గ్యాస్‌ సిలిండర్‌ ఎక్స్‌పయిరీ డేట్‌ తెలుసుకోవడం ఎలా? | How To Check Your LPG Cylinder Due Date? Here Is The Solution | Sakshi
Sakshi News home page

Gas Cylinder Expiry Date: గ్యాస్ సిలిండర్‌పై ఉన్న ఆ కోడ్ నంబర్ గురించి తెలుసా?

Published Wed, Nov 29 2023 1:27 PM | Last Updated on Wed, Nov 29 2023 4:20 PM

How To Check Your LPG Cylinder Due Date? Here Is The Solution - Sakshi

ప్రతి ఇంట్లో దాదాపు ఎల్‌పీజీ  గ్యాస్‌ సిలిండర్లు తప్పనిసరిగా ఉంటాయి. ఇంతకు ముందు అయితే వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి వాడేవాళ్లు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో పల్లెటూర్లలో కూడా కట్టెల పొయ్యి వాడకం బాగా తగ్గిపోయింది. దాదాపు అందరి ఇళ్లలో ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్లనే వాడుతున్నారు. అయితే కొందరు సిలిండర్‌ ఎన్ని రోజులు వాడాలి?

దాని ఎక్స్‌పయిరీ డేట్‌ ఏంటన్నది చాలామందికి అవగాహన ఉండదు. అయితే సిలిండర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దానిపై ఉండే ప్రత్యేక రకం కోడ్‌ను తప్పకుండా చెక్‌ చేసుకున్నాకే తీసుకోవాలి. ఇంతకీ ఆ కోడ్‌ ఏంటి? ఎక్స్‌పయిరీ డేట్‌ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 

గ్యాస్‌ సిలిండర్లు పేలిన ఘటనలు చూస్తుంటాం. అందుకే గ్యాస్‌ వాడకంలో కొన్ని జాగ్రత్లు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అందుకే గ్యాస్‌ సిలిండర్‌ తీసుకునేటప్పుడు సీలు తీసి, పరీక్షించి ఇవ్వమని తెచ్చిన వ్యక్తిని అడగండి  లీకేజీ ఉంటే అప్పుడే తెలిసిపోతుంది.  వంటగదిలోకి గాలి, వెలుతురు బాగా రావాలి. సిలెండర్‌ను షెల్ఫ్‌లో పెట్టి తలుపులు మూయడం లాంటివి చేయకండి.

కాస్త చల్లదనం ఉండే చోటే పెట్టండి.  కొంతమంది సిలెండర్‌ను కింద పెట్టి, ఆ పక్కనే స్టౌ పెట్టి వండేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. స్టౌ ఎప్పుడూ సిలెండర్ కంటే ఎత్తులోనే ఉండాలి. గ్యాస్ సిలెండర్‌కు ఎక్స్‌పయిరీ డేట్ ఉంటుందని చాలామందికి తెలియదు. అందులో ఉండే కోడ్‌ నెంబర్లను బట్టి గడువు ముందుగానే తెలుసుకోవచ్చు.

ఈ కోడ్ అంటే ఏమిటి..?
గ్యాస్ సిలిండర్ పైభాగంలో ప్రత్యేక కోడ్ రాసి ఉంటుంది. ఈ కోడ్ అక్షరాలు, సంఖ్యల రూపంలో ఉంటుంది. ఈ కోడ్ సిలిండర్ గడువు తేదీని సూచిస్తుంది. సిలిండర్‌పై రాసిన A, B, C, D..సంవత్సరంలో 12 నెలలను చూపిస్తుంది. ఈ సిలిండర్‌ ఎక్స్‌పయిరీ డేట్‌ గురించి చెబుతుంది.ఏడాదిలో 12 నెలలను నాలుగు భాగాలుగా విభజిస్తారు.

A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి.
B అంటే ఏప్రిల్, మే, జూన్.
C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్.
D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా సిలిండర్‌పై ఉండే ఏబీసీడీలు నెలలను సూచిస్తుంది.

ఉదాహరణకు సిలిండర్‌లోపై  A 23 అని రాసి ఉన్నట్లయితే ఈ సిలిండర్ గడువు 23- జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ముగుస్తుంది అని అర్థం. B 24 అని రాసి ఉంటే మీ సిలిండర్ గడువు ఏప్రిల్, మే, జూన్‌లలో ముగుస్తుందని అర్థం. దీన్ని బట్టి సిలిండర్‌ గడువు తేదీని అంచనా వేయొచ్చు. గడువు తేదీ దాటక సిలిండర్‌ను ఉపయోగించడం చాలా ప్రమాదం. సిలిండర్‌ పేలి  ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందుకే తీసుకునేటప్పుడే చెక్‌ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ డేట్‌ అయిపోయిన గ్యాస్‌ సిలిండర్‌ను తీసుకోరాదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement