
చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పలు మెట్రో నగరాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధర శుక్రవారం పెరిగింది. కమర్షియల్ ఎల్‌పీజీ ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగోసారి. సవరించిన రేటు నేటి నుంచి అమల్లోకి వస్తుంది.
ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 62 పెరిగింది. రిటైల్ ధర రూ.1,740 నుండి రూ.1,802లకు ఎగసింది. అంతకుముందు అక్టోబర్‌లో రూ. 48.50, సెప్టెంబరులో రూ. 39, ఆగస్టులో రూ. 8.50 చొప్పున వాణిజ్య ఎల్‌పీజీ ధరలు పెరిగాయి.
ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాలో కూడా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. తాజా పెంపుతో రిటైల్ ధర ఇప్పుడు ముంబైలో రూ.1,754.50, చెన్నైలో రూ.1,964.50, కోల్‌కతాలో రూ.1,911.50గా ఉంది.
ఎల్‌పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతినెలా సవరిస్తూ ఉంటాయి. అందులో భాగంగా తాజాగా నవంబర్ నెలకు గానూ ధరను పెంచాయి. దీని ప్రభావం కమర్షియల్ సిలిండర్‌లను వినియోగించే హోటళ్లు, ఇతర వాటిపై పడనుంది.