
ఎవరినైనా పనిలో పెట్టుకునేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోవాలి
ఇటీవలి ఘటనల నేపథ్యంలో పోలీసుల సూచనలు
ఆధార్, ఓటర్ కార్డుల జిరాక్స్‌లు, ఫొటో తీసుకోవాలి
వివరాలన్నీ పోలీసులతో వెరిఫికేషన్ చేయించాలి
ప్రజా భద్రత కోసం తాము సిద్ధమంటున్న సీపీ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: ఉరుకులు పరుగుల జీవితాలు..దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తే కానీ..ఆర్థిక అవసరాలు తీరని కాలమిది. తీరికగా ఇంటిపట్టు ఉండి పనులు చేసుకోలేని ఎన్నో జంటలు పనిమనుషుల మీద ఆధారపడుతున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పెరిగే కొద్దీ ఇళ్లలో పనిచేసే వారికి డిమాండ్ పెరిగింది. అదేవిధంగా రిటైర్ అయి..పిల్లలు విదేశాల్లో ఉండే వృద్ధ దంపతుల ఇళ్లలోనూ పనిమనుషులే కీలకంగా ఉంటున్నారు. ఇలా ఇళ్లలో పనిచేస్తున్న వారిలో ఎంతోమంది నిజాయితీగానే ఉంటున్నా..కొందరు చోరీలకు, తీవ్ర నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి.
ఇటీవల హైదరాబాద్ పోలీసులు నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యాపారి ఇంట్లో పనిమనుషులు కొల్లగొట్టిన రూ.5 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు. యజమాని తన కుమార్తె పెళ్లి పనుల్లో ఉండగా చోరీ చేసి పరారయ్యారు. ఇలాంటి కేసులు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. పనిమనుషుల పూర్తి వివరాలు తెలుసుకోకుండా, వారి నేర చరిత్రను గుర్తించకుండా పనిలో పెట్టుకోవడం అనర్ధాలకు దారితీస్తోందని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నేరాలకు ఎప్పటికీ అవకాశం ఉంటుందని, పనిమనిషి, వాచ్‌మన్, తోటమాలి, డ్రైవర్ ఇలా ఎవరిని పనిలో పెట్టుకుంటున్నా..వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు సేవలందించేందుకు సిద్ధమని స్పష్టం చేస్తున్నారు.
ఏం చేయాలి..
» ఇంట్లో పనికి కుదుర్చుకునే వ్యక్తి ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్‌ల జిరాక్స్‌లు, ఫోన్ నంబర్, వీలుంటే వారి కలర్ ఫొటో తీసుకోవాలి. ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం వారనే పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
» వారి ప్రస్తుత చిరునామా..శాశ్వత చిరునామా తప్పకుండా తీసుకోవాలి.
» ఈ వివరాలన్నీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇస్తే..వారు ఆ వివరాలను తనిఖీ చేసి సదరు వ్యక్తికి నేర చరిత్ర ఉందా..? లేదా..? అన్నది నిర్ధారిస్తారు.
» నిజాయితీపరులైన పనిమనుషులకు ఇది ఒకింత ఇబ్బందే. ఈ వివరాల సేకరణ సాధారణ ప్రక్రియలో భాగంగానే అన్నట్టుగా వారికి చెప్పాలి.
» సదరు పనిమనిషి గురించి మనకు ఎవరు చెప్పారో.. వాళ్లకు సంబంధించిన యజమా నుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి.
» ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారి విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం.
» వృద్ధులు మాత్రమే ఉండే పక్షంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే..పెట్రోలింగ్ డ్యూటీలో భాగంగా వారు వచ్చి చూసే అవకాశం ఉంటుంది.
ఏం చేయకూడదు..
» ఇంట్లో పనిమనుషులు, ఇతర సహాయకులకు అవసరానికి మించి చనువు ఇవ్వొద్దు. అతి నమ్మకం పెట్టుకోవద్దు.
» ఇంటి పనివాళ్ల ముందు ఆర్థిక విషయాలను ఎప్పుడూ చర్చించవద్దు.
» మీ విలువైన వస్తువులను ఇళ్లల్లో ఉంచొద్దు. బ్యాంకులోని లాకర్లలో ఉంచడం ఉత్తమం.
» పని మనుషుల బంధువులు లేదా స్నేహితులను మీ ఇంటిని సందర్శించడానికి అనుమతించొద్దు.
» మీ ఇంట్లో పనివాళ్ల కోసం తెలిసిన వారు..వారి రాష్ట్రం, గ్రామం వారు అంటూ ఇతరులు ఎవరైనా ఎక్కువగా వస్తుంటే పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
మాకు శ్రమైనా..మీ భద్రత కోసం సిద్ధం
ఇళ్లలో పని మనుషులను, ఇతర ఉద్యోగస్తులను పెట్టుకునే ముందు వారి వివరాలను స్థానిక పోలీసు లకు అందజేస్తే..మేం ఆ వ్యక్తులకు ఏమైనా నేరాలతో సంబంధం ఉందా..? గతంలో నేర చరిత్ర ఉందా..? అన్న విషయాలను దేశ వ్యాప్తంగా ఉండే క్రిమినల్ డేటాబేస్‌లో తనిఖీ చేసి మీకు తెలియజేస్తాం. ఇది ఎంతో శ్రమతో కూడిన పని అయినా..ప్రజాభద్రత కోసం మేం ఇందుకు సిద్ధంగా ఉన్నాం. – సీవీ ఆనంద్, పోలీస్ కమిషనర్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment