మన గ్యాస్..మన ఇష్టం
Published Fri, Jan 24 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
సాక్షి, ఏలూరు:గ్యాస్ సిలిండర్ సకాలంలో డెలివరీ కావడం లేదా.. అధిక ధర వసూలు చేస్తున్నారా.. తూకం తక్కువ ఉంటోందా.. మీ ఇంటికి గ్యాస్ ఏజెన్సీ దూరంగా ఉందా.. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ గ్యాస్ కనెక్షన్‌ను సంబంధిత ఏజెన్సీ/కంపెనీ నుంచి మరో ఏజెన్సీ/కంపెనీకి మార్చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ పేరిట వినియోగదారులందరికీ ఈ అవకాశం లభించింది. గ్యాస్ పోర్టబిలిటీ విధానం రాష్ట్రంలోని 19 జిల్లాలకు బుధవారం నుంచి అందుబాటులోకి రాగా, ఆ జాబితాలో మన జిల్లా కూడా ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో వినియోగదారులు తమకు నచ్చిన ఏజెన్సీ నుంచి, తాము కోరుకున్న ఎల్‌పీజీ కంపెనీ నుంచి గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. దీనివల్ల గ్యాస్ కంపెనీల గుత్తాధిపత్యానికి,ప్రజల సమస్యలకు పరిష్కారం లభించనుంది.
ఆగడాలకు అడ్డుకట్ట
జిల్లాలో 48 గ్యాస్ ఏజన్సీల పరిధిలో దాదాపు 9.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నారుు. వీటిలో సుమారు 80వేల గృహ వినియోగ కనెక్షన్లు బ్లాక్ మార్కెటీర్ల చేతుల్లో ఉన్నాయి. బ్లాక్ మార్కెట్‌లో రూ.1,200 నుంచి రూ.1,500 చెల్లిస్తే తప్ప సిలిండర్ దొరకడం లేదు. డీలర్లే దీనిని పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వినియోగదారులను డీలర్లు అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఒక్కో ఏజెన్సీకి పరిమితికి మించి కనెక్షన్లు ఉండటం వల్ల వారు ఎవరికీ జవాబుదారీగా ఉండరు. గ్యాస్ సిలిండర్లలోని కొంత గ్యాస్‌ను బయటకు తీసి అమ్మేసుకుంటున్న ఘటనలు ఉన్నారుు. దీనిని అరికట్టేందుకు చమురు సంస్థలు కొత్త విధానాలను తీసుకువస్తున్నాయి. దానిలో భాగంగా అక్రమ గ్యాస్ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కూడా కల్పించాయి. తాజాగా కల్పించిన సౌకర్యంతో గ్యాస్ కంపెనీల మధ్య, డీలర్ల మధ్య పోటీ పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశాలున్నాయి. మరోవైపు బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
మార్చుకోండిలా...
గ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ చాలా సులభం. వినియోగదారులు ఇంటర్‌నెట్‌లో గ్యాస్ కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి క్లస్టర్‌లో లభించే ప్రతి కంపెనీ డిస్ట్రిబ్యూటర్లను చూడొచ్చు. గతంలో కల్పించిన స్టార్ రేటింగ్ ద్వారా డీలర్ల పనితీరును తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా కంపెనీ, డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పాత డిస్ట్రిబ్యూటర్‌కు ఎక్విప్‌మెంట్‌ను తిరిగి ఇచ్చేసి, కొత్త డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి కొత్త సిలిండర్, రెగ్యులేటర్ తీసుకోవాలి. కంపెనీ మార్చుకోకుండా ఒకే కంపెనీలో వేరే డిస్ట్రిబ్యూటర్‌కు మారితే సిలిండర్, రెగ్యులేటర్ స్వాధీనం చేయూల్సిన అవసరంలేదు.
వ్యతిరేకతను తట్టుకునేందుకేనా
అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయనే సాకుతో ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఇస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ సంఖ్యను తొమ్మిదికి పెంచింది. తొమ్మిది సిలిండర్ల వరకూ ప్రభుత్వం దాదాపు రూ.843 సబ్సిడీ ఇస్తోంది. దానికి ఆధార్ లింకుపెట్టి సరిగ్గా ఇవ్వడం లేదు. మరోవైపు సబ్సిడీ లేని సిలిండర్ ధరలను ఏడాదిగా పెంచుతూనే ఉన్నారు. గతేడాది జనవరిలో రూ.46.50 పైసలు పెంచారు. దీనివల్ల జిల్లా గ్యాస్ వినియోగదారులపై రూ.4 కోట్ల భారం పడింది. ఏడాది చివర్లో రాయితీ సిలిండర్‌పై మరో రూ.3 పెంచారు.
ఈ ఏడాది ప్రారంభంలో సబ్సిడీ సిలిండర్‌పై రూ.25 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తొమ్మిది సిలిండర్లు దాటి (పదో సిలిండర్ నుంచి) రాయితీ లేని సిలిండరుపై రూ.217 పెంచడంతో ధర రూ.1,326 అయ్యింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.385 పెంచడంతో అదికాస్తా రూ.2,266కి చేరింది. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ ధరలు పెంచి జిల్లా వినియోగదారులపై రూ.11,20,50,00 భారాన్ని మోపారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఓట్లు రాబట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తులు వేస్తోంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ కోరారని సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను 12కు పెంచుతామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. తాజాగా గ్యాస్ కనెక్షన్ పోర్టబులిటీ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Advertisement