పేదలకు వరం.. వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్ | One Nation One Ration Is Gift To Poor People | Sakshi
Sakshi News home page

పేదలకు వరం.. వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్

Published Wed, Aug 12 2020 4:43 AM | Last Updated on Wed, Aug 12 2020 7:25 AM

One Nation One Ration Is Gift To Poor People - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ఉపాధి కోసం పేదలు ఏ రాష్ట్రానికి వెళ్లినా వారికి అక్కడే సరుకులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డు’ పథకం ద్వారా అంతర్రాష్ట్ర రేషన్‌ కార్డు పోర్టబిలిటీ విధానాన్ని దేశవ్యాప్తంగా మార్చి 2021 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తెలంగాణలో నివాసం ఉంటున్న ఏపీకి చెందిన వారికి కరోనా కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచిత సరుకులు అందాలనే ఉద్దేశంతో అంతర్రాష్ట్ర పోర్టబిలిటీ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఈ నెల నుంచి పకడ్బందీగా అమలు చేయాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి. 

► వలస కూలీలు ఎక్కడ ఉన్నా అక్కడి రేషన్‌ షాపుల్లో తమ రేషన్‌ను పొందేందుకు ఈ విధానం వీలు కల్పిస్తుంది. 
► వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డ్‌ పోర్టబిలిటీ ద్వారా రాష్ట్రానికి చెందిన పలువురు తెలంగాణలో ఉచితంగా సరుకులు అందుకున్నారు.
► అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వంద మందికి పైగా తెలంగాణలోని వివిధ రేషన్‌ షాపుల్లో మంగళవారం ఈ–పాస్‌ మిషన్‌లో వేలి ముద్రలు వేసి బియ్యంతో పాటు కందిపప్పు తీసుకున్నారు.  
► మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పోర్టబిలిటీ త్వరలో అందుబాటులోకి రానుంది.
► రాష్ట్రంలో తొమ్మిదవ విడత ఉచిత సరుకుల పంపిణీలో భాగంగా మంగళవారానికి దాదాపు 1.12 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి.
► రాష్ట్ర పరిధిలో పోర్టబిలిటీ ద్వారా వివిధ జిల్లాల్లో 32.56 లక్షల కుటుంబాలు సరుకులు తీసుకున్నారు.

పోర్టబిలిటీతో అక్కడే...
మన రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువ మంది తెలంగాణలో ఉంటున్నారు. గతంలో ఇలాంటి వాళ్లు సొంతూళ్లకు వచ్చి సరుకులు తీసుకునే వారు. ఇప్పుడు వాళ్లు అక్కడే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారులు సరుకులు తీసుకోవచ్చు.     
– కోన శశిధర్, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement