Insurance portability: ప్రస్తుత హెల్త్‌ పాలసీ నచ్చడం లేదా? మరో పాలసీకి మారిపోండిలా.. | Health Insurance Portability Benefits And Requirements - Sakshi
Sakshi News home page

Insurance portability: ప్రస్తుత హెల్త్‌ పాలసీ నచ్చడం లేదా? మరో పాలసీకి మారిపోండిలా..

Published Mon, Apr 17 2023 7:59 AM | Last Updated on Mon, Apr 17 2023 4:10 PM

health Insurance portability benefits and requirements - Sakshi

హైదరాబాద్‌కు చెందిన క్రాంతి కుమార్‌ గతేడాది అత్యవసరంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. సింగిల్‌ ఏసీ రూమ్‌ను ఆయన ఆసుపత్రిలో తీసుకున్నారు. మూడు రోజులకు కలిపి రూ.88,000 బిల్లు వచ్చింది. అతడికి రూ.4 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉండడంతో నిశ్చింతగా ఉన్నాడు. కానీ, బీమా సంస్థ నుంచి పూర్తి పరిహారం అందలేదు. క్రాంతి తన వంతుగా రూ.33,000ను చెల్లించాల్సి వచ్చింది. అదేమని ప్రశ్నించగా.. బీమా కవరేజీలో రూమ్‌ రెంట్‌ పరిమితి 1 శాతంగా ఉంది. కానీ, అతడు ఎంపిక చేసుకున్న రూమ్‌ రోజువారీ అద్దె 1 శాతం కంటే మించి ఉంది. ఈ షరతు చూసిన తర్వాత అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో కొత్త ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. ఇది క్రాంతి కుమార్‌ ఒక్కడికే ఎదురైన పరిస్థితి అనుకోవద్దు. దశాబ్దం క్రితం హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకుని,  కొనసాగుతున్న వారంతా ఎదుర్కొంటున్నారు.

క్లెయిమ్‌ పరిష్కారాల్లో జాప్యం, ఏదో రకమైన కొర్రీ పెట్టి తక్కువ పరిహారాన్ని చెల్లించడం, అధిక ప్రీమియం వసూలు లేదా నాసిరకమైన సేవలతో సరిపెట్టడం.. ఇలా ఎన్నో కారణాలతో పాలసీదారులు ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. వైద్య రంగంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉంటోంది. దీంతో చికిత్సల వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ ఫలితంగా ఎన్నో సర్జరీలకు హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం ఏర్పడడం లేదు. అదే రోజు డిశ్చార్జ్‌ అయి వెళ్లొచ్చు. ఒకవైపు ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్నప్పటికీ.. మరోవైపు జీవనశైలి వ్యాధులతో ఔట్‌ పేషెంట్‌ సేవల అవసరం పెరుగుతోంది.

మారుతున్న ఈ అవసరాలు అన్నీ మన ఆరోగ్య బీమా కవరేజీలో భాగంగా ఉన్నప్పుడు అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. అందుకే సమగ్రమైన హెల్త్‌ కవరేజీతో ఇన్సూరెన్స్‌ పాలసీ ఉండాలి. ఇప్పటికే తీసుకున్న పాలసీ సమగ్ర కవరేజీకి భరోసా ఇవ్వనట్టయితే.. చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుంటే, బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోతే, ప్రీమియం భారంగా మారితే అప్పుడు మన ముందు రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి బీమా సంస్థను మార్చడం. లేదంటే ప్రస్తుత సంస్థలోనే మెరుగైన ప్లాన్‌కు మారిపోవడం (మైగ్రేషన్‌). వీటి గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం మీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సేవల పట్ల సంతృప్తిగానే ఉండి, పాలసీలోని కవరేజీ ఫీచర్లు, ప్రీమియం విషయంలో సంతృప్తిగా లేకపోతే అప్పుడు మీ ప్లాన్‌ను పోర్టింగ్‌ పెట్టుకోవడానికి బదులు, అదే బీమా సంస్థలో మెరుగైన ఫీచర్లతో కూడిన మరో ప్లాన్‌ను మైగ్రేట్‌ అవ్వడం మంచి నిర్ణయం అవుతుంది. పోర్టింగ్‌ అంటే ప్రస్తుత బీమా సంస్థను వీడి, మరో బీమా సంస్థకు మారిపోవడం. మైగ్రేషన్‌ అంటే ప్రస్తుత బీమా సంస్థలోనే మరో ప్లాన్‌కు మారిపోవడం. ‘‘హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నిబంధనల కింద ఒక వ్యక్తి తన పాలసీని ఎలాంటి బ్రేక్‌ లేకుండా వరుసగా నాలుగేళ్ల పాటు రెన్యువల్‌ చేసుకుంటే, అప్పుడు ప్రస్తుత బీమా ప్లాన్‌ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మైగ్రేషన్‌కు అర్హత లభిస్తుంది’’అని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ రిటైల్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ పార్థానిల్‌ ఘోష్‌ తెలిపారు.     

ఎప్పుడు మార్చుకోవాలి..? 
‘‘కస్టమర్లు ప్రస్తుత హెల్త్‌ ప్లాన్‌ కవరేజీ పట్ల అసంతృప్తితో ఉంటే లేదా ప్రస్తుత బీమా సంస్థ సేవలు నచ్చకపోతే లేదా సమగ్రమైన, వినూత్నమైన బీమా పాలసీ అందుబాటు ప్రీమియానికి లభిస్తుంటే పోర్ట్‌ పెట్టుకోవచ్చు. కాకపోతే నూతన పాలసీ ప్రయోజనాలు, నూతన సంస్థ సేవల సదుపాయాలను ప్రధానంగా చూడాలి’’అని షా సూచించారు. ‘‘మార్కెట్లో ఉన్న ప్రతీ నూతన ఉత్పత్తి అందరికీ సరిపోకపోవచ్చు. వేరొక సంస్థలోని ప్లాన్‌లో ఉన్న ఆకర్షణీమయైన ఫీచర్లను చూసి మారిపోవడం సరికాదు. మీ అవసరాలు, కుటుంబ సభ్యులు, వయసు తదితర అంశాల ఆధారంగా కొత్త ఉత్పత్తిని మదింపు వేయాలి’’అని నివా బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అండర్‌ రైటింగ్‌ డైరెక్టర్‌ బబతోష్‌ మిశ్రా పేర్కొన్నారు.

ప్రస్తుత బీమా సంస్థ సేవలు సంతృప్తికరంగా లేకపోయినా, కస్టమర్‌ సేవలు నచ్చకపోయినా, ప్రస్తుత బీమా సంస్థ అందిస్తున్న సేవలు నాసిరకంగా ఉన్నా, సరైన కారణాలు చూపకుండా క్లెయిమ్‌ను తిరస్కరించినా అప్పుడు మారిపోవడాన్ని పరిశీలించొచ్చని యూనివర్సల్‌ సోంపో జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో శరద్‌ మాథుర్‌ సూచించారు. సరైన సమాచారం పొందలేకపోవడం, పారదర్శకత లేమి, కంపెనీ నుంచి సత్వర స్పందన లేకపోవడం, విలువ ఆధారిత సేవలు లేకపోయినా పోర్టింగ్‌ను పరిశీలించొచ్చని తెలిపారు.  

ఇప్పటికే బీమా పాలసీ ఉండి, అందులోని నిబంధనల వల్ల సొంతంగా చెల్లింపులు చేసుకోవాల్సి వస్తుంటే, రూమ్‌ రెంట్‌ పరంగా ఉప పరిమితులు ఉంటే, మీకు దీర్ఘకాలిక వ్యాధి ఉండి ఓపీడీ లేదా డేకేర్‌ కవరేజీ లేకపోతే, మీ ప్లాన్‌లో రీస్టోరేషన్‌ (బీమా ఖర్చయితే తిరిగి పునరుద్ధరించడం) ఫీచర్‌ లేకపోయినా, ముందు నుంచి ఉన్న వ్యాధులకు దీర్ఘకాలం వెయిటింగ్‌ పీరియడ్‌ ఉన్నా, అప్పుడు మీ వంతు ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. దీనికి బదులు వేరొక ప్లాన్‌కు మారిపోవడమే నయం. ఉదాహరణకు నివాబూపా సంస్థ రెండు గంటలకు మించి హాస్పిటలైజేషన్‌ అయితే చాలు చెల్లింపులు చేస్తోంది.

అదే ఆదిత్య బిర్లా సంస్థ అయితే ఆరోగ్యకర జీవనశైలిని (కంపెనీ చెప్పినట్టు) అనుసరిస్తే అప్పడు ప్రీమియంలో నూరు శాతం వరకు రాయితీని ఆఫర్‌ చేస్తోంది. సాధారణంగా పోర్టింగ్‌ లేదా మైగ్రేషన్‌కు ప్రీమియం ఒక్కటినే ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకంటే అన్ని బీమా సంస్థలు కొన్నేళ్లకోసారి ప్రీమియంను సవరిస్తుంటాయి. అలాగే వయసు వారీగా కూడా ప్రీమియం పెంపు ఉంటుంది. అలాగే, బీమా కవరేజీని పెంచుకునేందుకు సైతం పోర్టింగ్‌ సరికాదు. దీనికి బదులు టాపప్‌ లేదా సూపర్‌ టాపప్‌ రూపంలో అదనపు కవరేజీని యాక్టివేట్‌ చేసుకోవచ్చు. బేసిక్‌ ప్లాన్‌ కవరేజీకి మించి క్లెయిమ్‌ వచ్చిన సందర్భాల్లోనే టాపప్, సూపర్‌ టాపప్‌ చెల్లింపులు చేస్తాయి. 

ఏమి చూడాలి..? 
మీ అవసరాలకు సరిపడే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. పాలసీ వర్డింగ్స్, పాలసీ బ్రోచర్‌ను అన్ని పేజీలు చదివితే పూర్తి వివరాలు తెలుస్తాయి. తద్వారా ప్లాన్‌ ఆకర్షణీయమా? కాదా? అన్నది చూడొచ్చు. క్లెయిమ్‌ పరిష్కారాల విషయంలో నూతన సంస్థ పనితీరును విశ్లేషించాలి. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ నిష్పత్తి, క్లెయిమ్‌ చెల్లింపుల సామర్థ్యాలను చూడాలి. క్లెయిమ్‌ అభ్యర్థనలను ప్రాసెస్‌ చేయడంతో బీమా సంస్థల స్పందనను చూడాలి. ప్రీమియం ఎక్కువ ఉన్నా సరే, క్లెయిమ్‌ సమయంలో పాలసీదారులపై చెల్లింపుల భారం పడని పాలసీని ఎంపిక చేసుకోవాలి.

ఓపీడీ కవరేజీ, డేకేర్, రీస్టోరేషన్‌ కూడా ఉండాలి. ఒక పాలసీ సంవత్సరంలో ఒక క్లెయిమ్‌ వల్ల బీమా కవరేజీ మొత్తం ఖర్చయినప్పుడు.. రీస్టోరేషన్‌ కింద బీమా సంస్థ అంతే మొత్తాన్ని పునరుద్ధరిస్తుంది. దీనివల్ల అదే ఏడాది మళ్లీ ఆసుపత్రిలో చికిత్స అవసరం పడితే క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇందులోనూ కొన్ని సంస్థలు ఒక ఏడాదిలో ఒకరు ఎన్ని సార్లు ఆసుపత్రిలో చేరినా, గతంలో క్లెయిమ్‌ చేసిన వ్యాధులకు సైతం రీస్టోరేషన్‌ (అన్‌ లిమిటెడ్‌) ఇస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. ముందు నుంచి ఉన్న వ్యాధులకు సాధారణంగా 3–4 ఏళ్ల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది.

దీనివల్ల వాటికి కవరేజీ కోసం అన్నేళ్లు ఆగక తప్పదు. దీనికి బదులు ఏడాది, అసలు వెయిటింగ్‌ పీరియడ్‌ లేని (రైడర్‌) పాలసీలు మెరుగైనవి. నో క్లెయిమ్‌ బోనస్‌ అనేది ప్రీమియం తగ్గింపు రూపంలో కాకుండా, బీమా కవరేజీ పెంపు రూపంలో ఉంటే ఎక్కువ ప్రయోజనం. రూమ్‌ రెంట్‌ పరిమితులు లేకుండా చూసుకోవాలి.  ఇంటి నుంచే చికిత్స తీసుకోవాల్సి వస్తే (కరోనా వంటి సమయాల్లో) కవరేజీనిచ్చే డోమిసిలరీ ట్రీట్‌మెంట్‌ కవరేజీ ఫీచర్‌ ఉంటే మంచిదే.  

దరఖాస్తు తిరస్కరణ..? 
మంచి ఆరోగ్య చరిత్ర ఉండి, సరైన వివరాలు, డాక్యుమెంట్లు అందిస్తే నూతన సంస్థ పోర్టింగ్‌ అభ్యర్థనను ఆమోదించి పాలసీ మంజూరు చేస్తుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండి, ఇచ్చిన సమాచారంలో అస్పష్టత, గోప్యత ఉంటే, లేదా ఇతర కారణాలతో పాలసీ ప్రపోజల్‌ను తిరస్కరించొచ్చు. ఎందుకంటే అప్పటికే ఉన్న ఆరోగ్య చరిత్రను పాత సంస్థ నుంచి నూతన బీమా సంస్థ తీసుకుంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. పాత బీమా సంస్థకు దరఖాస్తు సమయంలో ఇచ్చిన దానికి భిన్నమైన సమాచారం కొత్త సంస్థకు అందించినట్టయితే తిరస్కరణకు అవకాశాలుంటాయి.

అటువంటి సందర్భంలో కొత్త సంస్థను బతిమిలాడే బదులు, ఉన్న సంస్థతోనే కొనసాగడం మంచి నిర్ణయం అవుతుంది. దీనికి బదులు ప్రస్తుత బీమా సంస్థలోనే మెరుగైన ఫీచర్లతో కూడిన ప్లాన్‌కు మైగ్రేట్‌ అవ్వడం మరో మంచి ఆప్షన్‌. అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే, పోర్టింగ్‌ దరఖాస్తును ఆమోదించాలనేమీ లేదు. ముఖ్యంగా తనకున్న వ్యాధులకు పాత ప్లాన్‌లో క్లెయిమ్‌ చేసుకుని ఉంటే పోర్టింగ్‌ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాత పాలసీ రెన్యువల్‌కు సంబంధించి ల్యాప్సెస్‌ ఉంటే అది కూడా తిరస్కరణకు కారణం అవుతుంది. నిబంధనల మేరకు రెన్యువల్‌ సమయంలో సంప్రదించకుంటే అప్పుడు పోర్టింగ్‌ విజయవంతం కాదు. అందుకే  రెన్యువల్‌కు 60రోజుల ముందు సంప్రదించాలి. 70 ఏళ్లు దాటిన వారికి పోర్టింగ్‌కు అవకాశం ఉండదు.

పోర్టింగ్‌ ఎలా..?
నూతన సంస్థకు మారిపోవాలని నిర్ణయించుకుంటే రెన్యువల్‌ సమయంలోనే అనుమతిస్తారు. పాలసీ రెన్యువల్‌ తేదీకి 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు నూతన బీమా సంస్థకు పోర్టింగ్‌ గురించి తెలియజేయాలి. ఈ సమయంలో వీలు కాకపోతే, తిరిగి రెన్యువల్‌ వరకు వేచి చూడాల్సిందే. ప్రపోజల్‌ పత్రం, పోర్టబులిటీ దరఖాస్తు పత్రాలను నింపాలి. ఆరోగ్య చరిత్ర, బీమా సంస్థ కోరిన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కేవైసీ, ఇతర పత్రాలను కూడా అందించాలి. గత పాలసీ పరిధిలో క్లెయిమ్‌ చేసి ఉంటే, డిశ్చార్జ్‌ సమ్మరీ జోడించాలి. అనంతరం ప్రస్తుతం బీమా సంస్థకు పోర్టింగ్‌ సమాచారం వెళుతుంది. అప్పుడు ప్రస్తుత సంస్థ సదరు పాలసీదారుకు సంబంధించి క్లెయిమ్, ఇతర సమాచారాన్ని కొత్త సంస్థతో పంచుకోవాలి. అప్పుడు నూతన బీమా సంస్థ 15 రోజుల్లోపు తన నిర్ణయాన్ని తెలియజేస్తుంది. పాలసీ దరఖాస్తును ఆమోదిస్తే ప్రీమియం చెల్లించాలి.

వీటిని గమనించాలి..

  • పోర్టింగ్‌ సమయంలో పాత ప్లాన్‌లో నో క్లెయిమ్‌ బోనస్‌ ప్రయోజనాలు ఉంటే, కొత్త ప్లాన్‌లోనూ జతవుతాయి. కానీ, దీనికి కంపెనీలు షరతు పెడుతున్నాయి. ప్రస్తుత కవరేజీ రూ. 5 లక్షలు ఉండి, కొత్త సంస్థలోనూ రూ.5 లక్షలే తీసుకుంటే, పాత ప్లాన్‌ పరిధిలోని నో క్లెయిమ్‌ బోనస్‌ పోర్టింగ్‌ అవ్వదు. అదే రూ.6 లక్షలు తీసుకుంటే నో క్లెయిమ్‌ బోనస్‌ కలుస్తుంది.  
  • పోర్టింగ్‌ లేదా మైగ్రేషన్‌ను కొత్త ప్రపోజల్‌గానే బీమా సంస్థలు పరిగణిస్తాయి. అండర్‌రైటింగ్‌ నిబంధనల మేరకు ప్రీమియం నిర్ణయిస్తాయి.  
  • బేసిక్‌ ఇండెమ్నిటీ ప్లాన్‌ను మాత్రమే మరో బీమా సంస్థ పరిధిలోని బీమా ఇండెమ్నిటీ ప్లాన్‌కు మార్చుకోగలరు. అంతేకానీ, టాపప్‌ లేదా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ను మార్చుకోలేరు.  
  • ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు హెల్త్‌ ప్లాన్‌ను పోర్టింగ్‌ పెట్టుకుంటే ఎలాంటి చార్జీల్లేవు.  
  • కార్పొరేట్‌ లేదా గ్రూప్‌ ప్లాన్లల ఉన్న వారికి ఇండివిడ్యువల్‌ ప్లాన్‌కు పోర్టింగ్‌ అవకాశం లేదు. వారు అదే సంస్థతో కొసాగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement