
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం 28 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యం కాగా, మిగిలిన ఏడు మృతదేహాల కోసం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 ఏజెన్సీలకు చెందిన 650 మంది సభ్యులు షిఫ్టుల వారిగా సహాయక చర్యలు చేపడుతున్నారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద భారీగా ఉబికి వస్తున్న ఊటనీరు పనులకు ఆటంకంగా మారింది. ఇంకా అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోల పని ప్రారంభం కాలేదు. రోబోలకు అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటం జఠిలంగా మారింది.
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం జరిగి 28 రోజులు గడిచింది. సాంకేతిక పరిజ్జానాన్ని, నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ సహయక చర్యలు కొనసాగిసాగుతున్న ఏడుగురి మృతదేహాల ఆచూకీ దొరకడం లేదు. టన్నెల్ ప్రమాద జీరో పాయింట్ వద్ద 50 మీటర్ల పరిధిలో ప్రమాదకరంగా ఉండటంతో అక్కడ ఈ రోబోలు వినియోగించాలని నిర్ణయించారు. రోబోలు సమర్దవంతంగా పనిచేసేందుకు కావాల్సిన అదనపు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆధునాతనమైన వైర్‌లెస్ సెన్సార్ నెట్‌వర్క్ టెక్నాలజీ వాడాలని నిర్ణయించారు.
జీపీఆర్, క్యాడవర్ డాగ్స్ సూచించిన D1 నుంచి D2 అనుమానిత ప్రాంతాల్లో రెండు ఎస్కవేటర్లతో పెద్దఎత్తున తవ్వకాలు జరుపుతున్నారు. అయినా మృతదేహాల ఆచూకీ లభించడం లేదు. మరో వైపు డిజాస్టర్ మెనేజ్‌మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బాగావత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్, సింగరేణి జీఎం బైద్య నిత్యం ఉదయం, సాయంత్రం సహాయ బృందాల హెడ్స్‌తో సమీక్షలు నిర్వహిస్తూ వారికి కావాల్సిన సూచనలు, సలహాలు, పరికరాలు సమకూర్చుతున్నారు. గడిచిన 28 రోజులుగా తమ వారి ఆచూకీ కోసం ఓవైపు జార్ఖండ్ పంజాబ్ జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన భాధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
భారీగా ఊరుతున్న సిపేజ్ వాటర్ బురదను తొలగించడం కష్టంగా మారింది దక్షిణ మధ్య రైల్వే వారి సహకారంతో ప్లాస్మా కట్టర్స్ థర్మల్ కట్టర్స్ తో టిబిఎం మిషన్ విభాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా, బురదను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 800 టన్నుల స్టీల్‌ను లోకో ట్రైన్ ద్వారా, 800 టన్నుల మట్టిని కన్వేయర్ బెల్టు ద్వారా బయటకు తరలించారు మొత్తంగా సహాయ చర్యలు ముమ్మరం చేసినా భారీగా పేరుకుపోయిన శిథిలాలు బురద ఊటనీరుతో సహాయకచర్లకు అడుగడుగున ఆటంకాలుఎదురవు తున్నాయి.
రోబోల వినియోగానికి నెట్ వర్క్ సమస్యతో పాటు.. మిగిలిన పనులకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మార్లు క్యాడవర్ డాగ్స్‌ను టన్నెల్లోకి పంపి శోదన చేయించారు.అయితే జీరో పాయింట్ వద్ద మనుషులు వెళ్లి పనిచేయటం ప్రమాదమని సహాయక బృందాలు అభిప్రాయపడుతున్నాయి. అవిశ్రాంతంగా చేస్తున్న తమ కృషి ఫలిస్తుందని ధీమాతో సహాయక చర్యలు మాత్రం షిఫ్ట్ ల వారీగా కొనసాగిస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment