సిలిం‘డర్’
కొత్త సంవత్సరం శుభాలను మోసుకురావడం అటుంచితే.. మొదటి రోజే చుక్కలు చూపనుంది. పండగ వాతావరణం కాస్తా ఆవిరి కానుంది. సాధారణంగా ఏడాదంతా జనవరి 1వ తేదీ కోసం ఎదురుచూడటం సహజం. అలాంటిది ఆ తేదీ తలచుకొని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తెల్లారితే.. సిలిండర్లు గుదిబండగా మారనున్నాయి. ఈ ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తరుణంలో చోటు చేసుకున్న పరిణామం ఎన్నో కుటుంబాల్లో పొయ్యి వెలగనివ్వదంటే అతిశయోక్తి కాదు.
ఆదోని, న్యూస్‌లైన్:
గ్యాస్ సిలిండర్లు భయపెడుతున్నాయి. పేలుతాయని కాదు.. ధర వింటేనే ప్రజలు హడలిపోతున్నారు. రేపటి నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం అమల్లోకి రానుంది. ఇక నుంచి సిలిండర్ కావాలంటే మొత్తం ధర రూ.1110 చెల్లించాల్సిందే. వీటికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకున్న వారికే ఈ లబ్ధి చేకూరనుంది. అయితే జిల్లాలో ఇప్పటికీ ఈ ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోమవారం వరకు బిల్లు చేసిన సిలిండర్లను మంగళవారం పంపిణీ చేసేందుకు
గ్యాస్ ఏజెన్సీ ముమ్మర ఏర్పాట్లు చేపట్టాయి. ఇందుకోసం పలు ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేశాయి. బుధవారం నుంచి సబ్సిడీ లేని సిలిండర్లను మాత్రమే అందివ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని మొదటి విడతగా రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా రెండో విడతలో మరో ఐదు జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించింది. ఇందులో కర్నూలు జిల్లా ఒకటి. మొదటి విడత పథకం అమలైన జిల్లాల్లో సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లో జమ కాలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు దూరమవుతోంది. జిల్లాలో దాదాపు 5 లక్షలకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ఇందులో 2.30 లక్షల సింగిల్ సిలిండర్లు, 1.29 లక్షల డబుల్ సిలిండర్లు, 1.43 లక్షల దీపం కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం 48 ఏజెన్సీల ద్వారా ప్రతి రోజూ దాదాపు 16వేల సిలిండర్లను వినియోగదారులకు పంపిణీ చేస్తున్నారు.
సబ్సిడీతో కూడిన సిలిండర్ల సరఫరా సమయంలో వినియోగదారులు రూ.406 నుండి రూ.411 చెల్లించేవారు. అలాంటిది ఇకపై ఒక్కో సిలిండర్‌కు రూ.1110 చెల్లించాల్సి ఉండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. సిలిండర్లను మొత్తం ధర చెల్లించి ఎలా కొనుగోలు చేయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. సబ్సిడీని బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆధార్ నమోదు కొలిక్కిరాని పరిస్థితుల్లో ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. అదేవిధంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మందికి ఆధార్ కార్డులు అందలేదు. పలుచోట్ల ఆధార్ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఇలాంటి వారు జిల్లాలో 40 శాతం పైనే ఉన్నారు. వీరంతా సబ్సిడీని కోల్పోవాల్సి రానుండటంతో.. తమ పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. వంద శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని వారు కోరుతున్నారు.