కదిలిన బ్యాంకర్లు | Shaken bankers | Sakshi
Sakshi News home page

కదిలిన బ్యాంకర్లు

Published Sat, Jan 4 2014 12:44 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Shaken bankers

=పెండింగ్ ఆధార్ నంబర్ల అనుసంధాన ప్రక్రియ ప్రారంభం
 =గ్యాస్ ఏజెన్సీల్లో జాబితాల సేకరణ
 =దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు

 
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : బ్యాంకర్లు ఎట్టకేలకు కదిలారు. ఎంతోకాలంగా బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాకుండా కుప్పలుతెప్పలుగా పెండింగ్‌లో ఉన్న ఆధార్ నంబర్ల అనుసంధాన ప్రక్రియ యుద్ధప్రాతిపదికన చేపట్టారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద, బ్యాంకుల్లో రెండుచోట్లా కలిపి ఆధార్ నంబర్ ఇవ్వని 2 లక్షల 50 వేల గ్యాస్ వినియోగదారులు సబ్సిడీ గ్యాస్ కోల్పోతున్నారని శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందించి వెంటనే చర్యలు ప్రారంభించారు.
 
పక్కన పెట్టేశారు...
 
గ్యాస్ ఏజెన్సీల వద్ద, బ్యాంకుల వద్ద కూడా ఆధార్ అనుసంధానం చేయించుకోవాల్సి ఉండగా, వినియోగదారులు కొంతమంది తెలియక ఒకచోట మాత్రమే నంబర్లు ఇచ్చి సరిపెట్టుకున్నారు. రెండు చోట్లా నమోదు చేయించుకోవాల్సిన బాధ్యత వినియోగదారులదేనని బ్యాంకులు, గ్యాస్ ఏజెన్సీలు కూడా అనుసంధాన ప్రక్రియను పెండింగ్‌లో పెట్టేశాయి. ఈ నేపథ్యంలో ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులకు జనవరి నుంచి సబ్సిడీ నిలిపివేసేందుకు చమురు కంపెనీలు నిర్ణయించడంపై వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. సబ్సిడీ లేకుండా పూర్తి ధర రూ.1,323 చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాల్సి రావడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
 
ఆధార్ అనుసంధానంపై లీడ్‌బ్యాంకు ఉత్తర్వులు...
 
ఈ క్రమంలో శుక్రవారం జిల్లాలోని అన్ని బ్యాంకుల కంట్రోలర్‌లకు లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంకు (ఇండియన్ బ్యాంకు) నుంచి పెండింగ్‌లో ఉన్న ఆధార్ అనుసంధానం తక్షణమే పూర్తిచేయాలని ఉత్తర్వులు అందాయి. దాంతో పౌరసరఫరాల అధికారులు, బ్యాంకర్లు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి పెండింగ్ జాబితాలు సేకరించారు. ఒక్కో గ్యాస్ ఏజెన్సీలో వేలాదిగా పెండింగ్‌లో ఉన్న ఆధార్ నంబర్లను బ్యాంకు అధికారులు తమ ఖాతాలకు అనుసంధానం చేసుకునే ప్రక్రియ ప్రారంభించారు. ఒకటి రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రెండున్నర లక్షల ఆధార్ లింక్‌ను పూర్తిచేసేలా బ్యాంకర్లు, అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.
 
ఆధార్ కోసం వివరాలిచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో లింక్...
 
ఇప్పటివరకు ఆధార్ నంబర్ వస్తేనే బ్యాంకు ఖాతాలలో, గ్యాస్ ఏజెన్సీలలో అనుసంధానం చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఆధార్ నమోదు కేంద్రాల్లో వివరాలు అందజేసిన రోజునే వినియోగదారునికి ఆన్‌లైన్ నంబర్ ఆధారంగా వెంటనే బ్యాంకు ఖాతాలకు, గ్యాస్ ఏజెన్సీలకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఓ బ్యాంకు అధికారి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఇప్పటికీ ఆధార్ దిగనివారు వెంటనే ఈ కింది ఆధార్ సెంటర్‌లలో నమోదు చేసుకోవాలని ఆ అధికారి పేర్కొన్నారు.
 
జిల్లాలో నాలుగు ఆధార్ కేంద్రాలు...
 
జిల్లాలో నాలుగు ఆధార్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. విజయవాడ నగరంలో లబ్బీపేట, పాత బస్టాండ్ వద్ద కార్వే సంస్థ ఆధ్వర్యంలో ఆధార్ కేంద్రాల్లో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో, గుడివాడలో ఆధార్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement