portability
-
ప్రస్తుత హెల్త్ పాలసీ నచ్చడం లేదా? మరో పాలసీకి మారిపోండిలా..
హైదరాబాద్‌కు చెందిన క్రాంతి కుమార్ గతేడాది అత్యవసరంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. సింగిల్ ఏసీ రూమ్‌ను ఆయన ఆసుపత్రిలో తీసుకున్నారు. మూడు రోజులకు కలిపి రూ.88,000 బిల్లు వచ్చింది. అతడికి రూ.4 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండడంతో నిశ్చింతగా ఉన్నాడు. కానీ, బీమా సంస్థ నుంచి పూర్తి పరిహారం అందలేదు. క్రాంతి తన వంతుగా రూ.33,000ను చెల్లించాల్సి వచ్చింది. అదేమని ప్రశ్నించగా.. బీమా కవరేజీలో రూమ్ రెంట్ పరిమితి 1 శాతంగా ఉంది. కానీ, అతడు ఎంపిక చేసుకున్న రూమ్ రోజువారీ అద్దె 1 శాతం కంటే మించి ఉంది. ఈ షరతు చూసిన తర్వాత అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. ఇది క్రాంతి కుమార్ ఒక్కడికే ఎదురైన పరిస్థితి అనుకోవద్దు. దశాబ్దం క్రితం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుని, కొనసాగుతున్న వారంతా ఎదుర్కొంటున్నారు. క్లెయిమ్ పరిష్కారాల్లో జాప్యం, ఏదో రకమైన కొర్రీ పెట్టి తక్కువ పరిహారాన్ని చెల్లించడం, అధిక ప్రీమియం వసూలు లేదా నాసిరకమైన సేవలతో సరిపెట్టడం.. ఇలా ఎన్నో కారణాలతో పాలసీదారులు ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంటోంది. దీంతో చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ ఫలితంగా ఎన్నో సర్జరీలకు హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఏర్పడడం లేదు. అదే రోజు డిశ్చార్జ్ అయి వెళ్లొచ్చు. ఒకవైపు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ.. మరోవైపు జీవనశైలి వ్యాధులతో ఔట్ పేషెంట్ సేవల అవసరం పెరుగుతోంది. మారుతున్న ఈ అవసరాలు అన్నీ మన ఆరోగ్య బీమా కవరేజీలో భాగంగా ఉన్నప్పుడు అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. అందుకే సమగ్రమైన హెల్త్ కవరేజీతో ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఇప్పటికే తీసుకున్న పాలసీ సమగ్ర కవరేజీకి భరోసా ఇవ్వనట్టయితే.. చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంటే, బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోతే, ప్రీమియం భారంగా మారితే అప్పుడు మన ముందు రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి బీమా సంస్థను మార్చడం. లేదంటే ప్రస్తుత సంస్థలోనే మెరుగైన ప్లాన్‌కు మారిపోవడం (మైగ్రేషన్). వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సేవల పట్ల సంతృప్తిగానే ఉండి, పాలసీలోని కవరేజీ ఫీచర్లు, ప్రీమియం విషయంలో సంతృప్తిగా లేకపోతే అప్పుడు మీ ప్లాన్‌ను పోర్టింగ్ పెట్టుకోవడానికి బదులు, అదే బీమా సంస్థలో మెరుగైన ఫీచర్లతో కూడిన మరో ప్లాన్‌ను మైగ్రేట్ అవ్వడం మంచి నిర్ణయం అవుతుంది. పోర్టింగ్ అంటే ప్రస్తుత బీమా సంస్థను వీడి, మరో బీమా సంస్థకు మారిపోవడం. మైగ్రేషన్ అంటే ప్రస్తుత బీమా సంస్థలోనే మరో ప్లాన్‌కు మారిపోవడం. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనల కింద ఒక వ్యక్తి తన పాలసీని ఎలాంటి బ్రేక్ లేకుండా వరుసగా నాలుగేళ్ల పాటు రెన్యువల్ చేసుకుంటే, అప్పుడు ప్రస్తుత బీమా ప్లాన్ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మైగ్రేషన్‌కు అర్హత లభిస్తుంది’’అని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ బిజినెస్ ప్రెసిడెంట్ పార్థానిల్ ఘోష్ తెలిపారు. ఎప్పుడు మార్చుకోవాలి..? ‘‘కస్టమర్లు ప్రస్తుత హెల్త్ ప్లాన్ కవరేజీ పట్ల అసంతృప్తితో ఉంటే లేదా ప్రస్తుత బీమా సంస్థ సేవలు నచ్చకపోతే లేదా సమగ్రమైన, వినూత్నమైన బీమా పాలసీ అందుబాటు ప్రీమియానికి లభిస్తుంటే పోర్ట్ పెట్టుకోవచ్చు. కాకపోతే నూతన పాలసీ ప్రయోజనాలు, నూతన సంస్థ సేవల సదుపాయాలను ప్రధానంగా చూడాలి’’అని షా సూచించారు. ‘‘మార్కెట్లో ఉన్న ప్రతీ నూతన ఉత్పత్తి అందరికీ సరిపోకపోవచ్చు. వేరొక సంస్థలోని ప్లాన్‌లో ఉన్న ఆకర్షణీమయైన ఫీచర్లను చూసి మారిపోవడం సరికాదు. మీ అవసరాలు, కుటుంబ సభ్యులు, వయసు తదితర అంశాల ఆధారంగా కొత్త ఉత్పత్తిని మదింపు వేయాలి’’అని నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోయినా, కస్టమర్ సేవలు నచ్చకపోయినా, ప్రస్తుత బీమా సంస్థ అందిస్తున్న సేవలు నాసిరకంగా ఉన్నా, సరైన కారణాలు చూపకుండా క్లెయిమ్‌ను తిరస్కరించినా అప్పుడు మారిపోవడాన్ని పరిశీలించొచ్చని యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో శరద్ మాథుర్ సూచించారు. సరైన సమాచారం పొందలేకపోవడం, పారదర్శకత లేమి, కంపెనీ నుంచి సత్వర స్పందన లేకపోవడం, విలువ ఆధారిత సేవలు లేకపోయినా పోర్టింగ్‌ను పరిశీలించొచ్చని తెలిపారు. ఇప్పటికే బీమా పాలసీ ఉండి, అందులోని నిబంధనల వల్ల సొంతంగా చెల్లింపులు చేసుకోవాల్సి వస్తుంటే, రూమ్ రెంట్ పరంగా ఉప పరిమితులు ఉంటే, మీకు దీర్ఘకాలిక వ్యాధి ఉండి ఓపీడీ లేదా డేకేర్ కవరేజీ లేకపోతే, మీ ప్లాన్‌లో రీస్టోరేషన్ (బీమా ఖర్చయితే తిరిగి పునరుద్ధరించడం) ఫీచర్ లేకపోయినా, ముందు నుంచి ఉన్న వ్యాధులకు దీర్ఘకాలం వెయిటింగ్ పీరియడ్ ఉన్నా, అప్పుడు మీ వంతు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. దీనికి బదులు వేరొక ప్లాన్‌కు మారిపోవడమే నయం. ఉదాహరణకు నివాబూపా సంస్థ రెండు గంటలకు మించి హాస్పిటలైజేషన్ అయితే చాలు చెల్లింపులు చేస్తోంది. అదే ఆదిత్య బిర్లా సంస్థ అయితే ఆరోగ్యకర జీవనశైలిని (కంపెనీ చెప్పినట్టు) అనుసరిస్తే అప్పడు ప్రీమియంలో నూరు శాతం వరకు రాయితీని ఆఫర్ చేస్తోంది. సాధారణంగా పోర్టింగ్ లేదా మైగ్రేషన్‌కు ప్రీమియం ఒక్కటినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే అన్ని బీమా సంస్థలు కొన్నేళ్లకోసారి ప్రీమియంను సవరిస్తుంటాయి. అలాగే వయసు వారీగా కూడా ప్రీమియం పెంపు ఉంటుంది. అలాగే, బీమా కవరేజీని పెంచుకునేందుకు సైతం పోర్టింగ్ సరికాదు. దీనికి బదులు టాపప్ లేదా సూపర్ టాపప్ రూపంలో అదనపు కవరేజీని యాక్టివేట్ చేసుకోవచ్చు. బేసిక్ ప్లాన్ కవరేజీకి మించి క్లెయిమ్ వచ్చిన సందర్భాల్లోనే టాపప్, సూపర్ టాపప్ చెల్లింపులు చేస్తాయి. ఏమి చూడాలి..? మీ అవసరాలకు సరిపడే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. పాలసీ వర్డింగ్స్, పాలసీ బ్రోచర్‌ను అన్ని పేజీలు చదివితే పూర్తి వివరాలు తెలుస్తాయి. తద్వారా ప్లాన్ ఆకర్షణీయమా? కాదా? అన్నది చూడొచ్చు. క్లెయిమ్ పరిష్కారాల విషయంలో నూతన సంస్థ పనితీరును విశ్లేషించాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, క్లెయిమ్ చెల్లింపుల సామర్థ్యాలను చూడాలి. క్లెయిమ్ అభ్యర్థనలను ప్రాసెస్ చేయడంతో బీమా సంస్థల స్పందనను చూడాలి. ప్రీమియం ఎక్కువ ఉన్నా సరే, క్లెయిమ్ సమయంలో పాలసీదారులపై చెల్లింపుల భారం పడని పాలసీని ఎంపిక చేసుకోవాలి. ఓపీడీ కవరేజీ, డేకేర్, రీస్టోరేషన్ కూడా ఉండాలి. ఒక పాలసీ సంవత్సరంలో ఒక క్లెయిమ్ వల్ల బీమా కవరేజీ మొత్తం ఖర్చయినప్పుడు.. రీస్టోరేషన్ కింద బీమా సంస్థ అంతే మొత్తాన్ని పునరుద్ధరిస్తుంది. దీనివల్ల అదే ఏడాది మళ్లీ ఆసుపత్రిలో చికిత్స అవసరం పడితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులోనూ కొన్ని సంస్థలు ఒక ఏడాదిలో ఒకరు ఎన్ని సార్లు ఆసుపత్రిలో చేరినా, గతంలో క్లెయిమ్ చేసిన వ్యాధులకు సైతం రీస్టోరేషన్ (అన్ లిమిటెడ్) ఇస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. ముందు నుంచి ఉన్న వ్యాధులకు సాధారణంగా 3–4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దీనివల్ల వాటికి కవరేజీ కోసం అన్నేళ్లు ఆగక తప్పదు. దీనికి బదులు ఏడాది, అసలు వెయిటింగ్ పీరియడ్ లేని (రైడర్) పాలసీలు మెరుగైనవి. నో క్లెయిమ్ బోనస్ అనేది ప్రీమియం తగ్గింపు రూపంలో కాకుండా, బీమా కవరేజీ పెంపు రూపంలో ఉంటే ఎక్కువ ప్రయోజనం. రూమ్ రెంట్ పరిమితులు లేకుండా చూసుకోవాలి. ఇంటి నుంచే చికిత్స తీసుకోవాల్సి వస్తే (కరోనా వంటి సమయాల్లో) కవరేజీనిచ్చే డోమిసిలరీ ట్రీట్మెంట్ కవరేజీ ఫీచర్ ఉంటే మంచిదే. దరఖాస్తు తిరస్కరణ..? మంచి ఆరోగ్య చరిత్ర ఉండి, సరైన వివరాలు, డాక్యుమెంట్లు అందిస్తే నూతన సంస్థ పోర్టింగ్ అభ్యర్థనను ఆమోదించి పాలసీ మంజూరు చేస్తుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండి, ఇచ్చిన సమాచారంలో అస్పష్టత, గోప్యత ఉంటే, లేదా ఇతర కారణాలతో పాలసీ ప్రపోజల్‌ను తిరస్కరించొచ్చు. ఎందుకంటే అప్పటికే ఉన్న ఆరోగ్య చరిత్రను పాత సంస్థ నుంచి నూతన బీమా సంస్థ తీసుకుంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. పాత బీమా సంస్థకు దరఖాస్తు సమయంలో ఇచ్చిన దానికి భిన్నమైన సమాచారం కొత్త సంస్థకు అందించినట్టయితే తిరస్కరణకు అవకాశాలుంటాయి. అటువంటి సందర్భంలో కొత్త సంస్థను బతిమిలాడే బదులు, ఉన్న సంస్థతోనే కొనసాగడం మంచి నిర్ణయం అవుతుంది. దీనికి బదులు ప్రస్తుత బీమా సంస్థలోనే మెరుగైన ఫీచర్లతో కూడిన ప్లాన్‌కు మైగ్రేట్ అవ్వడం మరో మంచి ఆప్షన్. అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే, పోర్టింగ్ దరఖాస్తును ఆమోదించాలనేమీ లేదు. ముఖ్యంగా తనకున్న వ్యాధులకు పాత ప్లాన్‌లో క్లెయిమ్ చేసుకుని ఉంటే పోర్టింగ్ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత పాలసీ రెన్యువల్‌కు సంబంధించి ల్యాప్సెస్ ఉంటే అది కూడా తిరస్కరణకు కారణం అవుతుంది. నిబంధనల మేరకు రెన్యువల్ సమయంలో సంప్రదించకుంటే అప్పుడు పోర్టింగ్ విజయవంతం కాదు. అందుకే రెన్యువల్‌కు 60రోజుల ముందు సంప్రదించాలి. 70 ఏళ్లు దాటిన వారికి పోర్టింగ్‌కు అవకాశం ఉండదు. పోర్టింగ్ ఎలా..? నూతన సంస్థకు మారిపోవాలని నిర్ణయించుకుంటే రెన్యువల్ సమయంలోనే అనుమతిస్తారు. పాలసీ రెన్యువల్ తేదీకి 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు నూతన బీమా సంస్థకు పోర్టింగ్ గురించి తెలియజేయాలి. ఈ సమయంలో వీలు కాకపోతే, తిరిగి రెన్యువల్ వరకు వేచి చూడాల్సిందే. ప్రపోజల్ పత్రం, పోర్టబులిటీ దరఖాస్తు పత్రాలను నింపాలి. ఆరోగ్య చరిత్ర, బీమా సంస్థ కోరిన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ, ఇతర పత్రాలను కూడా అందించాలి. గత పాలసీ పరిధిలో క్లెయిమ్ చేసి ఉంటే, డిశ్చార్జ్ సమ్మరీ జోడించాలి. అనంతరం ప్రస్తుతం బీమా సంస్థకు పోర్టింగ్ సమాచారం వెళుతుంది. అప్పుడు ప్రస్తుత సంస్థ సదరు పాలసీదారుకు సంబంధించి క్లెయిమ్, ఇతర సమాచారాన్ని కొత్త సంస్థతో పంచుకోవాలి. అప్పుడు నూతన బీమా సంస్థ 15 రోజుల్లోపు తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పాలసీ దరఖాస్తును ఆమోదిస్తే ప్రీమియం చెల్లించాలి. వీటిని గమనించాలి.. పోర్టింగ్ సమయంలో పాత ప్లాన్‌లో నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలు ఉంటే, కొత్త ప్లాన్‌లోనూ జతవుతాయి. కానీ, దీనికి కంపెనీలు షరతు పెడుతున్నాయి. ప్రస్తుత కవరేజీ రూ. 5 లక్షలు ఉండి, కొత్త సంస్థలోనూ రూ.5 లక్షలే తీసుకుంటే, పాత ప్లాన్ పరిధిలోని నో క్లెయిమ్ బోనస్ పోర్టింగ్ అవ్వదు. అదే రూ.6 లక్షలు తీసుకుంటే నో క్లెయిమ్ బోనస్ కలుస్తుంది. పోర్టింగ్ లేదా మైగ్రేషన్‌ను కొత్త ప్రపోజల్గానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. అండర్‌రైటింగ్ నిబంధనల మేరకు ప్రీమియం నిర్ణయిస్తాయి. బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్‌ను మాత్రమే మరో బీమా సంస్థ పరిధిలోని బీమా ఇండెమ్నిటీ ప్లాన్‌కు మార్చుకోగలరు. అంతేకానీ, టాపప్ లేదా క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్‌ను మార్చుకోలేరు. ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు హెల్త్ ప్లాన్‌ను పోర్టింగ్ పెట్టుకుంటే ఎలాంటి చార్జీల్లేవు. కార్పొరేట్ లేదా గ్రూప్ ప్లాన్లల ఉన్న వారికి ఇండివిడ్యువల్ ప్లాన్‌కు పోర్టింగ్ అవకాశం లేదు. వారు అదే సంస్థతో కొసాగాల్సిందే. -
పోర్టబులిటీ.. ‘వలస’పాలిట పెన్నిధి
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థలో పోర్టబులిటీ సౌకర్యంతో లబ్ధిదారులు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఉచిత సరుకులు పొందుతున్నారు. ఉపాధి నిమిత్తం పనుల కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలకు పోర్టబులిటీ సౌకర్యం ఆదుకుంటోంది. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు లభించింది. పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి కూడా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ, కర్ణాటకల్లోనూ అంతర్రాష్ట్ర పోర్టబులిటీని అమల్లోకి తెచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు అక్కడే నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏప్రిల్ నుంచి నెలకు రెండు విడతల చొప్పున ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తోంది. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ విడత ఉచిత సరుకుల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1.51 కోట్ల కార్డుదారులుంటే ఇప్పటికి 1.13 కోట్ల కుటుంబాలు ఉచిత సరుకులు అందుకున్నాయి. ఈ నెలలో పంపిణీ ప్రారంభమైన వారంలోనే(శనివారం నాటికి) 34 లక్షలకు పైగా కుటుంబాలు పోర్టబులిటీతో లబ్ధిపొందారు. 13వ విడతలో సరుకులు తీసుకున్న, పోర్టబులిటీతో లబ్ధి పొందిన కుటుంబాల వివరాలు (జిల్లాల వారీగా): జిల్లా సరుకులు తీసుకున్న కుటుంబాలు పోర్టబులిటీతో..లబ్ధి పొందిన కుటుంబాలు అనంతపురం 10,57,690 2,56,362 చిత్తూరు 9,59,828 1,71,568 తూ.గోదావరి 13,14,140 4,22,821 గుంటూరు 11,39,290 4,68,253 కృష్ణా 9,84,295 3,74,443 కర్నూలు 9,80,230 3,49,778 ప్రకాశం 7,89,353 2,02,858 శ్రీకాకుళం 1,97,250 1,595 నెల్లూరు 6,47,311 1,76,644 విశాఖపట్నం 10,53,722 3,75,345 విజయనగరం 6,02,782 92,375 ప. గోదావరి 9,91,955 3,29,270 వైఎస్సార్ కడప 6,78,163 1,83,813 మొత్తం 1,13,96,009 34,05,125 -
తెలంగాణలో ఉన్నా రేషన్
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటివరకు రాష్ట్ర పరిధిలోనే ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని అంతర్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఉపాధి పనుల నిమిత్తం మన రాష్ట్రం నుంచి తెలంగాణకు వలస వెళ్లిన పేదలకు అంతర్ రాష్ట్ర పోర్టబిలిటీ ఎంతో ప్రయోజనం కల్గిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఒక క్లస్టర్‌గా గుర్తించి ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా అమలైతే దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో రేషన్ కార్డులున్న 349 మంది తెలంగాణలో బియ్యంతో పాటు ఇతర సరుకులు తీసుకున్నారు. తొలి రోజు 9.76 లక్షల మందికి.. ► రాష్ట్రంలో 12వ విడత ఉచిత సరుకులు పంపిణీ ఆదివారం ప్రారంభమైంది. మొదటి రోజున 9.76 లక్షల మంది ఉచిత సరుకులు పొందారు. ► అంతర్ జిల్లాల పోర్టబిలిటీ ద్వారా రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు చెందిన 1.34 లక్షల మంది బియ్యంతో పాటు శనగలు ఉచితంగా తీసుకున్నారు. ► ఈ విడతలో 1,50,80,690 బియ్యం కార్డుదారులకు ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున శనగలు కేటాయించారు. -
పేదలకు వరం.. వన్ నేషన్.. వన్ రేషన్
సాక్షి, అమరావతి: ఉపాధి కోసం పేదలు ఏ రాష్ట్రానికి వెళ్లినా వారికి అక్కడే సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు’ పథకం ద్వారా అంతర్రాష్ట్ర రేషన్ కార్డు పోర్టబిలిటీ విధానాన్ని దేశవ్యాప్తంగా మార్చి 2021 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తెలంగాణలో నివాసం ఉంటున్న ఏపీకి చెందిన వారికి కరోనా కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచిత సరుకులు అందాలనే ఉద్దేశంతో అంతర్రాష్ట్ర పోర్టబిలిటీ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఈ నెల నుంచి పకడ్బందీగా అమలు చేయాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి. ► వలస కూలీలు ఎక్కడ ఉన్నా అక్కడి రేషన్ షాపుల్లో తమ రేషన్‌ను పొందేందుకు ఈ విధానం వీలు కల్పిస్తుంది. ► వన్ నేషన్.. వన్ రేషన్ కార్డ్ పోర్టబిలిటీ ద్వారా రాష్ట్రానికి చెందిన పలువురు తెలంగాణలో ఉచితంగా సరుకులు అందుకున్నారు. ► అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వంద మందికి పైగా తెలంగాణలోని వివిధ రేషన్ షాపుల్లో మంగళవారం ఈ–పాస్ మిషన్‌లో వేలి ముద్రలు వేసి బియ్యంతో పాటు కందిపప్పు తీసుకున్నారు. ► మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పోర్టబిలిటీ త్వరలో అందుబాటులోకి రానుంది. ► రాష్ట్రంలో తొమ్మిదవ విడత ఉచిత సరుకుల పంపిణీలో భాగంగా మంగళవారానికి దాదాపు 1.12 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. ► రాష్ట్ర పరిధిలో పోర్టబిలిటీ ద్వారా వివిధ జిల్లాల్లో 32.56 లక్షల కుటుంబాలు సరుకులు తీసుకున్నారు. పోర్టబిలిటీతో అక్కడే... మన రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువ మంది తెలంగాణలో ఉంటున్నారు. గతంలో ఇలాంటి వాళ్లు సొంతూళ్లకు వచ్చి సరుకులు తీసుకునే వారు. ఇప్పుడు వాళ్లు అక్కడే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారులు సరుకులు తీసుకోవచ్చు. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ -
ఫేస్బుక్లో డేటా పోర్టబులిటీ
కాలిఫోర్నియా : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన సర్వర్‌లో సేవ్ చేసిన డేటాను గూగుల్ ఫోటోస్‌వంటి మిగతా ప్లాట్‌ఫామ్‌లకు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అనుమతినిచ్చింది. డేటా పోర్టబులిటీ ఫీచర్‌ను అమెరికా, కెనడాలోని ఫేస్బుక్ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. అమెరికా, కెనడా వినియోగదారులు గురువారం నుండి వారి ఫేస్బుక్ ఖాతాల ద్వారా ఈ ఫీచర్‌ను వినియోగించుకోవొచ్చు. ఇప్పటికే యూరప్, లాటిన్ అమెరికాతో సహా పలు దేశాలలో ఈ ఫీచర్ ప్రారంభించారు. వినియోగదారుల డేటా విషయంలో కొత్త సర్వీస్ ప్రొవైడర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటును వారికి కల్పించాలని గత రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి సూచనలు వస్తున్నాయని ఫేస్బుక్లో ప్రైవసీ అండ్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ స్టీవ్ సాట్టర్ఫీల్డ్ తెలిపారు. డేటా పోర్టబులిటీతో వినియోగదారులకు తమ డేటాపై మరింత నియంత్రణ ఉండే వెసులు బాటు ఉంటుందన్నారు. ఈ నిర్ణయంతో ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఫోటోలు, వీడియోలను వినియోగదారుడు కావాలనుకుంటే నేరుగా గూగుల్ డ్రైవ్వంటి మరో సర్వీస్ ప్రొవైడర్ సర్వర్‌లో అప్లోడ్ చేసుకునేలా అవకాశం ఉంటుంది. ఒక వేళ ఫేస్బుక్లో ఫోటోలు, వీడియోలు డిలీట్ అయినా లేదా ఖాతానే డిలీట్ అయినా డేటా మాత్రం గూగుల్ డ్రైవ్‌లో సురక్షితంగా ఉండనుంది. -
ఏ ఆపరేటర్‌కైనా అదే సెట్‌టాప్ బాక్సు
న్యూఢిల్లీ: డీటీహెచ్ సంస్థలు తమ వినియోగదారులకు ఇచ్చే సెట్‌టాప్ బాక్సులు... ఒక ఆపరేటర్ నుంచి వేరొక ఆపరేటర్‌కు మారినా సరే ఉపయోగపడేటట్లు ఉండాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఇలాంటి బాక్సులనే వినియోగదార్లకు ఇవ్వాల్సిందిగా కంపెనీలను ఆదేశించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సూచించింది. అంటే వినియోగదారుడు ఆపరేటర్‌ను మార్చాలని భావించినా (డీటీహెచ్ పోర్టబిలిటీ) సెట్‌టాప్ బాక్సు మాత్రం మార్చాల్సిన పని ఉండదు. ఈ సెట్‌టాప్ బాక్సులన్నీ యూఎస్బీ ఆధారిత కనెక్షన్‌తో పనిచేసేలా ఉండాలని కూడా ట్రాయ్ స్పష్టంచేసింది. ఈ మేరకు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ మార్గదర్శకాలను సవరించాలని కూడా ట్రాయ్ సూచించింది. ఈ మార్పులను అమలు చేసేందుకు డీటీహెచ్ కంపెనీలకు 6 నెలల గడువివ్వాలని ట్రాయ్ పేర్కొంది. దీనికోసం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రాయ్, భారత ప్రమాణాల సంస్థ(బీఎస్ఐ), టీవీ ఉత్పత్తిదారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖను కోరింది. ప్రతిపాదిత ప్రమాణాలను డీటీహెచ్, కేబుల్ టీవీ విభాగాలు అమలు చేస్తున్నదీ లేనిదీ ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. -
ఎక్కడుంటే అక్కడే రేషన్..
బొబ్బిలి: బతుకుదెరువు కోసం హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కూలీలు, కుటుంబాలు ఇక నిశ్చింతగా ఉండొచ్చు. రేషన్ కార్డు తొలగింపు భయమే ‘రద్దయిపోయింది’. ఇప్పటి వరకూ అంతర్ జిల్లాల స్థాయిలోనే అంతంత మాత్రంగా ఉన్న పోర్టబిలిటీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రారంభించింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోర్టబిలిటీ విధానాన్ని ప్రారంభించి, ఏపీ లబ్ధిదారులకు తెలంగాణలో రేషన్ ఇచ్చే ప్రక్రియను శుక్రవారం ప్రారంభించారు. దీని వల్ల రేషన్ కార్డు రద్దవుతుందనే ఇబ్బందులు లేని వ్యవస్థ మొదలుకానుంది. కార్డు డిలీట్ కష్టాలకు ఇక చెక్.. జిల్లాలో 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా 846 అన్నపూర్ణ కార్డులుండగా.. 1,117 మంది లబ్ధిదారులన్నారు. అలాగే అంత్యోదయ కార్డులు 84,972 ఉంటే అందులో లబ్ధిదారులుగా 2,34,076 మంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులు 6,27,235 ఉండగా, లబ్ధిదారులు 18,25,778 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా దారిద్య్ర రేఖ దిగువన జీవిస్తున్న వారికి తెల్ల రేషన్ కార్డులు 7,13,053 ఉన్నాయి. అయితే జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కుటుంబాలు 80 వేలకు పైగానే ఉన్నాయి. అనేక కుటుంబాలు.. పిల్లలను కూడా అక్కడే చదివిస్తున్నాయి. వలస వెళ్లిన వారిలో చాలా మంది ఇప్పటికీ రెండుమూడు నెలలకోసారి స్వగ్రామానికి వచ్చి రేషన్, పింఛన్లు తీసుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. ఒక్కోసారి రాలేని వారి కార్డులు కూడా డిలీట్ అయిన సందర్భాలున్నాయి. కూలీలకు మరింత ప్రయోజనం.. కొత్తగా తీసుకొచ్చిన పొర్టబిలిటీ విధానాన్ని తొలుత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభించడం రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేకూరుస్తుంది. దీని వల్ల ఆయా కుటుంబాలు ఎక్కడుంటే అక్కడే రేషన్ తీసుకోవచ్చు. ఈ సౌలభ్యం వల్ల వలస కూలీలకు ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. అలాగే కొంత మంది నాలుగేసి నెలల పాటు ఇతర ప్రాంతాల్లో కూలీ పనులకు వెళ్తుంటారు. వారు ఇకపై అక్కడ మార్కెట్లో కొనుగోలు చేసుకోకుండా, రేషన్ ద్వారానే బియ్యం, ఇతర సరుకులు తీసుకోవచ్చు. గతంలో జిల్లా వరకే.. రాష్ట్రంలో 2015లో ఈ పోర్టబిలిటీ విధానాన్ని ప్రారంభించినా కేవలం మండలాలకే పరిమితమై ఉండేది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఇతర మండలాల కార్డులను అనుసరించి సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. కానీ, అంతర్రాష్ట్ర పోర్టబిలిటీ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నూతనంగా అమల్లోకి వచ్చింది. -
త్వరలోనే డీటీహెచ్, కేబుల్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: టీవీ వీక్షకులకు త్వరలోనే పోర్టబిలిటీ అవకాశం అందుబాటులోకి రానుంది. సెట్ టాప్ బాక్స్ మార్చే పని లేకుండానే డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్లను మార్చుకోవడం సాకారం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది సాధ్యమవుతుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ‘‘గత రెండేళ్లుగా సెట్ టాప్ బాక్స్(ఎస్టీబీలు)ల మధ్య ఇంటర్ ఆపరేబిలిటీని (అంతర్లీనంగా పనిచేయగలగడం) సాధ్యం చేసేందుకు కృషి చేస్తున్నాం. అవరోధాల్లో చాలా వరకు పరిష్కారం అయ్యాయి. కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మాత్రం ఉన్నాయి. వీటిని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది చివరికి సాధ్యమవుతుంది’’ అని శర్మ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఇంటర్ ఆపరేబిలిటీ ఆలోచన వచ్చిన వెంటనే సాధ్యం కాదని, ఇందుకు తొలుత ప్రణాళికను ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు. దేశీయ మొబైల్ ఫోన్ పరిశ్రమ విజయవంతం కావడానికి ఇంటర్ ఆపరేబిలిటీ కీలకమైన అంశంగా పేర్కొన్నారు. దేశంలో పరికరాలకు సంబంధించిన ఎకో సిస్టమ్‌పై అధ్యయనాన్ని శర్మ ఈ సందర్భంగా విడుదల చేశారు. -
త్వరలోనే డీటీహెచ్, కేబుల్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: టీవీ వీక్షకులకు త్వరలోనే పోర్టబిలిటీ అవకాశం అందుబాటులోకి రానుంది. సెట్ టాప్ బాక్స్ మార్చే పని లేకుండానే డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్లను మార్చుకోవడం సాకారం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది సాధ్యమవుతుందని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ‘‘గత రెండేళ్లుగా సెట్ టాప్ బాక్స్(ఎస్టీబీలు)ల మధ్య ఇంటర్ ఆపరేబిలిటీని (అంతర్లీనంగా పనిచేయగలగడం) సాధ్యం చేసేందుకు కృషి చేస్తున్నాం. అవరోధాల్లో చాలా వరకు పరిష్కారం అయ్యాయి. కొన్ని వ్యాపారపరమైన సవాళ్లు మాత్రం ఉన్నాయి. వీటిని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది చివరికి సాధ్యమవుతుంది’’ అని శర్మ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఇంటర్ ఆపరేబిలిటీ ఆలోచన వచ్చిన వెంటనే సాధ్యం కాదని, ఇందుకు తొలుత ప్రణాళికను ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు. దేశీయ మొబైల్ ఫోన్ పరిశ్రమ విజయవంతం కావడానికి ఇంటర్ ఆపరేబిలిటీ కీలకమైన అంశంగా పేర్కొన్నారు. దేశంలో పరికరాలకు సంబంధించిన ఎకో సిస్టమ్‌పై అధ్యయనాన్ని శర్మ ఈ సందర్భంగా విడుదల చేశారు. -
కానుక.. కినుక..
పశ్చిమగోదావరి , కొవ్వూరు రూరల్: పోర్టబులిటీ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందే అవకాశం కల్పించిన ప్రభుత్వం, ఈ పద్ధతిని చంద్రన్న కానుకలకు మాత్రం రద్దు చేసింది. దీంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా ఏ రేషన్ షాపు పరిధిలో ఉన్న కార్డుదారులు అక్కడే చంద్రన్న కానుకలు పొందాలని పేర్కొనడంతో చాలా మంది లబ్దిదారులు అయోమయంలో పడ్డారు. ఇదేమి అన్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే షాపుల పరిధిలో ఈ పాస్ యంత్రంలో పోర్టబులిటీ సౌకర్యాన్ని తొలగించడంతో షాపుల నిర్వాహకులు సైతం ఏమీ చేయలేమని చేతులెత్తేడంతో సొంత గ్రామాల్లో కానుక సరుకులు తీసుకోవడానికి కొంతమంది పయనమవుతున్నారు. ఉపాధి, ఉద్యోగం, ఇతర పరిస్థితుల దృష్ట్యా మండలం, పట్టణ పరిధి నుంచి వలస వెళ్లి రేషన్ లబ్ధిదారులు పోర్టబులిటీ సౌకర్యాన్ని వినయోగించుకుని రేషన్ సరుకులు, కానుక సరుకులు పొందేవారు. జిల్లాలో 2020 రేషన్ షాపుల పరిధిలో 12,39,721 రేషన్ కార్డులకు గాను 3,06,853 మంది పోర్టబులిటీ ద్వారా సరుకులు పొందినట్టు ఆన్లైన్లో నమోదై ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చంద్రన్న కానుక సరకులకు పోర్టబులిటీ నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 16,44,002 కార్డులకు చంద్రన్న కానుకలు ఇవ్వగా, జిల్లాలో 1,77, 205 కార్డులకు పంపిణీ చేసి ఆదివారం రాత్రికి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 11.46 శాతం, జిల్లాలో 14.26 శాతం పంపిణీ చేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కొత్త షాపుల నేపథ్యంలో ఇబ్బందులు జిల్లావ్యాప్తంగా ఇటీవల కొత్త షాపులు ఇవ్వడంతో ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ఒకే గ్రామంలో రెండు మూడు షాపులు ఉన్నా ఆ ఇబ్బందులు తప్పడం లేదు. పోర్టబులిటీ అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న షాపుల్లో సరుకులు పొందేవారు. అయితే ఇప్పుడు పోర్టబులిటీ లేకపోవడంతో, ఏ షాపు పరిధిలో తన కార్డు ఉంటుందో అక్కడికి వెళ్లి కార్డుదారుడు రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల అనుమతులు ఇచ్చిన కొత్త షాపులకు పాత షాపుల నుంచి బైపరిగేషన్ చేసి కార్డులు బదిలీ చేయడంతో కార్డు ఎక్కడ ఉందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. పోర్టబులిటీ లేకపోవడంతో డీలర్లతో పాటు, కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ల డిమాండ్ల సాధన కోసం సమ్మె చేసిన నేపథ్యంలో, జనంలో డీలర్లను చులకన చేయడానికే ఈ విధమైన చర్యలకు ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు చేపట్టినట్టు పలువురు డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ చర్యల వల్ల పోర్టబులిటీ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న రాష్ట్రవ్యాప్తంగా 12,39,721, జిల్లాలో 3,06,853 మందిని చంద్రన్న కానుకలకు దూరం చేయాలని ప్రభుత్వ పన్నాగమని పేదలు ఆరోపిస్తున్నారు. -
పోర్టబులిటీ ద్వారా రేషన్ సరుకులు
గజపతినగరం : జిల్లాలో 70 వేల రేషన్‌కార్డుదారులకు పోర్టబులిటీ ద్వారా రేషన్ సరుకులు ఇస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి ఎన్.సుబ్బరాజు అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో సమారు మూడు లక్షల మందికి ఈ విధానం వల్ల సరుకులు ఇస్తున్నట్లు చెప్పారు. పురిటిపెంట రేషన్‌డిపోను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈకేవైసీ వేగవంతం చేయడంలో భాగంగా తాను పర్యటిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 1.36 లక్షల మందికి ఈకేవైసీ చేయాల్సి ఉందన్నారు. అందుకోసమే డిపోలను సందర్శిస్తూ వేగవంతానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే 2.1 లక్షల మందికి యూఐడీ ఈకేవైసీ చేయాల్సి ఉందని తెలిపారు. 1117 కార్డులకు బయోమెట్రిక్ అథంటికేషన్ పూర్తికాలేదని, ఐదు రోజుల్లో కార్డుదారులు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ గ్రామ స్వరాజ్య అభియాన్‌లో ఉజ్వల పథకం ద్వారా జిల్లాలో 25 వేల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గత ఖరీఫ్‌లో సేకరించిన ధాన్యానికి మిల్లర్ల నుంచి 73 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి రావాల్సి ఉందని తెలిపారు. కొత్తగా రేషన్‌కార్డులో సభ్యులు చేరడానికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం నాసిరకంగా ఉండడం వల్ల తినడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని విలేకరులు ప్రశ్నించగా, నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా గిడ్డంగుల ఇన్చార్జులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గజపతినగరం పౌరసరఫరాల ఉప తహసీల్దార్ ఎన్‌వీవీఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు. 1100 నంబర్‌కు ఫోన్ చేయాలి.. దత్తిరాజేరు: కొత్తగా రేషన్‌కార్డులు కావాలనకునేవారు 1100 నంబర్‌కు ఫోన్ చేస్తే పూర్తి సమాచారం తెలుస్తుందని డీఎస్ఓ ఎన్. సుబ్బరాజు తెలిపారు.మండలంలోని పెదమానాపురం, మరడాంలో గల రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరుకుల పంపిణీలో తేడాలుంటే చర్యలు తప్పవన్నారు. ఈ నెల 19 నుంచి 24 వరకు కార్డుల్లో పేర్లు రద్దయిన వారికి డీలర్ద ద్వారా సరుకులు ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకు బయోమెట్రిక్ చేసుకోలేని వారందరూ వెంటనే బయోమెట్రిక్ చేసుకోవాలని సూచించారు. 13 సంవత్సాలు దాటిన పిల్లలకు కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ చేయించాలన్నారు. గతంలో చాలా కటుంబాలు పల్స్‌సర్వేలో పాల్గొన్నా వారి పేర్లు పౌరసరఫరాల జాబితాలో చేరకపోవడంతో రేషన్ సరుకులు అందలేదన్నారు.త్వరలో వారిందరికీ సరుకులు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పెదమానాపురంలో చంద్రన్న విలేజ్ మాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో మండల పౌరసరఫరాల అధికారి రవిశంకర్ పాల్గొన్నారు. -
పంపిణీ పకడ్బందీ!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : రేషన్ బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభుత్వం పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఇప్పటివరకు తమ పరిధిలోని రేషన్ దుకాణంలో బియ్యం తీసుకున్న లబ్ధిదారులు.. పోర్టబులిటీ విధానం ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రతి రేషన్ దుకాణానికి కోటాకన్నా.. 20 శాతం ఎక్కువ బియ్యం సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. పోర్టబులిటీ విధానం ప్రవేశపెట్టి.. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా సరుకులు లబ్ధిదారులకు అందేలా కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తం 669 రేషన్ దుకాణాలు ఉండగా.. ప్రతి నెలా 7,251 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. వీటిని డీలర్లు.. లబ్ధిదారులకు నిర్ణీత తేదీలు, సమయాల్లో పంపిణీ చేస్తుంటారు. అయితే రేషన్ పంపిణీ చేసే సమయంలో కార్డుదారులు సుదూర ప్రాంతాలకు వెళ్లినా.. బతుకు దెరువు కోసం మరోచోట నివాసం ఉంటున్నా.. డీలర్లు సరుకులు ఇచ్చే సమయానికి ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి సొంత ఊరికి రావాల్సి వచ్చేది. అటువంటి వారికి వెసులుబాటు కల్పించేందుకు.. సరుకులు పక్కదారి పట్టకుండా.. అవినీతి అక్రమాలకు చోటు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కడి నుంచైనా.. ప్రస్తుతం అమలు చేయనున్న పోర్టబులిటీ విధానంతో లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా బియ్యం సులువుగా తీసుకోవచ్చు. రేషన్ దుకాణానికి వెళ్లి.. కార్డు నంబర్ చెప్పి.. అక్కడ వేలిముద్ర వేసి బియ్యం తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల రేషన్ సరఫరా చేసే సమయంలో సొంత గ్రామంలోనే ఉండి రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఇక నుంచి ఉండదు. ఏ పని కోసమైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. ఇంట్లో వారు ఎక్కడికి వెళ్లినా.. రేషన్ తీసుకోవడం కుదరకపోవడంతో ఆ నెల సరుకులు నష్టపోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి నుంచే జిల్లావ్యాప్తంగా పోర్టబులిటీ విధానం అమలవుతోంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కార్డు నంబర్ చెప్పి రేషన్ సరుకులు తీసుకునే వీలుంటుంది. 20 శాతం అదనంగా కేటాయింపు.. రేషన్ బియ్యం ఎక్కడి నుంచైనా తీసుకునే వీలుండటంతో అందుకు అనుగుణంగా బియ్యం కేటాయింపులు కూడా చేశారు. ప్రతి రేషన్ దుకాణానికి అదనంగా 20 శాతం బియ్యం కేటాయించారు. ఏ రేషన్ షాపు నుంచైనా తమ లబ్ధిదారుడు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన కార్డుదారులు బియ్యం తీసుకెళ్తే ఇచ్చేందుకు వీలుగా ఎక్కువ మొత్తం కేటాయించారు. రేషన్ దుకాణంలో బియ్యం మిగిలితే తర్వాతి నెలకు కేటాయిస్తారు. ఇప్పటి వరకు జిల్లాకు ప్రతి నెలా 7,251 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. ఇకనుంచి 8,699.64 మెట్రిక్ టన్నులు సరఫరా కానున్నది. అదనంగా బియ్యం వచ్చాయి.. రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ షాపులకు పకడ్బందీగా బియ్యం పంపిణీ చేసేందుకు మరింత చర్యలు చేపట్టింది. పోర్టబులిటీ ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం 20 శాతం బియ్యాన్ని అదనంగా కేటాయించింది. ఏప్రిల్ నుంచి ఈ విధానం అమలు కానుంది. – సంధ్యారాణి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి, ఖమ్మం -
నంబర్ పోర్టబిలిటీ చార్జీలు ఇక 4 రూపాయలే
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) చార్జీలను ఏకంగా 79 శాతం తగ్గించింది. గరిష్టంగా రూ. 4కి పరిమితం చేసింది. ఇప్పటిదాకా ఎంఎన్‌పీ పోర్టబిలిటీ గరిష్ట రేటు రూ. 19గా ఉంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సర్వీస్ ప్రొవైడర్స్ (ఎంఎన్‌పీఎస్‌పీ) వ్యయాలు గణనీయంగా తగ్గడంతో పాటు ఎంఎన్‌పీ అభ్యర్ధనలు పెరిగిన నేపథ్యంలో పోర్టింగ్ లావాదేవీల చార్జీలను తగ్గించాలని నిర్ణయించినట్లు ట్రాయ్ తెలిపింది. ఎంఎన్‌పీ చార్జీల సవరణపై డిసెంబర్లో ట్రాయ్ చర్చల ప్రక్రియ ప్రారంభించింది. 2015 జులై 3 నుంచి పెరిగిన పోర్టింగ్ అభ్యర్ధనలు, ఎంఎన్‌పీఎస్‌పీల ఆర్థిక ఫలితాలను బట్టి చూస్తే వ్యయాలు, చార్జీలపరంగా రూ. 19 గరిష్ట పరిమితి చాలా ఎక్కువేనని భావించిన ట్రాయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
బ్యాంకు అకౌంట్లపై నియంత్రణ ఒకరికి.. ఒక్కటే!
సురేశ్‌కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మూడు ఖాతాలున్నాయి. ఒకటి హైదరాబాద్‌లో ఆపరేషన్లకు ఉపయోగిస్తుండగా... ఇంకొకటి ఊళ్లో వ్యవసాయ ఆదాయం కోసం వాడుతున్నాడు. మూడో ఖాతాను డీమ్యాట్ కార్యకలాపాల కోసం విడిగా వినియోగిస్తున్నాడు. ఇప్పటికైతే సురేశ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ త్వరలో ఈ మూడింటికి బదులు ఒకే ఖాతా ఉండబోతోంది. అది ఏ ఖాతా అన్నది సురేశ్ ఇష్టం. మొత్తంగా చూస్తే ఈ మూడు ఖాతాలూ కలిసిపోతాయన్న మాట!!. శ్రీధర్‌కు మూడు వేర్వేరు బ్యాంకుల్లో మూడు ఖాతాలున్నాయి. నెట్వర్క్ పెద్దది కదా అని ఎస్బీఐ... ఇంటికి దగ్గర కదా అని మరో ప్రభుత్వ బ్యాంక్... ఆన్లైన్ సేవలు బాగున్నాయని ఓ ప్రైవేటు రంగ బ్యాంక్... ఈ మూడు ఖాతాలూ వాడుతున్నాడు. మున్ముందు శ్రీధర్‌కు ఈ మూడు ఖాతాల స్థానంలో ఒకటే ఉండబోతోంది. అది ఏ బ్యాంక్‌లో ఉంచుకోవాలన్నది శ్రీధర్ ఇష్టం. అదీ పరిస్థితి. బ్యాంకింగ్ సంస్కరణల్లో భాగంగా సర్కారు చేపడుతున్న ఈ చర్యలతో... చిన్నస్థాయి ప్రైవేటు బ్యాంక్‌లతో పాటు కొన్ని ప్రభుత్వ బ్యాంక్‌లకూ ఇబ్బందులు తప్పేలా లేవు. ఒక మనిషికి ఒకటే బ్యాంకు ఖాతా!! ఇదీ ప్రభుత్వం అమలు చేయబోతున్న తాజా సంస్కరణ. ఇప్పటికే ఆర్బీఐ నుంచి బ్యాంక్‌లకు ఈ మేరకు సూత్రప్రాయంగా సమాచారం అందింది. తొలి దశలో ఒక బ్యాంక్‌లో వేర్వేరు శాఖల్లో రెండేసి ఖాతాలుంటే అందులో ఒకదాన్నే కొనసాగించి... మరొకటి బ్యాంక్‌లే రద్దు చేస్తాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ ప్రక్రియ మొదలయింది. ఆధార్ అనుసంధానం పూర్తయ్యాక ఇది వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఒకరికి ఒకటికన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలుండటం అనేది సహజం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లనే తీసుకుంటే ఇక్కడ దాదాపు 2,150 ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు, 5 గ్రామీణ బ్యాంకులున్నాయి. వీటికి ఏపీలో 6,552, తెలంగాణలో 4,875 బ్రాంచీలుండగా... వీటన్నింటిలో కలిపి దాదాపు 8 కోట్ల ఖాతాలున్నాయి. వీటిల్లో కనీసం 15 శాతం... అంటే 1.20 కోట్ల ఖాతాలు డూప్లికేషనేనని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రీజినల్ రూరల్ బ్యాంక్ ఆఫీసర్స్ జనరల్ సెక్రటరీ ఎస్. వెంకటేశ్వర్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లోనే బహుళ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. గత 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి బహుళ ఖాతాలున్నాయన్న కారణంగా లక్ష అకౌంట్లను తొలగించామని కూడా ఆయన వెల్లడించారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 3 వేల బ్రాంచీలు, దాదాపు 2.4 కోట్ల ఖాతాలున్నాయి. ఒకరికి వేర్వేరు బ్రాంచీల్లో బహుళ ఖాతాలుంటే వాటిని రద్దు చేసుకుని ఒకటే ఉంచాలని సలహా ఇస్తున్నాం’’అని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఒకరు చెప్పారు. ‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంట్రా బ్యాంక్ అకౌంట్ పోర్టబులిటీకి ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలు సమగ్రంగా, డిజిటల్‌గా ఉన్నట్లయితే కస్టమర్లు అదే బ్యాంక్‌కు చెందిన ఇతర బ్రాంచీకి మార్చుకునే వీలుంది. ఎలాంటి చార్జీల్లేకుండా ఎన్నిసార్లయినా మార్చుకునే వీలుంది’’అని ఆయన తెలియజేశారు. ఖాతా తెరిచిన 6 నెలల్లోపు రద్దు చేసుకుంటే రూ.250–300 వరకు చార్జీ ఉంటుంది. ఆ సమయం దాటితే ఎలాంటి జరిమానాలుండవు. అకౌంట్ పోర్టబిలిటీ.. మొబైల్ పోర్టబిలిటీ లానే బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ యోచిస్తోంది. కస్టమర్లకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలందించడంతో పాటు చట్ట విరుద్ధమైన లావాదేవీలకు అవకాశం లేకుండా పోర్టబిలిటీ సేవలను తేవాలని లకిష్యంచింది. ముందుగా పొదుపు ఖాతాలకు పోర్టబిలిటీని అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ఇటీవల బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ వార్షిక సదస్సులో... ప్రధాన బ్యాంకులు దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్బీఐ కోరింది కూడా. అయితే అధార్ అనుసంధానం పూర్తయిన తర్వాతే పోర్టబులిటీపై నివేదికను సమర్పిస్తామని తెలంగాణకు చెందిన నోడల్ బ్యాంక్ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 80 శాతం ఎస్బీఐ ఖాతాలకు ఆధార్ అనుసంధానం పూర్తయిందని, మరో నెల రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్, డాటాబేస్‌తో సవాళ్లు.. అకౌంట్ పోర్టబిలిటీ అనేది బ్యాంకులకు సవాలే. ఎందుకంటే ఖాతా ప్రారంభంలో చేసే ఫైల్ స్ట్రక్చర్, బ్యాంకులు వినియోగించే సాఫ్ట్వేర్లను మార్చాల్సి ఉంటుంది. అన్ని బ్యాంకులూ ఒకే డేటాబేస్‌ను వినియోగించాలి. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. ప్రస్తుతం దేశంలోని అన్ని బ్యాంక్‌లూ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్, ఫినాకిల్, ఫ్లెక్స్క్యూబ్ సాఫ్ట్వేర్లను వినియోగిస్తున్నాయి. 60 శాతానికి పైగా బ్యాంక్‌లు కోర్ బ్యాంకింగ్ సాంకేతికతనే వినియోగిస్తున్నాయని వీటిని టీసీఎస్, ఇన్ఫోసిస్ అభివృద్ధి చేశాయని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. అలాగే బ్యాంక్‌లకు సంబంధించిన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (ఐఎఫ్ఎస్సీ), మొబైల్ మనీ ఐడెంటిఫియర్ (ఎంఎంఐడీ)లల్లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే వాటి అభివృద్ధి పనులను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి (ఎన్పీసీఐ) అప్పగించారని కూడా తెలిసింది. ఇప్పటికే ఎన్పీసీఐ భీమ్, ఐఎంపీఎస్, యూపీఐ వంటి సాంకేతికతను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అకౌంట్ నంబర్లు కూడా సమస్యే.. కస్టమర్ల సంఖ్య ఆధారంగా బ్యాంక్ స్థాయిని బట్టి ఖాతా నంబరు 10 నుంచి 20 అంకెలుంటుంది. ఎందరు కస్టమర్లుంటే అన్ని డిజిట్స్ పెరుగుతాయన్న మాట. ఉదాహరణకు సిటీ బ్యాంక్ ఖాతాకు 10 అంకెలు, ఎస్బీఐకు 11, ఐసీఐసీఐకి 12, హెచ్‌డీఎఫ్‌సీకి 14, అత్యధికంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఖాతాకు 16 అంకెలున్నాయి. పోర్టబిలిటీలో అన్ని బ్యాంక్ ఖాతాల నంబర్ల సంఖ్య సమానంగా ఉండాలి. ఇది బ్యాంక్ సాఫ్ట్వేర్ అభివృద్ధి సంస్థలకు కొంత సవాలే అయినప్పటికీ గతంలో సక్సెసయ్యారు కనుక సులువయ్యే అవకాశముందనేది నిపుణుల మాట. గతంలో భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) ఎస్బీఐలో విలీనమైనప్పుడు రెండు బ్యాంకుల నంబర్ల సంఖ్యను మ్యాపింగ్ చేశారు. బీఎంబీకి 12 అంకెలు, ఎస్బీఐకి 11 అంకెలుండేవి. విలీనం తర్వాత రెండు బ్యాంకుల ఖాతాలకూ 11 అంకెలనే కేటాయించారు. బ్యాంకుల మధ్య పోటీ పెరుగుతుంది.. ప్రపంచ దేశాల్లో ఎక్కడా బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ లేదు. ఇక్కడ అందుబాటులోకి తెస్తే ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో భారత్ తొలి దేశమవుతుంది. పోర్టబిలిటీతో బ్యాంకుల మధ్య పోటీ పెరుగుతుంది. పాత కస్టమర్లను కాపాడుకుంటూనే కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో భాగంగా మెరుగైన, వేగవంతమైన సేవలందిస్తాయి. తక్కువ చార్జీలుండే బ్యాంకులకు మళ్లే ప్రమాదం ఉంటుంది కనుక బ్యాంకులు కూడా చార్జీలను, వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఇక ఒకటే బ్యాంక్‌లో ఒకటే ఖాతాను తీసుకొస్తే చాలా బ్యాంకుల్లో నగదు ప్రవాహం తగ్గిపోతుంది. డిపాజిట్లు, లావాదేవీలు తగ్గి చిన్న బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు కనుమరుగయ్యే ప్రమాదముంది. ఇదీ... దేశీ బ్యాంకింగ్ స్వరూపం మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ బ్యాంకులు 12,100 ఈ మూడు రకాలకూ ఉన్న మొత్తం బ్రాంచీలు 1,35,946 మొత్తం పొదుపు ఖాతాల సంఖ్య 38.8కోట్లు మొత్తం కరెంట్ ఖాతాలు 2.83కోట్లు మొత్తం జన్‌ధన్ ఖాతాలు 30.6కోట్లు బహుళ అకౌంట్లు (అంచనా) 1617కోట్లు శ్రీనాథ్ ఆడెపు (హైదరాబాద్, బిజినెస్ బ్యూరో) -
హెల్త్ పాలసీనీ మార్చుకోవచ్చు!
► మొబైల్ నంబర్ మాదిరే ఇక్కడా పోర్టబిలిటీ ► సేవలు నచ్చకుంటే వేరే సంస్థకు మారే అవకాశం ► అదే సంస్థలో వేరే ప్లాన్‌కూ మారిపోవచ్చు ►వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లకు వెసులుబాటు మొబైల్ కంపెనీ అందించే సేవలు నచ్చకపోతే నంబరుతో సహా వేరే కంపెనీకి మారిపోయే వెసులుబాటు ఇప్పుడొచ్చింది. ఈ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ... ఇపుడు ఆరోగ్య బీమా పాలసీలకూ అందుబాటులోకొచ్చింది. అంటే... ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సర్వీసులు నచ్చకపోతే మరోదానికీ మారొచ్చు. లేదా మనకు అనువైనదిగా ఉంటే అదే కంపెనీ ఆఫర్ చేసే మరో పాలసీకి కూడా మారిపోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ ప్రయోజనాలు, పోర్టబిలిటీ ప్రక్రియ మొదలైన అంశాల గురించి వివరించేదే ఈ కథనం. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీల్లో ప్రీ–ఎగ్జిస్టింగ్ కండీషన్స్‌కి సంబంధించి కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే మనం పాలసీ తీసుకునే నాటికే దాని పరిధిలోకి రాని ఆరోగ్య సమస్యేదైనా ఉంటే.. కొంత కాలం తర్వాత బీమా కంపెనీ సదరు ఆరోగ్య సమస్యకి కూడా కవరేజీ ఇచ్చే వెసులుబాటు ఒకటుంది. నిర్దిష్ట కాలం దాకా నిరీక్షించే పాలసీదారుకు మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. గతంలో ఒకవేళ గడువులోగా వేరే కంపెనీ పాలసీ తీసుకుని ఉంటే.. అప్పటి దాకా నిరీక్షణ రూపంలో వచ్చిన ప్రయోజనాలు దక్కకపోగా.. మళ్లీ కొత్త కంపెనీలో ఆయా ఆరోగ్య సమస్యలకు కవరేజీ కోసం మళ్లీ నిరీక్షించాల్సి వచ్చేది. లేదా అదే కంపెనీలో మనకు అనువైన మరో పాలసీకి మారినా .. అప్పటిదాకా జమయిన క్రెడిట్స్ పాయింట్స్‌ను వదులుకోవాల్సి వచ్చేది. అయితే, తాజాగా పోర్టబిలిటీ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి సమస్య తీరిపోయింది. కంపెనీని మార్చినా లేదా అదే సంస్థలో వేరే ప్లాన్‌కి మారినా అప్పటిదాకా జమయిన క్రెడిట్స్ కొనసాగుతున్నాయి. దీంతో ఆయా ఆరోగ్య సమస్యల కవరేజీ కోసం మళ్లీ మొదటి నుంచి నిరీక్షించాల్సిన పని లేకుండా.. సత్వరమే ప్రయోజనం పొందే వెసులుబాటు దొరుకుతుంది. ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ఫ్లోటర్‌తో పాటు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నింటికీ ఈ పోర్టబిలిటీ ఆప్షన్ వర్తిస్తుంది. అయితే, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీకి వస్తే.. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారే అవకాశం లేకపోయినప్పటికీ.. అదే సంస్థలో వేరే ప్లాన్‌కి మారేందుకు వీలుంది. ఈ కింది సందర్భాల్లో పోర్టబిలిటీని ఎంచుకోవచ్చు.. ♦ ప్రస్తుత ఆరోగ్య బీమా సంస్థ అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా లేకపోతే. ♦ నిర్దిష్ట ఆరోగ్య సమస్యలకు ప్రస్తుతమున్న కవరేజీ సరిపోదని భావించిన పక్షంలో; అలాగే ప్రస్తుత కంపెనీ అంతకు మించిన కవరేజీ ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోయినా.. ♦ మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ చాలా మందకొడిగా ఉన్నా లేక క్లెయిమ్ సెటిల్మెంట్ చరిత్ర బాగా లేకపోయినా.. ♦ ప్రస్తుత ఆరోగ్య బీమా సంస్థ అందిస్తున్న పాలసీలకన్నా మార్కెట్లో మరింత తక్కువ ప్రీమియంకే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు లభించే పాలసీ దొరుకుతున్నా.. పోర్టబిలిటీకి గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ఫ్లోటర్, గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలకు పోర్టబిలిటీ అవకాశం ఉంటుంది. అయితే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల విషయానికొస్తే.. బీమా కంపెనీని మార్చుకునే అవకాశం లేకపోయినప్పటికీ.. అదే సంస్థలో గ్రూప్ ఇన్సూరెన్స్ నుంచి ఇండివిడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకానికి మారే వెసులుబాటు ఉంది. అదే వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను మాత్రం అదే కంపెనీలో వేరే పాలసీలకైనా మార్చుకోవచ్చు లేదా ఇతర ఇన్సూరెన్స్ కంపెనీకైనా మారొచ్చు. ఇందుకోసం 45 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుత పాలసీ ప్రీమియం రెన్యువల్ తేదీ కన్నా 45 రోజుల కన్నా ముందుగా (అరవై రోజులు దాటకుండా) మాత్రమే పోర్టింగ్ దరఖాస్తును సదరు ఇన్సూరెన్స్ సంస్థకు అందించాలి. పోర్టింగ్కి సంబంధించిన గడువు నిబంధనలకు విరుద్ధంగా మీ దరఖాస్తు ఉందని భావించిన పక్షంలో బీమా కంపెనీ దాన్ని తిరస్కరించవచ్చు. కాబట్టి, ఎప్పుడు పడితే అప్పుడు పాలసీని పోర్టింగ్ చేసుకునేందుకు వీలుండదు. ఇండివిడ్యువల్ నుంచి ఫ్యామిలీ ఫ్లోటర్‌కి లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ నుంచి ఇండివిడ్యువల్కి కూడా పాలసీని పోర్టింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటోంది. ఇది చాలా మందికి ఊరట కలిగించే విషయం. ఉదాహరణకు పెళ్లి కాక ముందు ఇండివిడ్యువల్ పాలసీ ఉన్నా.. వివాహమయ్యాక ఫ్యామిలీ ఫ్లోటర్‌కి మారాల్సి వస్తుంది. ఒకవేళ మీ ప్రస్తుత బీమా కంపెనీ పాలసీలు మీకు అనుకోండి వేరే సంస్థకు మారొచ్చు. అయితే, ఒక్క విషయం.. అప్పటిదాకా అది వ్యక్తిగత పాలసీగానే ఉన్నందు వల్ల .. పాలసీ పరిధిలోకి అప్పటిదాకా రాని ఆరోగ్య సమస్యలకు సంబంధించిన క్రెడిట్స్ అనేవి సదరు పాలసీదారువి మాత్రమే కొనసాగుతాయి. కొత్తగా పాలసీలోకి చేర్చిన జీవిత భాగస్వామికి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ లాంటివి మళ్లీ కొత్తగానే మొదలవుతాయి. అదే, ఫ్యామిలీ ఫ్లోటర్ నుంచి ఇండివిడ్యువల్ పాలసీకి మారాల్సి వచ్చే సందర్భాలూ ఎదురుకావొచ్చు. ఉదాహరణకు కుటుంబ సభ్యుల్లో ఒకరికి తరచూ అనారోగ్యం బారిన పడుతుండటం వల్ల తరచూ క్లెయిమ్స్ చేయాల్సి వస్తుండవచ్చు. దీంతో మొత్తం పాలసీలోని కుటుంబసభ్యులందరికీ పూర్తి ప్రయోజనాలు లభించకుండా పోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు తరచూ అనారోగ్యం బారిన పడే మెంబర్ పేరును ఫ్యామిలీ ఫ్లోటర్ నుంచి తొలగించి ప్రత్యేకంగా వారి పేరున ఇండివిడ్యువల్ పాలసీని తీసుకోవడం శ్రేయస్కరం. మిగతా కుటుంబసభ్యులకు ప్రస్తుత ఫ్యామిలీ ఫ్లోటర్ బీమా కవరేజీ యథాప్రకారం కొనసాగుతుంది. ప్రీమియం క్రమం తప్పకుండా కడితేనే.. పాలసీ ప్రీమియంలు క్రమం తప్పకుండా కడుతుంటేనే పోర్టింగ్ అవకాశం ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా సరే ప్రీమియం క్రమం తప్పకుండా కట్టకపోవడం వల్ల పాలసీకి బ్రేక్ వచ్చిదంటే అవకాశం కోల్పోయినట్లే. ప్రీమియం గడువు తేదీ ముందుగా ప్రాసెస్ కాకపోతే.. నిర్దేశించిన విధంగా 45 రోజుల కన్నా ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ ఎంచుకున్నప్పటికీ.. ఆఖరి రోజున కూడా మీ దరఖాస్తు కొత్త బీమా కంపెనీ దగ్గర పెండింగ్‌లోనే ఉన్న పక్షంలో బీమా రక్షణ కోల్పోకుండా మీకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రస్తుత బీమా కంపెనీ దగ్గర పాలసీ గడువును గరిష్టంగా నెల రోజుల పాటు పొడిగించుకునేందుకు వీలు ఉంటుంది. పొడిగించుకున్న వ్యవధికి మాత్రమే ప్రీమియం కడితే సరిపోతుంది. అయితే, ఈలోగానే ఏదైనా క్లెయిమ్ తలెత్తిన పక్షంలో.. పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా కంపెనీ చెల్లింపులు జరుపుతుంది. కానీ, అలాంటప్పుడు పాత కంపెనీకే పూర్తి ఏడాది ప్రీమియంను కట్టాల్సి వస్తుంది. క్లెయిమ్ చేసిన తర్వాత ఇక ఆ ఏడాదంతా అదే సంస్థ పాలసీనే కొనసాగించాల్సి వస్తుంది. వేరే సంస్థకు పోర్టింగ్ అవకాశం ఉండదు. ఇక, పోర్టింగ్ సంబంధించి కొత్త సంస్థ నుంచి రూఢీగా పాలసీ జారీ అయితే గానీ లేదా పాలసీదారు నుంచి రాతపూర్వకంగా అభ్యర్ధన వస్తే గానీ ప్రస్తుత బీమా సంస్థ.. పాలసీని రద్దు చేయడానికి లేదు. సమ్ అష్యూర్డ్లోకే నో క్లెయిమ్ బోనస్ కూడా .. ఉదాహరణకు మీ ప్రస్తుత పాలసీ కవరేజీ రూ. 2 లక్షలు కాగా మీకు నో–క్లెయిమ్ బోనస్ కింద రూ. 50,000 వచ్చిందనుకోండి. పోర్టబిలిటీ ఎంచుకున్నప్పుడు కొత్త బీమా సంస్థ.. ప్రస్తుత సమ్ అష్యూర్డ్‌తో పాటు బోనస్‌ని కూడా కలిపి ప్రీమియం లెక్కేస్తుంది. అంటే.. పాలసీని పోర్ట్ చేసినప్పుడు రూ. 2 లక్షలు కాకుండా రూ. 2,50,000 కవరేజీకి ప్రీమియం కట్టాల్సి వస్తుంది. కొత్త సంస్థ మీ దరఖాస్తు తిరస్కరించవచ్చు.. పోర్టబిలిటీ అనేది పాలసీదారు హక్కే అయినప్పటికీ.. బీమా కంపెనీలు కచ్చితంగా పోర్టింగ్ వచ్చిన ప్రతి పాలసీనీ అంగీకరించి తీరాలనేమీ లేదు. కొత్త కంపెనీ మీ దరఖాస్తును కొత్తదానిలాగే పరిగణిస్తుంది. ఒకవేళ రిస్కులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే తిరస్కరించనూ వచ్చు కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షలకు సిఫార్సు చేయొచ్చు. అయితే ఏ నిర్ణయమైనా సరే మీరు పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా మీకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ గడువు దాటిన పక్షంలో తిరస్కరించడానికి ఉండదు. ప్రక్రియ ఇలా.. అవసరమైన పత్రాలతో పోర్టింగ్ దరఖాస్తును సమర్పించాక, కొత్త బీమా సంస్థ మీ మెడికల్, క్లెయిమ్‌ల హిస్టరీ గురించి ప్రస్తుత బీమా సంస్థ నుంచి సమాచారం సేకరిస్తుంది. ఇదంతా బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ వెబ్ సైట్ ద్వారా జరుగుతుంది. కొత్త సంస్థ నుంచి అభ్యర్ధన వచ్చిన వారం రోజుల్లోగా మీ ప్రస్తుత సంస్థ సదరు సమాచారాన్ని ఐఆర్డీఏకి అందించాల్సి ఉంటుంది. లేకపోతే నిబంధనలు ఉల్లంఘించినట్ల వుతుంది. ప్రస్తుత సంస్థ నుంచి వివరాలు వచ్చాక, కొత్త సంస్థ అండర్‌రైటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తుంది. పాలసీదారు నుంచి దరఖాస్తు వచ్చిన 15 రోజుల్లోగా తమ నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పోర్టబిలిటీ కోసం ప్రత్యేక చార్జీలేమీ ఉండవు. పూర్తిగా ఉచితం. కావల్సిన పత్రాలు.. ♦ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ♦ గడిచిన ఏడాదిలో క్లెయిమ్స్ లేకపోతే ఆ విషయాన్ని స్వయంగా ధృవీకరిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్. ♦ ఒకవేళ క్లెయిమ్ ఉంటే, డిశ్చార్జి సమ్మరీ, చికిత్స, రిపోర్టు కాపీలు మొదలైనవి. ♦ కీలకమైన అనారోగ్య సమస్యలేమైనా గతం నుంచీ ఉంటే వైద్యులతో కన్సల్టేషన్ పత్రాలు, ప్రిస్క్రిప్షన్లు, చికిత్స రిపోర్టులు. ♦ పోర్టబిలిటీ దరఖాస్తు ఫారం ♦ ఇవి కాకుండా సదరు బీమా సంస్థ ఇతరత్రా పత్రాలేమైనా కోరిన పక్షంలో అవి. పోర్టబిలిటీ ప్రయోజనాలు.. ♦ కొత్త సంస్థ నుంచి మెరుగైన సేవల అంచనాలు. ♦ సముచిత ప్రీమియానికి మెరుగైన పాలసీ ♦ భవిష్యత్ అవసరాలను బట్టి పాలసీని తీర్చిదిద్దుకునే అవకాశం. ప్రతికూలతలు.. ♦ రెన్యువల్ సమయంలో మాత్రమే పోర్టింగ్‌కు అవకాశం. ♦ నో–క్లెయిమ్ బోనస్ ఉచితంగానే పోగుపడినా.. కొత్త సంస్థ దాన్ని కూడా సమ్ ఇన్సూర్డ్ కింద చేర్చడం వల్ల ప్రీమియం భారం పెరగడం. ♦ కొత్త బీమా సంస్థ మళ్లీ మీ రిస్కును తమ తమ పద్ధతుల్లో బేరీజు వేసుకుని మళ్లీ కొత్తగా ప్రీమియంలు నిర్ణయించడం. -
రేషన్ ‘పోర్టబిలిటీ’..
ఇక ఎక్కడనుంచైనా సరుకుల పంపిణీ నేటి నుంచి 12 సర్కిల్స్‌లో అమలు సిటీబ్యూరో: నగరంలో ఇక ఎక్కడినుంచైనా రేషన్ సరుకులు తీసుకునే సౌలభ్యం వచ్చింది. చత్తీస్గడ్ తరహాలో లబ్ధిదారులు వారు నివసిస్తున్న ప్రాంతమే కాకుండా ఇతర ఏరియాల్లోనూ సరుకులు తీసుకునే పోర్టబిలిటీ విధానానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ–పాస్ పద్ధతిలో సరుకుల పంపిణీ అమలవుతుండటంతో లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు గురువారం నుంచి పోర్టబిలిటీ విధానాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆధార్ అనుసంధానంతో ఈ–పాస్ బయోమెట్రిక్‌లో లబ్ధిదారుల పూర్తిస్థాయి డేటా ఫీడ్ కావడంతో వేలిముద్రలతో రేషన్ సరుకులు ఎక్కడ నుంచైనా తీసుకునే వెసులుబాటు కలిగినట్లయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో పన్నెండు అర్బన్ సర్కిల్ ఉండగా వాటి పరిధిలో సుమారు 1545 షాపులు ఉన్నాయి. అందులో సుమారు 11.24 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డుదారులు ఉన్నారు. వాటిలో హైదరాబాద్ అర్బన్ పరిధిలోని తొమ్మిది సర్కిల్స్‌లో 5.86 లక్షలు, రంగారెడ్డి అర్బన్ పరిధిలో ఒక సర్కిల్లో 1.84 లక్షలు, మేడ్చల్ అర్బన్ పరిధిలో రెండు సర్కిల్స్‌లో 3.54 లక్షల కార్డుదారులు ఉన్నారు. ప్రస్తుతం అన్ని దుకాణాల్లో ఈ–పాస్ అమలవుతుండటంతో ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునే విధంగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. కోటా కేటాయింపు ఎలా? ఎక్కడ నుంచైనా సరుకులు పంపిణీ అమలుకు కోటా కేటాయిపుపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. షాపునకు కేటాయించిన రేషన్‌కార్డు దారుల కంటే అధిక శాతమైతే కోటా ఎలా సర్దుబాటు చేయాలనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ–పాస్ అమలు కారణంగా సుమారు 30 నుంచి 40 శాతం వరకు సరుకు మిగులుబాటు అవుతున్న కారణంగా దానిని సర్ధుబాటు చేయవచ్చని అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు గోదాముల్లో స్టాక్ పెట్టి అవసరమైన షాపుల డిమాండ్‌నుబట్టి సరుకులు సరఫరా చేస్తామని కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. -
సేవలు నచ్చలేదా...బ్యాంక్ మార్చెయ్!
♦ బ్యాంకు ఖాతాకూ పోర్టబిలిటీ! ♦ అకౌంట్ నంబర్ మాత్రం అదే... ♦ ఈ దిశగా బ్యాంకులు అడుగులు వేయాలన్న ఆర్బీఐ ముంబై: మొబైల్ నంబర్ మారకుండా టెలికం కంపెనీని మార్చేసినట్టుగానే... సేవలు బాగోలేని బ్యాంకుకు గుడ్‌బై చెప్పేసి అదే ఖాతా నంబర్‌తో మరో బ్యాంకు శాఖకు మారిపోయే రోజు భవిష్యత్తులో సాకారం కానుంది. అప్పటి వరకూ మీకున్న రుణ చరిత్రను కోల్పోవాల్సిన పని కూడా లేదు. ఈ దిశగా బ్యాంకులు అడుగులు వేయాలని ఆర్బీఐ సూచించింది. ముంబైలో మంగళవారం బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) నిర్వహించిన సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా పాల్గొన్నారు. బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వలు, వాటిపై చార్జీలు, బ్యాంకు ఖాతా పోర్టబులిటీ సహా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఖాతా పోర్టబిలిటీ సాధ్యమే... ‘‘గత రెండు సంవత్సరాల్లో ఆధార్ నమోదు కార్యక్రమం చోటు చేసుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌లను రూపొందించింది. పలు యాప్‌లను కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నింటి దృష్ట్యా ఖాతా నంబర్ పోర్టబిలిటీకి చాలా అవకాశం ఉంది’’ అని ముంద్రా పేర్కొన్నారు. ఆర్బీఐ నియంత్రనపరమైన సూచన కాకుండా, బ్యాంకింగ్ రంగంలోని భాగస్వాములు అందరి ఉమ్మడి కృషితో ఈ సౌకర్యం అమల్లోకి వస్తే మంచిదన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీన్ని పరిశీలనలోకి తీసుకుని, అమలు దిశగా పనిని ప్రారంభించాలని ముంద్రా సూచించారు. తప్పనిసరైన ఈ పరిస్థితికి బ్యాంకులు సిద్ధం కావాలని, దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఖాతా నంబర్ పోర్టబిలిటీ ఏ విధంగా అమలు చేయాలన్న దానిపై ఆలోచన చేయాలన్నారు. పోర్టబులిటీ ఆచరణలోకి వస్తే కస్టమర్ కనీసం మారు మాట్లాడకుండానే సులభంగా బయటకు వెళ్లిపోవడం అనుభవంలోకి వస్తుందన్నారు. బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, మొబైల్ నంబర్ ఐడెంటిఫయర్ (ఎంఎంఐడీ) ఈ తరహా ఎన్నో నంబర్లు ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్నాయి. అయితే, ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆధార్ చెల్లింపుల విధానంలో బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్‌ను అనుసంధానిస్తే, లావాదేవీలన్నీ ఆధార్ నంబర్ ఆధారంగానే జరుగుతాయి. ముంద్రా గతంలోనూ ఖాతా నంబర్ పోర్టబిలిటీని ప్రతిపాదించారు. ఇది ఆచరణలోకి వస్తే ఈ సదుపాయం కలిగిన తొలి దేశం మనదే అవుతుంది. ఒకే బ్యాంకు పరిధిలో ఒక శాఖ నుంచి మరో శాఖకు అదే ఖాతా నంబర్‌తో మారే సదుపాయం కల్పించాలని ఆర్బీఐ 2012 ఏప్రిల్‌లోనే బ్యాంకులను కోరింది. సామాన్యులకు సేవలను నిరాకరించరాదు ఖాతాల్లో కనీస నగదు నిల్వలు ఎంతుండాలి, ప్రీమియం సేవలపై చార్జీలను నిర్ణయించుకునే స్వేచ్ఛను బ్యాంకులకు ఇవ్వడం జరిగిందని... కానీ, సామాన్యులకు సేవలను నిరాకరించడం, దూరం చేయడం కోసం వీటిని వినియోగించుకోరాదని ముంద్రా అన్నారు. కొన్ని బ్యాంకుల్లో ఈ చర్యలను తాము గమనించినట్టు చెప్పారు. ‘‘కొన్ని సేవలకు చార్జీలను వసూలు చేయడం వల్ల నష్టం లేదు. కానీ, కొందరు కస్టమర్లను దూరంగా ఉంచేందుకు ఈ తరహా నిబంధనలు రూపొందించలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. అందరికీ బ్యాంకు సేవలను అందుబాటులో ఉంచడంపైనే తమ దృష్టిగానీ, ఈ తరహా సేవలకు బ్యాంకులు ఎంత చార్జీలు వసూలు చేస్తున్నాయన్నదానిపై కాదని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ మోసాల నుంచి కస్టమర్లకు రక్షణ ఎలక్ట్రానిక్ విధానంలో జరిగే మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారులకు రక్షణ కల్పించే దిశగా ఆర్బీఐ త్వరలో తుది మార్గదర్శకాలు తీసుకురానుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా చెప్పారు. ఖాతాదారుడి ప్రమేయం లేకుండా అనధికారికంగా జరిగే లావాదేవీల్లో... ఖాతాదారుడి బాధ్యతను పరిమితం చేయనున్నట్టు చెప్పారు. వాస్తవానికి ముసాయిదా మార్గదర్శకాలను ఆర్బీఐ గతేడాది ఆగస్ట్‌లోనే విడుదల చేసి, అభిప్రాయాలను స్వీకరించింది. భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా తుది మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని ముంద్రా తెలిపారు. మోసపూరిత లావాదేవీల గురించి రిపోర్ట్ చేసేందుకు కాల పరిమితి, ఖాతాదారులు, బ్యాంకుల బాధ్యతను మార్గదర్శకాల్లో పొందుపరుస్తామని చెప్పారు. బ్యాంకులు సైతం తమ ఐటీ భద్రతా వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని సూచించారు. -
టెల్కోలు పోర్టబిలిటీ నిబంధనలను అతిక్రమిస్తున్నాయి
రిలయన్స్ జియో ఆరోపణ న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు యూజర్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీని అడ్డుకుంటున్నాయని రిల యన్స్ జియో ఆరోపించింది. ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి సంస్థలు.. వారి కస్టమర్లు కొత్త నెట్వర్క్కి మారడానికి రిక్వెస్ట్‌లు పంపితే వాటిని అంగీకరించలేదని పేర్కొంది. ఇవి సెప్టెంబర్ 9 నుంచి 12 మధ్య కాలంలో పోర్టబిలిటీ కోసం చేసిన రిక్వెస్ట్‌లను తిరస్కరించాయని వివరించింది. ఇవి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల నుంచి వచ్చిన 4,919 రిక్వెస్ట్‌లకు అదనమని పేర్కొంది. ఇలాంటి చర్యలు లెసైన్స్ నిబంధనలకు విరుద్ధమని తెలియజేసింది. టెల్కోలు లెసైన్స్ నిబంధనలను కచ్చితంగా అమలుచేసేలా చూడాలని ట్రాయ్‌ని కోరింది. ఈ మేరకు జియో ఈ అంశాలను ప్రస్తావిస్తూ ట్రాయ్‌కి ఒక లేఖ రాసింది. టెల్కోలు నిబంధనలను అమలు చేయని పక్షంలో వాటి లెసైన్స్‌ను రద్దు చేయాలని తెలిపింది. అయితే ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థలు ఈ అంశమై ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఎక్కడైనా.. ఎప్పుడైనా రేషన్
* త్వరలో అమలులోకి రానున్న పోర్టబిలిటీ * ‘తూర్పు’ నుంచే పైలట్ ప్రాజెక్టు! సాక్షి, రాజమండ్రి : బడుగులకు రేషన్ పంపిణీ విధానంలో సంస్కరణలు తేవడమే కాకుండా ఆధార్ అనుసంధానంతో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు మరో కొత్త ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా రేషన్ కార్డు పోర్టబిలిటీ విధానం అమలులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో వంద దుకాణాల్లో అమలవుతున్న ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సర్వీస్ (ఈపీఓఎస్) వచ్చే నెల 15 నుంచి జిల్లా అంతటా అమలు చేస్తున్నారు. ఈ విధానం కూడా జిల్లాలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడే ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన అమలులోకి తేనున్న ఈ విధానానికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ గ్రీన్‌సిగ్నల్ కూడా లభించింది. పోర్టబిలిటీ అంటే.. ఇదొక స్మార్ట్ కార్డు తరహా విధానం. స్మార్ట్ కార్డుల ద్వారా ఆన్లైన్ విధానంలో ఎలా సేవలు పొందుతామో, అలాగే ఏ ఊళ్లో లేదా, ఏ జిల్లాలో నుంచైనా సరకులు తెచ్చుకునే వీలుంటుంది. ఇప్పటి వరకు రేషన్ దుకాణాల్లోనే సరకులు తెచ్చుకునే వారు. ప్రతి నెలా 18లోగా తెచ్చుకోకపోతే అవి వెనక్కి వెళ్లిపోతాయి. ఇలాంటి ఇబ్బందులు ఈ విధానంలో ఉండవు. ఏ రేషన్ దుకాణం నుంచైనా ఎప్పుడైనా సరకులు తెచ్చుకోవచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. సమీపంలోని రేషన్ దుకాణం నుంచి సరకు తెచ్చుకోవచ్చు. సాధ్యమేనంటున్న అధికారులు జిల్లాలో 99 శాతం రేషన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఆ డేటా అంతా సెంట్రలైజ్డ్ విధానంలో ప్రధాన సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. ఆధార్ నంబరును పరీక్షించి, ఆన్లైన్ చేస్తారు. కార్డు నంబరు రేషన్ దుకాణంలో ఫీడ్ చేస్తే లబ్ధిదారుడి వివరాలు లభ్యమవుతాయి. కేటాయించిన మేరకు సరకు ఇస్తే ఆ వివరాలు అక్కడే ఆన్లైన్లో నమోదవుతాయి. ఏ దుకాణంలో పరిశీలించినా.. ఆ వివరాలు తెలుస్తాయి. దీంతో మరోచోట సరకులు తీసుకునే వీలుండదు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతా సరళీకృతం జిల్లాలో దాదాపు 2700 రేషన్ దుకాణాలున్నాయి. వీటిలో ప్రతీ నెలా ఒకటి నుంచి 18వ తేదీ వరకూ సరకులు ఇస్తారు. తర్వాత 19న డీలర్లు వాటి రికార్డులు సమర్పిస్తారు. కొత్తగా వచ్చే సరకు కోసం డీడీలు తీస్తారు. 20 నుంచి 30 వరకూ డీలర్లకు సరకు చేరుతుంది. కొత్త విధానం వల్ల ఈ వంతుల వారీ పద్ధతులు ఉండవు. డీలర్లకు సరకు పరిమితి తొలగిస్తారు. రోజుకు ఎన్ని కార్డులకు, ఎంత సరకు ఇచ్చారో ఆన్లైన్లో గణాంకాలు స్పష్టమవుతాయి. రాజమండ్రిలో ఈపీఓఎస్పై అధికారులతో నిర్వహించిన సమీక్షలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ ఎదుట జిల్లా మేనేజర్ కుమార్ ఈ ప్రతిపాదన ఉంచారు. ముందుగా ఇక్కడి నుంచే ఒకేసారి ఈ విధానం ప్రారంభించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా అమలయ్యాక రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. -
మన గ్యాస్..మన ఇష్టం
సాక్షి, ఏలూరు:గ్యాస్ సిలిండర్ సకాలంలో డెలివరీ కావడం లేదా.. అధిక ధర వసూలు చేస్తున్నారా.. తూకం తక్కువ ఉంటోందా.. మీ ఇంటికి గ్యాస్ ఏజెన్సీ దూరంగా ఉందా.. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ గ్యాస్ కనెక్షన్‌ను సంబంధిత ఏజెన్సీ/కంపెనీ నుంచి మరో ఏజెన్సీ/కంపెనీకి మార్చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ పేరిట వినియోగదారులందరికీ ఈ అవకాశం లభించింది. గ్యాస్ పోర్టబిలిటీ విధానం రాష్ట్రంలోని 19 జిల్లాలకు బుధవారం నుంచి అందుబాటులోకి రాగా, ఆ జాబితాలో మన జిల్లా కూడా ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో వినియోగదారులు తమకు నచ్చిన ఏజెన్సీ నుంచి, తాము కోరుకున్న ఎల్పీజీ కంపెనీ నుంచి గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. దీనివల్ల గ్యాస్ కంపెనీల గుత్తాధిపత్యానికి,ప్రజల సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఆగడాలకు అడ్డుకట్ట జిల్లాలో 48 గ్యాస్ ఏజన్సీల పరిధిలో దాదాపు 9.50 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నారుు. వీటిలో సుమారు 80వేల గృహ వినియోగ కనెక్షన్లు బ్లాక్ మార్కెటీర్ల చేతుల్లో ఉన్నాయి. బ్లాక్ మార్కెట్లో రూ.1,200 నుంచి రూ.1,500 చెల్లిస్తే తప్ప సిలిండర్ దొరకడం లేదు. డీలర్లే దీనిని పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వినియోగదారులను డీలర్లు అనేక ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఒక్కో ఏజెన్సీకి పరిమితికి మించి కనెక్షన్లు ఉండటం వల్ల వారు ఎవరికీ జవాబుదారీగా ఉండరు. గ్యాస్ సిలిండర్లలోని కొంత గ్యాస్‌ను బయటకు తీసి అమ్మేసుకుంటున్న ఘటనలు ఉన్నారుు. దీనిని అరికట్టేందుకు చమురు సంస్థలు కొత్త విధానాలను తీసుకువస్తున్నాయి. దానిలో భాగంగా అక్రమ గ్యాస్ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కూడా కల్పించాయి. తాజాగా కల్పించిన సౌకర్యంతో గ్యాస్ కంపెనీల మధ్య, డీలర్ల మధ్య పోటీ పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశాలున్నాయి. మరోవైపు బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మార్చుకోండిలా... గ్యాస్ కనెక్షన్ పోర్టబిలిటీ చాలా సులభం. వినియోగదారులు ఇంటర్నెట్లో గ్యాస్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి క్లస్టర్లో లభించే ప్రతి కంపెనీ డిస్ట్రిబ్యూటర్లను చూడొచ్చు. గతంలో కల్పించిన స్టార్ రేటింగ్ ద్వారా డీలర్ల పనితీరును తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా కంపెనీ, డిస్ట్రిబ్యూటర్ను ఎంపిక చేసుకోవచ్చు. పాత డిస్ట్రిబ్యూటర్‌కు ఎక్విప్మెంట్ను తిరిగి ఇచ్చేసి, కొత్త డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి కొత్త సిలిండర్, రెగ్యులేటర్ తీసుకోవాలి. కంపెనీ మార్చుకోకుండా ఒకే కంపెనీలో వేరే డిస్ట్రిబ్యూటర్‌కు మారితే సిలిండర్, రెగ్యులేటర్ స్వాధీనం చేయూల్సిన అవసరంలేదు. వ్యతిరేకతను తట్టుకునేందుకేనా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయనే సాకుతో ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఇస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ సంఖ్యను తొమ్మిదికి పెంచింది. తొమ్మిది సిలిండర్ల వరకూ ప్రభుత్వం దాదాపు రూ.843 సబ్సిడీ ఇస్తోంది. దానికి ఆధార్ లింకుపెట్టి సరిగ్గా ఇవ్వడం లేదు. మరోవైపు సబ్సిడీ లేని సిలిండర్ ధరలను ఏడాదిగా పెంచుతూనే ఉన్నారు. గతేడాది జనవరిలో రూ.46.50 పైసలు పెంచారు. దీనివల్ల జిల్లా గ్యాస్ వినియోగదారులపై రూ.4 కోట్ల భారం పడింది. ఏడాది చివర్లో రాయితీ సిలిండర్‌పై మరో రూ.3 పెంచారు. ఈ ఏడాది ప్రారంభంలో సబ్సిడీ సిలిండర్‌పై రూ.25 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తొమ్మిది సిలిండర్లు దాటి (పదో సిలిండర్ నుంచి) రాయితీ లేని సిలిండరుపై రూ.217 పెంచడంతో ధర రూ.1,326 అయ్యింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.385 పెంచడంతో అదికాస్తా రూ.2,266కి చేరింది. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ ధరలు పెంచి జిల్లా వినియోగదారులపై రూ.11,20,50,00 భారాన్ని మోపారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఓట్లు రాబట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తులు వేస్తోంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీ కోరారని సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను 12కు పెంచుతామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. తాజాగా గ్యాస్ కనెక్షన్ పోర్టబులిటీ నిర్ణయం తీసుకున్నారు. -
ఇక పెట్రోలు బంకుల్లో గ్యాస్ సిలిండర్లు!!
గ్యాస్ కనెక్షన్ ఇంకా రాని సమయంలో చిన్న సిలెండర్లు తీసుకుని, వాటిమీద వంట చేసుకోడం సర్వసాధారణమే. కానీ వాటిని అనధికారికంగా బయట కొనుక్కోవడం, రీఫిల్ చేయించుకోవడమే ఇన్నాళ్లూ మనకు తెలుసు. ఇప్పుడు తొలిసారిగా ఐదు కిలోల సిలిండర్లను పెట్రోలు బంకుల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచాలని చమురు మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ముందుగా మెట్రో నగరాల్లో దీన్ని అమలుచేస్తుంది. దీంతోపాటు.. ఎల్పీజీ కనెక్షన్ పోర్టబులిటీ, కావాలంటే డీలర్లను మార్చుకోవడం లాంటివన్నీ ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. చమురు కంపెనీలు స్వయంగా నిర్వహించే పెట్రోలు బంకుల్లో మాత్రమే ఈ ఐదుకిలోల సిలిండర్లు అందుబాటులో ఉంటాయి. ఇలాంటివి దేశం మొత్తమ్మీద కేవలం 47 వేల బంకులే ఉన్నాయి. అయితే.. వీటి ధర మాత్రం సబ్సిడీ ధర కంటే దాదాపు రెట్టింపు ఉండే మార్కెట్ రేటుకు మాత్రమే ఇస్తారు. ఈనెల ఐదో తేదీన బెంగళూరులో ఈ ఐదు కిలోల సిలిండర్లను చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రారంభిస్తారు. ప్రాథమికంగా ఇవి కేవలం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలకు మాత్రమే పరిమితం. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు కలిసి 1,440 బంకులను ఇందుకోసం ఎంచుకున్నాయి. ఒకచోట నుంచి మరోచోటుకు బదిలీలపై వెళ్లేవారు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఇలాంటివాళ్లకు ఉద్యోగ సమయాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్లకు గ్యాస్ సిలిండర్లు తీసుకోవడం కుదరదు. అలాంటివాళ్లకు ఇది వరంగా ఉటుందని భావిస్తున్నారు.