Ration merchandise
-
ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్
సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకులను తరలించే లారీలకు జీపీఎస్, వాటి కదలికలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్, ఈ–పాస్ విధానం ద్వారా సరుకుల పంపిణీ... ఇలా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు కళ్లెంవేస్తున్న పౌరసరఫరాల శాఖ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. గత ఏడాది హైదరాబాద్ పౌరసరఫరాల భవన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అత్యుత్తమ ఫలితాలనిస్తుండటంతో క్షేత్రస్థాయిలోనూ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఆ శాఖ శ్రీకారం చుట్టింది. 31 జిల్లాల్లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయాల్లో ఈ కేంద్రాల ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈనెల 28న సిద్దిపేటలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. అలాగే వచ్చే నెలలో నిజామాబాద్, వనపర్తి, గద్వాల్, కరీంనగర్, మరికొన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. పౌరసరఫరాల వ్యవస్థకు కీలకమైన మండల స్థాయి నిల్వ కేంద్రాలపై నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థకు చెందిన 171 గోదాముల్లో 1700 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంది. లోడింగ్, అన్లోడింగ్, గోదాం ప్రధాన ద్వారం, వేబ్రిడ్జి, ప్లాట్‌ఫాం, గోదాములో ప్రతి వ్యక్తి కదలికలను గుర్తించేలా ఒక్కో గోదాం వద్ద 5 నుండి 10 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాముల పరిధిలో ఏం జరుగుతున్నదీ, రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలను ప్రత్యక్షంగా వీడియో వాల్‌పై వీక్షించడానికి వీలుగా ఈ కెమెరాలను ఆయా జిల్లాల్లోని పౌరసరఫరాల కార్యాలయాలకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. 31 జిలాల్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రాలను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలోని సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. దీనివల్ల రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలతో పాటు గోదాముల్లో బియ్యం తరలింపును పర్యవేక్షించడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. -
దారికి రాని డీలర్లపై వేటు!
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్ల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రేషన్ సరుకులు తీసుకోవడానికి డీడీలు చెల్లించని, సరుకులు పంపిణీ చేయని డీలర్లను తొలగించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా డీలర్ల జాబితాను రూపొందించే పనిలో పౌరసరఫరాల శాఖ నిమగ్నమైంది. క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు రేషన్ సరుకుల కోసం డీడీలు కట్టని డీలర్లకు శనివారం వరకు వెసులుబాటు కల్పించింది. అప్పటికీ దారికిరాని డీలర్లను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. 3వ తేదీ నుంచి వారి స్థానంలో కొత్తవాళ్ల నియామక ప్రక్రియను చేపట్టాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు సూచించారు. డీడీలు కట్టకుండా సమ్మెలో పాల్గొంటున్న వారి వివరాలను, డీడీలు కట్టి సరుకులు పంపిణీ చేయని డీలర్ల జాబితాను రూపొందిస్తున్నారు. ఏయే ప్రాంతంలో డీలర్లు సమ్మెకు వెళ్తున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం: సీవీ ఆనంద్ రేషన్ డీలర్ల సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితిని సమీక్షించారని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ‘డీలర్లకు విధించిన తుది గడువులోగా డీడీలు చెల్లించాలి. లేదంటే కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా వారు ఇలా చేయడం పద్ధతి కాదు. మరోసారి చర్చలకు సిద్ధంగా ఉన్నాం’ అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఊ రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి సీఎంకు రేషన్ డీలర్ల సంఘం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ డీలర్లు చాలీచాలని కమీషన్‌తో బతుకుతున్నారని, సరిపడ ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేషన్‌డీలర్ల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం ఈ మేరకు డీలర్ల సమస్యలను పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, సభ్యుడు ఆనంద్ సీఎం కేసీఆర్‌కు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నవంబర్‌లో డీడీలు కట్టామని, మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్‌తో జరిపిన చర్చల తర్వాత సమ్మెను విరమించామని తెలిపారు. దేశంలోనే తక్కువ కమీషన్‌తో రేషన్ డీలర్లు ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు. -
రేషన్ ‘పోర్టబిలిటీ’..
ఇక ఎక్కడనుంచైనా సరుకుల పంపిణీ నేటి నుంచి 12 సర్కిల్స్‌లో అమలు సిటీబ్యూరో: నగరంలో ఇక ఎక్కడినుంచైనా రేషన్ సరుకులు తీసుకునే సౌలభ్యం వచ్చింది. చత్తీస్గడ్ తరహాలో లబ్ధిదారులు వారు నివసిస్తున్న ప్రాంతమే కాకుండా ఇతర ఏరియాల్లోనూ సరుకులు తీసుకునే పోర్టబిలిటీ విధానానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ–పాస్ పద్ధతిలో సరుకుల పంపిణీ అమలవుతుండటంతో లబ్ధిదారులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు గురువారం నుంచి పోర్టబిలిటీ విధానాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆధార్ అనుసంధానంతో ఈ–పాస్ బయోమెట్రిక్‌లో లబ్ధిదారుల పూర్తిస్థాయి డేటా ఫీడ్ కావడంతో వేలిముద్రలతో రేషన్ సరుకులు ఎక్కడ నుంచైనా తీసుకునే వెసులుబాటు కలిగినట్లయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో పన్నెండు అర్బన్ సర్కిల్ ఉండగా వాటి పరిధిలో సుమారు 1545 షాపులు ఉన్నాయి. అందులో సుమారు 11.24 లక్షలకు పైగా ఆహార భద్రత కార్డుదారులు ఉన్నారు. వాటిలో హైదరాబాద్ అర్బన్ పరిధిలోని తొమ్మిది సర్కిల్స్‌లో 5.86 లక్షలు, రంగారెడ్డి అర్బన్ పరిధిలో ఒక సర్కిల్లో 1.84 లక్షలు, మేడ్చల్ అర్బన్ పరిధిలో రెండు సర్కిల్స్‌లో 3.54 లక్షల కార్డుదారులు ఉన్నారు. ప్రస్తుతం అన్ని దుకాణాల్లో ఈ–పాస్ అమలవుతుండటంతో ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునే విధంగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. కోటా కేటాయింపు ఎలా? ఎక్కడ నుంచైనా సరుకులు పంపిణీ అమలుకు కోటా కేటాయిపుపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. షాపునకు కేటాయించిన రేషన్‌కార్డు దారుల కంటే అధిక శాతమైతే కోటా ఎలా సర్దుబాటు చేయాలనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ–పాస్ అమలు కారణంగా సుమారు 30 నుంచి 40 శాతం వరకు సరుకు మిగులుబాటు అవుతున్న కారణంగా దానిని సర్ధుబాటు చేయవచ్చని అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు గోదాముల్లో స్టాక్ పెట్టి అవసరమైన షాపుల డిమాండ్‌నుబట్టి సరుకులు సరఫరా చేస్తామని కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.