సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్ల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రేషన్ సరుకులు తీసుకోవడానికి డీడీలు చెల్లించని, సరుకులు పంపిణీ చేయని డీలర్లను తొలగించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా డీలర్ల జాబితాను రూపొందించే పనిలో పౌరసరఫరాల శాఖ నిమగ్నమైంది. క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు రేషన్ సరుకుల కోసం డీడీలు కట్టని డీలర్లకు శనివారం వరకు వెసులుబాటు కల్పించింది. అప్పటికీ దారికిరాని డీలర్లను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. 3వ తేదీ నుంచి వారి స్థానంలో కొత్తవాళ్ల నియామక ప్రక్రియను చేపట్టాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు సూచించారు. డీడీలు కట్టకుండా సమ్మెలో పాల్గొంటున్న వారి వివరాలను, డీడీలు కట్టి సరుకులు పంపిణీ చేయని డీలర్ల జాబితాను రూపొందిస్తున్నారు. ఏయే ప్రాంతంలో డీలర్లు సమ్మెకు వెళ్తున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నారు.
కఠినంగా వ్యవహరిస్తాం: సీవీ ఆనంద్
రేషన్ డీలర్ల సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితిని సమీక్షించారని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ‘డీలర్లకు విధించిన తుది గడువులోగా డీడీలు చెల్లించాలి. లేదంటే కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా వారు ఇలా చేయడం పద్ధతి కాదు. మరోసారి చర్చలకు సిద్ధంగా ఉన్నాం’ అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఊ రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
సీఎంకు రేషన్ డీలర్ల సంఘం విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ డీలర్లు చాలీచాలని కమీషన్‌తో బతుకుతున్నారని, సరిపడ ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేషన్‌డీలర్ల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం ఈ మేరకు డీలర్ల సమస్యలను పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, సభ్యుడు ఆనంద్ సీఎం కేసీఆర్‌కు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నవంబర్‌లో డీడీలు కట్టామని, మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్‌తో జరిపిన చర్చల తర్వాత సమ్మెను విరమించామని తెలిపారు. దేశంలోనే తక్కువ కమీషన్‌తో రేషన్ డీలర్లు ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment