ఉద్యోగుల సహకారంతోనే సంస్కరణలు
పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: అవినీతి నిర్మూలన, పారదర్శకత, వినియోగదారులకు మెరుగైన సేవలు, ఉద్యోగుల్లో నిబద్ధత, సమయపాలన పాటించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్లే పౌరసరఫరాల శాఖలో సంస్కరణలు సాధ్యమయ్యాయని ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఉద్యోగుల సహకారంతో ఇవన్ని సాకారమయ్యాయని, సీఎం కేసీఆర్ ప్రశంసలూ దక్కాయని చెప్పారు. పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, రైస్ మిల్లర్లు, రేషన్ డీలర్లు శనివారం కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది ఒక్కరి విజయం కాదు. నన్ను అభినందిస్తే మీ అందరినీ అభినందించినట్లే. పౌర సరఫరాల శాఖలోని ప్రతి ఉద్యోగి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది’అని పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖకు మంచి పేరు రావడానికి సంబంధిత శాఖ మంత్రి ఈటల రాజేందర్ సహకారం కూడా ఎంతో ఉందన్నారు. ఇక రేషన్ షాపుల్లో సంస్కరణలు చేపట్టి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సి ఉందని వివరించారు.