
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మూడు మృతదేహాల స్పాట్స్‌ను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. జీపీఆర్ ద్వారా మార్క్ చేసిన ప్రదేశంలోనే క్యాడవర్ డాగ్స్ ఆగాయి. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్‌ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను దోమలపెంటకు రప్పించింది.

నేషనల్ డిజా స్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్‌సింగ్‌తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది.

శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్‌తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.
8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు గల్లంతైన వారి జాడ దొరకలేదు.12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది సభ్యులు నిరంతం షిఫ్టుల వారిగా సహయక చర్యల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇవాళ టన్నెల్‌లో చిక్కుకున్న వారి అచూకీ కనుగొనేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన రెండు క్యాడవర్ డాగ్స్‌ను సొరంగంలోకి పంపించారు. ఉదయం ఏడున్నర గంటలకు లోకో ట్రైన్‌లో వాటిని లోపలికి తీసుకెళ్లారు. తిరిగి మధ్యాహ్నం రెండున్నరకు బయటకు తీసుకొచ్చారు. తప్పిపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను డాగ్స్ గుర్తించినట్టు చెబుతున్నారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు.
టన్నెల్‌లోకి నలుగురు సభ్యులతో కూడిన ఎన్‌వీ రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. వారితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా వెళ్లి అందులో అధ్యయనం చేశారు. మరో వైపు కన్వేయర్ బెల్ట్ కూడ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావటంతో సహయచర్యలు వేగవంతమయ్యాయి. సొరంగంలో కూరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మాకట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు.
టీబీఎంపై ఉన్న మట్టిని వాటర్‌గన్‌తో తొలగిస్తున్నారు. కాని జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో జరుపుతున్న తవ్వకాల్లో పెద్దఎత్తున సీఫేజ్ వాటర్ వస్తుండటంతో సహయక చర్యలకు కొంత అవరోధం ఏర్పడుతుంది. మరోవైపు అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సీఫేజ్ వాటర్‌ను త్వరిత గతిన బయటికి పంపే ప్రక్రియను చేపడుతున్నారు. మొత్తంగా టన్నెల్‌లో ఇరుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అనేక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ 8 మంది ఆచూకీ దొరకపోవటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. గడచిన 14 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment