రేషన్ ‘పోర్టబిలిటీ’..
ఇక ఎక్కడనుంచైనా సరుకుల పంపిణీ
నేటి నుంచి 12 సర్కిల్స్‌లో అమలు
సిటీబ్యూరో: నగరంలో ఇక ఎక్కడినుంచైనా రేషన్ సరుకులు తీసుకునే సౌలభ్యం వచ్చింది. చత్తీస్‌గడ్ తరహాలో లబ్ధిదారులు వారు నివసిస్తున్న ప్రాంతమే కాకుండా ఇతర ఏరియాల్లోనూ సరుకులు తీసుకునే పోర్టబిలిటీ విధానానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ–పాస్ పద్ధతిలో సరుకుల పంపిణీ అమలవుతుండటంతో లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు గురువారం నుంచి పోర్టబిలిటీ విధానాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆధార్ అనుసంధానంతో ఈ–పాస్ బయోమెట్రిక్‌లో లబ్ధిదారుల పూర్తిస్థాయి డేటా ఫీడ్ కావడంతో వేలిముద్రలతో రేషన్ సరుకులు ఎక్కడ నుంచైనా తీసుకునే వెసులుబాటు కలిగినట్లయింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో పన్నెండు అర్బన్ సర్కిల్ ఉండగా వాటి పరిధిలో సుమారు 1545 షాపులు ఉన్నాయి. అందులో సుమారు 11.24 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డుదారులు ఉన్నారు. వాటిలో హైదరాబాద్ అర్బన్ పరిధిలోని తొమ్మిది సర్కిల్స్‌లో 5.86 లక్షలు, రంగారెడ్డి అర్బన్ పరిధిలో ఒక సర్కిల్‌లో 1.84 లక్షలు, మేడ్చల్ అర్బన్ పరిధిలో రెండు సర్కిల్స్‌లో 3.54 లక్షల కార్డుదారులు ఉన్నారు. ప్రస్తుతం అన్ని దుకాణాల్లో ఈ–పాస్ అమలవుతుండటంతో ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునే విధంగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు.
కోటా కేటాయింపు ఎలా?
ఎక్కడ నుంచైనా సరుకులు పంపిణీ అమలుకు కోటా కేటాయిపుపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. షాపునకు కేటాయించిన రేషన్‌కార్డు దారుల కంటే అధిక శాతమైతే కోటా ఎలా సర్దుబాటు చేయాలనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ–పాస్ అమలు కారణంగా సుమారు 30 నుంచి 40 శాతం వరకు సరుకు మిగులుబాటు అవుతున్న కారణంగా దానిని సర్ధుబాటు చేయవచ్చని అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు గోదాముల్లో స్టాక్ పెట్టి అవసరమైన షాపుల డిమాండ్‌నుబట్టి సరుకులు సరఫరా చేస్తామని కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.