
సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకులను తరలించే లారీలకు జీపీఎస్, వాటి కదలికలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్, ఈ–పాస్ విధానం ద్వారా సరుకుల పంపిణీ... ఇలా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు కళ్లెంవేస్తున్న పౌరసరఫరాల శాఖ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. గత ఏడాది హైదరాబాద్ పౌరసరఫరాల భవన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అత్యుత్తమ ఫలితాలనిస్తుండటంతో క్షేత్రస్థాయిలోనూ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఆ శాఖ శ్రీకారం చుట్టింది. 31 జిల్లాల్లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయాల్లో ఈ కేంద్రాల ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఈనెల 28న సిద్దిపేటలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. అలాగే వచ్చే నెలలో నిజామాబాద్, వనపర్తి, గద్వాల్, కరీంనగర్, మరికొన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. పౌరసరఫరాల వ్యవస్థకు కీలకమైన మండల స్థాయి నిల్వ కేంద్రాలపై నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థకు చెందిన 171 గోదాముల్లో 1700 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంది. లోడింగ్, అన్‌లోడింగ్, గోదాం ప్రధాన ద్వారం, వేబ్రిడ్జి, ప్లాట్‌ఫాం, గోదాములో ప్రతి వ్యక్తి కదలికలను గుర్తించేలా ఒక్కో గోదాం వద్ద 5 నుండి 10 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాముల పరిధిలో ఏం జరుగుతున్నదీ, రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలను ప్రత్యక్షంగా వీడియో వాల్‌పై వీక్షించడానికి వీలుగా ఈ కెమెరాలను ఆయా జిల్లాల్లోని పౌరసరఫరాల కార్యాలయాలకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. 31 జిలాల్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రాలను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలోని సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. దీనివల్ల రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలతో పాటు గోదాముల్లో బియ్యం తరలింపును పర్యవేక్షించడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment