ద కార్వే సంస్థ ఆధ్వర్యంలో ఆధార్ కేంద్రాల్లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో, గుడివాడలో ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. -
సిలిం‘డర్’
కొత్త సంవత్సరం శుభాలను మోసుకురావడం అటుంచితే.. మొదటి రోజే చుక్కలు చూపనుంది. పండగ వాతావరణం కాస్తా ఆవిరి కానుంది. సాధారణంగా ఏడాదంతా జనవరి 1వ తేదీ కోసం ఎదురుచూడటం సహజం. అలాంటిది ఆ తేదీ తలచుకొని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తెల్లారితే.. సిలిండర్లు గుదిబండగా మారనున్నాయి. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తరుణంలో చోటు చేసుకున్న పరిణామం ఎన్నో కుటుంబాల్లో పొయ్యి వెలగనివ్వదంటే అతిశయోక్తి కాదు. ఆదోని, న్యూస్‌లైన్: గ్యాస్ సిలిండర్లు భయపెడుతున్నాయి. పేలుతాయని కాదు.. ధర వింటేనే ప్రజలు హడలిపోతున్నారు. రేపటి నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమల్లోకి రానుంది. ఇక నుంచి సిలిండర్ కావాలంటే మొత్తం ధర రూ.1110 చెల్లించాల్సిందే. వీటికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకున్న వారికే ఈ లబ్ధి చేకూరనుంది. అయితే జిల్లాలో ఇప్పటికీ ఈ ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం వరకు బిల్లు చేసిన సిలిండర్లను మంగళవారం పంపిణీ చేసేందుకు గ్యాస్ ఏజెన్సీ ముమ్మర ఏర్పాట్లు చేపట్టాయి. ఇందుకోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేశాయి. బుధవారం నుంచి సబ్సిడీ లేని సిలిండర్లను మాత్రమే అందివ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని మొదటి విడతగా రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా రెండో విడతలో మరో ఐదు జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించింది. ఇందులో కర్నూలు జిల్లా ఒకటి. మొదటి విడత పథకం అమలైన జిల్లాల్లో సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లో జమ కాలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు దూరమవుతోంది. జిల్లాలో దాదాపు 5 లక్షలకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ఇందులో 2.30 లక్షల సింగిల్ సిలిండర్లు, 1.29 లక్షల డబుల్ సిలిండర్లు, 1.43 లక్షల దీపం కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం 48 ఏజెన్సీల ద్వారా ప్రతి రోజూ దాదాపు 16వేల సిలిండర్లను వినియోగదారులకు పంపిణీ చేస్తున్నారు. సబ్సిడీతో కూడిన సిలిండర్ల సరఫరా సమయంలో వినియోగదారులు రూ.406 నుండి రూ.411 చెల్లించేవారు. అలాంటిది ఇకపై ఒక్కో సిలిండర్‌కు రూ.1110 చెల్లించాల్సి ఉండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. సిలిండర్లను మొత్తం ధర చెల్లించి ఎలా కొనుగోలు చేయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. సబ్సిడీని బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆధార్ నమోదు కొలిక్కిరాని పరిస్థితుల్లో ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. అదేవిధంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మందికి ఆధార్ కార్డులు అందలేదు. పలుచోట్ల ఆధార్ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఇలాంటి వారు జిల్లాలో 40 శాతం పైనే ఉన్నారు. వీరంతా సబ్సిడీని కోల్పోవాల్సి రానుండటంతో.. తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. వంద శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని వారు కోరుతున్నారు. -
గ్యాస్ బండకు సెల్‌ఫోన్‌కు లింకుంది!
కదిరి, న్యూస్‌లైన్: గ్యాస్ బండ కావాలంటే ఇకపై కచ్చితంగా మీకు సెల్‌ఫోన్ ఉండాల్సిందే. ఎందుకంటే మీ సెల్ ఫోన్ ద్వారా బుక్ చేస్తేనే మీకు గ్యాస్ బండ కావాలన్న విషయం ఆన్లైన్లో నమోదవుతుంది. మీ మిత్రులు, ఇరుగు పొరుగు వారు, బంధువుల సెల్‌ఫోన్ ద్వారా బుక్ చేద్దామన్నా ఆన్లైన్ అంగీకరించదు. గ్యాస్ ఏజెన్సీల్లో ‘ఇంటర్ వాయిస్ రికార్డింగ్ సర్వీస్(ఐవీఆర్ఎస్) విధానం అమలులోకి వచ్చింది. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో గ్యాస్ వినియోగదారులు సతమతమవుతుంటే మళ్లీ ఇంకొకటొచ్చి పడింది. చమురు సంస్థలు తీసుకున్న ఈ కొత్త విధానంతో నిరక్షరాస్యులు, ఆన్‌లైన్‌పై అవగాహన లేనివారు, సొంతంగా సెల్‌ఫోన్ లేనివారికి ఇబ్బందులు తప్పేట్లు లేవు. జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిలో 1.30 లక్షలు దీపం కనెక్షన్లున్నాయి. భారత్, హెచ్‌పీ గ్యాస్ గ్యాస్ ఏజెన్సీలు ఇప్పటికే ఆన్లైన్ విధానం ద్వారా గ్యాస్ నమోదు చేసుకుంటున్నారు. ఈ విధానంపై అవగాహన ఉన్నవారేమో మంచిదంటుంటే అందరికీ ఆన్‌లైన్‌పై అవ గాహన ఉండాలి కదా? అని మెజార్టీ ప్రజలు అంటున్నారు. అందుకే ఇలాంటి వారంతా నేరుగా గ్యాస్ ఏజెన్సీల చెంతకెళ్లి గ్యాస్ బండ కావాలని నమోదు చేయించుకుంటున్నారు. ఇకపై అలా ఉండదు. ప్రతి ఒక్కరూ తమ సెల్‌ఫోన్ ద్వారానే గ్యాస్ బుక్ చేసుకోవాల్సి వుంటుంది. సెల్‌ఫోన్ లేనివారు, ఆన్‌లైన్‌పై అవగాహన లేనివారితో పాటు తరచుగా సెల్ నెంబర్లు మార్చేవారికి కూడా ఐవీఆర్ఎస్ విధానంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఎందుకంటే కొత్త సెల్ నెంబర్ తీసుకున్న విషయం గ్యాస్ ఏజెన్సీ వారికి తెలియజేస్తూ తమ కస్టమర్ వివరాల్లో మార్పు చేయించాలి. ఒక సెల్ నెంబర్‌తో ఒకే కనెక్షన్‌కు మాత్రమే అనుసంధానం చేస్తారు. జనవరి ఒకటో తేదీ నుండి అందరూ ఆన్లైన్ ద్వారానే అదీ మీ సెల్ నెంబర్ ద్వారానే గ్యాస్ బుక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇకపై గ్యాస్ బండకు సెల్‌ఫోన్‌కు లింక్ ఉందన్నమాట. ఐవీఆర్ఎస్ విధానంతో గ్యాస్ అక్రమాలను అరికట్టవచ్చని సివిల్ సప్లయస్ అధికారులంటున్నారు. -
60 శాతం మందే ఆధార్ నమోదు
=60 శాతం మందే ఆధార్ నమోదు =గ్యాస్‌కు ఎత్తివేయాలని డిమాండ్ =పింఛనుదారుల కొంపముంచుతున్న పథకం సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నగదు బదిలీ పథకం ప్రహసనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా లబ్ధిదారులకు అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని అమలులో వచ్చే లోపాలను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి పింఛన్లు పొందే పేదలు, వృద్ధులు, వింతతువులు, వికలాంగులు ఈ పథకంలోని లోపాలకు బలి అవుతున్నారు. దీని గురించి పూర్తిగా వారికి అవగహన లేకపోవడంతో పాట్లు పడక తప్పడం లేదు. పూర్తికాని ఆధార్ నమోదు గత సెప్టెంబర్ 1 నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పథకం అమలు చేసిన తరువాత కూడా మూడు నెలల గడువు ఇచ్చింది. ఇది నవంబర్ నెలాఖారుతో ముగుస్తుంది. డిసెంబర్ 1 నుంచి ప్రతిఒక్కరూ సబ్సిడీ లేని సిలిండర్‌నే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తొలుత సబ్సిడీ లేకుండా గ్యాస్ ఏజెన్సీలో రూ. 1120 చెల్లించి కొనుగోలు చేస్తే వారి బ్యాంకు ఖాతాకు సబ్సిడీ జమ అవుతుంది. అందువల్ల గ్యాస్ వినియోగదారులు ఈ నెలాఖరులోగా తమ ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్లను గ్యాస్ ఏజెన్సీలో నమోదు చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 10,80,704 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 6,67,003 (62 శాతం) మంది మాత్రమే ఆధార్ నంబరు నమోదు చేయించుకోగా, 3,95,721 (35 శాతం) మంది మాత్రమే బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇచ్చారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన గ్యాస్ వినియోగదారులు ఈ నెలాఖరులోగా తమ ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు జమ చేయించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీని కోల్పోవాల్సి వస్తుంది. -
ఆధార్.. కిరి కిరి
ఏ ముహూర్తానా ప్రభుత్వం ‘ఆధార్’ కార్డుల జారీ నిర్ణయం తీసుకుందో కానీ, ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను ఆధార్ నమోదు నానా యాతనలు పెడుతోంది. ఆధార్ కార్డుల ప్రాముఖ్యం.. కార్డులు దేనికి అవసరం, దేనికి అక్కర్లేదు అన్న విషయాల్లో అధికారులకే స్పష్టత కొరవడడంతో సామాన్యులకు చుక్కలు కనపడుతున్నాయి. పండగ ముందర రేషన్‌డీలర్లు సరుకులు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతున్నారు. ఆధార్ కార్డు తెస్తేనే సరుకులంటూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా వ్యాప్తంగా ఆధార్ ఇంకా పూర్తిస్థాయిలో నమోదు కాలేదు. ప్రభుత్వ సబ్సిడీ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ నంబరు తప్పని సరి అన్న ప్రచారం జరగడం, దీనికి తగినట్టే వంట గ్యాస్ ఏజెన్సీలు బ్యాంకు లింకేజిని కోరుతుండడం, పెన్షన్లు, ఉపకార వేతనాలు పొందే వారికీ ఆధార్ కావాల్సిందేననడంతో జిల్లాప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ వ్యవహారంలో ప్రజ ల్లో ఆధార్ నమోదు, ఉపయోగాలపై అవగాహన కల్పించి, అపోహలు పోగొట్టే ప్రయత్నం ఏదీ ఇప్పటి దాకా జరగలేదు. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్న కొందరు మరింతగా సామాన్యులను బెదరగొడుతున్నారు. ఆధార్ కార్డులివ్వాలంటూ కొర్రీలు.. జిల్లా జనాభా 34.82లక్షలు. ఇందులో ఇప్పటి వరకు 27.90 లక్షల మంది ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో ఎంతమందికి కార్డులు అందాయన్న విషయంలో అధికారులకే స్పష్టత లేదు. మిగతా 6.92 లక్షల మంది ఇంకా ఆధార్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. రేషన్ కార్డులున్న ప్రతివారు ఆధార్ కార్డును కూడా రేషన్ డీలర్లకు సమర్పించాలన్నది ఓ నిర్ణయం. కానీ, ఆధార్ లేకుంటే రేషన్ సరుకులు ఇవ్వకూడదని ఎక్కడా, ఏ అధికారీ నిర్ణయించలేదు. వాస్తవానికి జనవరి నెల దాకా ఏ పథకానికి ఆధార్‌ను లింక్ చేయమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సుప్రీంకోర్టుకు కేంద్రం కూడా ఆధార్ నమోదు కేవలం ఐచ్ఛికమే తప్ప తప్పనిసరి కాదని వివరించింది. పభుత్వం ఇంత స్పష్టంగా ఉన్నా, ఆధార్ కార్డులంటూ కొర్రీలు పెడుతూ నానా తిప్పలు పెడుతున్నారు. జిల్లాలో చాలాచోట్ల డీలర్లు ఆధార్‌ను అడ్డంపెట్టుకుని వినియోగదారులకు సరుకులు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు, మిగిలిన సరుకులను నల్లబజారులో అమ్ముకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం వచ్చే నెల కార్డు తీసుకురావాలని హెచ్చరిస్తూ, ఏదో దానం చేసినట్లు, దయచూపుతున్నట్లు సరుకులు ఇస్తున్నారు. ఇవిగో... ఉదంతాలు నల్లగొండ పట్టణంలో పలు చోట్ల రేషన్‌డీలర్లు ఆధార్‌కార్డు కావాలని ఇబ్బందులు పెడుతున్నారు. పండగ ముందు డీలర్లు కిరికిరి పెడుతుండడంతో రేషన్‌కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. రేషన్ బియ్యానికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో బియ్యం మిగిలించుకునే పనిలో పడిన డీలర్లు వినియోగదారులను బెదరగొడుతున్నారు. పాతబస్తీ, సూపర్ బజార్, హనుమాన్ నగర్, జామ్ మసీదు, శ్రీకష్ణనగర్, అక్కచెలిమ, వివేకవర్దిని ఫంక్షన్‌హాల్ ప్రాంతాల్లో, మున్సిపల్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రేషన్ దుకాణాల్లో ఆధార్ లేకుండా సరుకులు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. తుర్కపల్లి మండలం మాదాపూర్, గొల్లగూడెం, ఇబ్రహీంపట్నం, పల్లెపహాడ్, వాసాలమర్రి గ్రామాల్లో కొందరు డీలర్లు ఇదే తరహాల్లో సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రేషన్‌బియ్యం ఇవ్వమని పేర్కొంటుండడంతో చాలా మంది వినియోగదారులు బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. పదిహేను రోజుల కిందట వినియోగదారులు కొందరు అకౌంట్ల కోసం బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి కూడా దిగారు. దేవరకొండ పట్టణంలోని పలువురు రేషన్ డీలర్లు బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తప్పక ఉండాలని, లేదంటే రేషన్ బియ్యం ఇవ్వమని ఖరాఖండిగా చెబుతున్నారు. కొండమల్లెపల్లిలో ఇదే అంశం వివాదం కావడంతో అక్కడి గ్రామసభలో ఆధార్‌తో సంబంధం లేకుండా రేషన్ సరుకులు ఇవ్వాలని తీర్మానం కూడా చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఆధార్‌కార్డుల ప్రక్రియ 90 శాతం పూర్తయింది. కార్డులు రావాల్సి ఉంది. కొన్ని మండలాల్లో రేషన్‌డీలర్లకు ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదనే సాకుతో లబ్ధిదారులకు సరుకులు ఇవ్వడం లేదు. పెన్‌పహాడ్ మండలంలో 25 రేషన్ దుకాణాలు ఉండగా మాసారం, అన్నారం, చీదేళ్ల గ్రామాలతోపాటు పలు గ్రామాల్లో ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తమకు ఇవ్వలేదని లబ్ధిదారులకు సక్రమంగా సరుకులు ఇవ్వడం లేదు. దీంతో కొందరు వినియోగదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాంటి వారికి మాత్రమే సరుకులు అందిస్తున్నారు. మిగతా వారికి ఉత్తిచేతులు చూపిస్తున్నారు. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంతో పాటు కందగట్ల, పాతర్లపహాడ్ గ్రామాలలో లబ్ధిదారులకు ఆధార్‌కార్డు లేకపోవడంతో బియ్యం ఇవ్వవమని డీలర్లు చెప్పడంతో రెండు నెలలుగా ఇబ్బంది పడుతున్నారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో ఆధార్ లేకపోతే వచ్చే నెల నుంచి సరుకులు ఇవ్వమని గట్టిగా చెబుతున్నారు. చౌటుప్పల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో కొందరు డీలర్లు అసలు సరుకులే ఇవ్వడం లేదని సమాచారం. కోదాడ నియోజకవర్గంలో ఆధార్‌కార్డుల నమోదు ప్రక్రియ కొన్ని గ్రామాలలో కొనసాగుతోంది. కోదాడ, నడిగూడెం, చిలుకూరు, మునగాల మండలాల్లో రేషన్‌డీలర్లకు ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ అకౌంట్‌ను ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. లేని వారికి ఈ ఒక్కసారి మాత్రమే సరుకులు ఇస్తామని చెప్పి పంపుతున్నారు. -
గ్యాస్ ఏజెన్సీలపై జేసీ దాడులు
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీలపై జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం దాడులు నిర్వహించారు. గురువారం కోవూరు, పడుగుపాడు, నెల్లూరులో దాడులు చేసిన ఆయన పలు గ్యాస్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కోవూరులోని వెంకయ్యస్వామి భారత్ గ్యాస్ ఏజెన్సీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు దాడుల్లో తేలింది. గురువారం సాక్షి దినపత్రికలో ‘ఏజెన్సీల ఇష్టారాజ్యం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జేసీ స్పందించారు. సిలిండర్ రూ.418కు విక్రయించాల్సిన ఏజెన్సీ నిర్వాహకుడు రూ.440కి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు జేసీ తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వెంకయ్యస్వామి భారత్‌గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు రూ.10వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. ఇకపై జిల్లావ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీలపై దాడులు ఉంటాయన్నారు. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు నిబంధలనమేరకు గ్యాస్ పంపిణీ చేయాలన్నారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులకు గురిచేసినా సహించేందిలేదని హెచ్చరించారు. వినియోగదారులపై గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు అమర్యాదగా వ్యవహరించరాదన్నారు. ఎటువంటి ఫిర్యాదులు అందినా విచారణ చేపట్టి ఆయా ఏజెన్సీలను సీజ్‌చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఏఎస్ఓ శంకరన్ పాల్గొన్నారు.